రాజన్న సిరిసిల్ల/ కరీంనగర్, జూలై 23, (నమస్తే తెలంగాణ);తన పుట్టిన రోజున హంగూ ఆర్భాటాలకు పోకుండా సేవా కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి కేటీఆర్ అభిమానులకు పిలుపునిచ్చి మరోసారి తనదైన ముద్ర వేసుకున్నారు. ఇప్పటికే ‘గిఫ్ట్ ఏ స్మైల్’ పేరుతో ఏటా వినూత్న కార్యక్రమాలకు పిలుపునిచ్చిన ఆయన, తాజాగా వరద బాధితులకు సాయం చేయాలని సూచించారు. ఇప్పటికే అభాగ్యులు మాత్రం కష్టమొస్తే మంత్రి రామన్నను తలుచుకుంటారు.. ప్రజల కష్టాలు, కన్నీళ్లలో తోడుగా నిలిచే ఆయనకు విన్నవిస్తుంటారు.. కలిసి చెప్పుకున్నా, లేదా వాట్సాప్ ద్వారా చేరవేసినా, ట్విట్టర్ ద్వారా విన్నవించుకున్నా ఆ అమాత్యుడు వెంటనే ఆపన్నహస్తం అందిస్తున్నారు.. విద్య, వైద్యం, ఆర్థిక, గల్ఫ్.. ఇలా సమస్య ఏదైనా తక్షణమే స్పందిస్తున్నారు.. కష్టాలు తెలుసుకొని మరీ పరిష్కారం చూపుతున్నారు.. ఆపద సమయాల్లో వేలాది మందికి సాయమందిస్తూ, ఆపద్బాంధవుడవుతున్నారు. ఇలా.. రాష్ట్రవ్యాప్తంగా ఎంతో మంది హృదయాల్లో చెదరని ముద్ర వేసుకున్నారు.. నేడు మనసున్న రామన్న పుట్టిన రోజు సందర్భంగా ‘నమస్తే’ అందిస్తున్న ప్రత్యేక కథనం..
ఆపదలో ఉన్నాం.. ఆదుకోండి..! అని అభ్యర్థిస్తే సాయం చేసేవారు కొందరైతే కష్టాల్లో ఉన్నారని తెలిస్తే చాలు అలాంటి అభాగ్యులకు అండగా నిలుస్తూ కొండంత ధైర్యం నింపుతున్నారు రాష్ట్ర ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు. తనకు నేరుగా సమస్య విన్నవించినా.. లేదా సామాజిక మాధ్యమాల్లో ఆయన దృష్టికి వెళ్లినా తక్షణం స్పందిస్తూ భరోసా కల్పిస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా ఆపదలో ఉన్న నిరుపేదలకు సాయం చేస్తున్నారు. ఇక తన పుట్టినరోజు నాడు నలుగురికి ఉపయోగపడే మంచిపని చేయాలని పరితపించే ఆయన ఏటా వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు.
గతంలో తన పుట్టినరోజును ఆడంబరంగా జరుపవద్దని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు. రెండేళ్ల కిందట ‘గిఫ్ట్ ఏ స్మైల్ ప్రోగ్రాం’ చేపట్టి సకలవసతులు కలిగిన అంబులెన్స్‌లు విరాళంగా ఇవ్వడమే కాకుండా, తన పుట్టిన రోజు కానుకగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఇవ్వాలని పిలుపునివ్వడంతో వారు సైతం ముందుకు వచ్చి 100 అంబులెన్స్‌లను అందజేశారు. ఇవి ప్రస్తుతం వేలాది మంది రోగులను, క్షతగాత్రులను, కరోనా బాధితులను సకాలంలో దవాఖానలకు తరలించి ప్రాణాలను కాపాడాయి. గతేడాది మరో మానవతా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వందమంది దివ్యాంగులకు మూడుచక్రాల మోటార్‌సైకిళ్లు అందజేస్తానని ప్రకటించి, టీఆర్ఎస్ నేతలు, ఇతరులు మానవతా దృక్పథంతో ముందుకొచ్చి అవసరంలో ఉన్నవారికి సాయం చేయాలని ట్విట్టర్ వేదికగా పిలుపునివ్వడంతో అనేక మంది దివ్యాంగులకు మూడు చక్రాల మోటర్ సైకిళ్లు అందాయి.
అంతే కాకుండా పూల బొకేలు, కేకులు, కటౌట్ల కోసం డబ్బులు వృథా చేయకుండా ముక్కోటి వృక్షార్చనలో పాల్గొని ఒక మొక్క నాటాలని మరో ట్వీట్లో తన అభిమానులు, మిత్రులు, ప్రజాప్రతినిధులను కోరడంతో కోట్లాది మొక్కలు నాటి, వాటిని సంరక్షించారు. ఫలితంగా పచ్చదనం మరింత పెరిగింది. ఈసారి వరద బాధితులకు తోచిన ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమం ద్వారా సాయం అందించాలని పిలుపునివ్వడంతో మరోసారి తమ అభిమాన నేత పుట్టిన రోజున ఆదుకుని అండగా ఉండేందుకు సిద్ధమవుతున్నారు.