కరీంనగర్, జూలై 23 (నమస్తే తెలంగాణ)/ తిమ్మాపూర్ రూరల్ : వర్షం దంచికొడుతున్నది. మునుపెన్నడూ లేని విధంగా జూలైలోనే విజృంభిస్తున్నది. ఇటీవల వారం పాటు కుండపోతపోసి తెరిపినిచ్చిన వాన శనివారం ఉదయం నుంచీ మళ్లీ మొదలైంది. అప్పుడప్పుడు విరామం ఇస్తూ సాయంత్రం దాకా గట్టిగా కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, చెరువులు, కుంటల్లోకి వరద కొనసాగింది. ఇటు మోయతుమ్మెద, అటు ఎస్సారార్ నుంచి ఎల్ఎండీకి భారీగా వరద వస్తుండగా, అప్రమత్తమైన యంత్రాంగం 20 గేట్లు ఎత్తి దిగువకు వదులుతున్నది. మొత్తంగా జిల్లాలో 50.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని, మరో మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురియవచ్చని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నది.
మోయతుమ్మెద వాగు ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండడం, శ్రీ రాజరాజేశ్వర జలాశయం నుంచి పెద్ద మొత్తంలో నీటిని విడుదల చేస్తున్న కారణంగా ఎల్ఎండీ రిజర్వాయర్లో నీటి మట్టం గంట గంటకూ పెరుగుతున్నది. వారం క్రితం వరకు కేవలం తొమ్మిది టీఎంసీలు మాత్రమే ఉన్నా.. నాలుగైదు రోజుల నుంచి వరద భారీగా వస్తున్నది. రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 24.034 టీఎంసీలు కాగా, శనివారం మధ్యాహ్నం వరకు 21.505 టీఎంసీలకు చేరుకున్నది. ఇటు వాగు, అటు శ్రీ రాజరాజేశ్వర జలాశయం ద్వారా వరద ఇంకా భారీగా వచ్చే అవకాశం ఉండడంతో ఎస్సారెస్పీ అధికారులు అప్రమత్తమయ్యారు. శనివారం ఉదయం 11 గంటల తర్వాత కలెక్టర్ ఆర్వీ కర్ణన్ స్విచ్ఛాన్ చేసి నాలుగు గేట్లు తెరిచి నీటిని దిగువకు వదిలారు. పై నుంచి ఇంకా వరద ఉధృతి పెరుగుతుండడంతో మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో మరో పది గేట్లను ఎత్తారు. సాయంత్రం 4.30 గంటల వరకు మరో రెండు, రాత్రి 8 గంటల తర్వాత ఇంకో నాలుగు గేట్లను ఎత్తారు. మొత్తం 20 గేట్లను ఓపెన్ చేసి 37 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. గేట్లు ఎత్తడంతో మానేరు అందాలను చూసేందుకు ప్రజలు బారులు తీరారు. ఇటు గేట్ల వద్ద, అటు మానేరు వంతెనపై నుంచి తిలకించి, సెల్ఫీలు దిగారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్
ఎల్ఎండీ రిజర్వాయర్ గేట్లు ఎత్తిన నేపథ్యంలో మానేరు పరీవాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ సూచించారు. వాగులోకి ఎవరూ వెళ్లవద్దని హెచ్చరించారు. మానేరు పరివాహక ప్రాంతాలైన తిమ్మాపూర్, మానకొండూర్, వీణవంక మండలాల రెవెన్యూ, పోలీస్శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎల్ఎండీ ఎస్ఈ శివకుమార్, ఈఈ నాగభూషణ్రావు, జడ్పీ సీఈవో ప్రియాంక, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, కరీంనగర్ అర్బన్ తహసీల్దార్ సుధాకర్, తిమ్మాపూర్ తహసీల్దార్ శ్రీవాణి, ఎల్ఎండీ ఇంజినీర్లు, సిబ్బంది, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.