జగిత్యాలటౌన్/ జగిత్యాల రూరల్, జూలై 23: స్వరాష్ట్రంలోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతున్నదని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. దేశంలో ఎక్కడాలేనివిధంగా రాష్ట్రంలో 132 స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని కొనియాడారు. శనివారం ఆయన జగిత్యాల శివారు మోతె రోడ్డులో నిర్మించిన బీసీ స్టడీ సర్కిల్‌ను ప్రారంభించారు. అనంతరం పట్టణంలోని ఓ పంక్షన్హాల్లో నిర్వహించిన జగిత్యాల ఏఎంసీ పాలకవర్గం ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. చైర్పర్సన్ నక్కల రాధారవీందర్రెడ్డి, వైస్ చైర్మన్ ఆసిఫ్‌ను అభినందించారు. ఆయాచోట్ల మంత్రి మాట్లాడారు. సర్కారు బడుల రూపురేఖలు మార్చేందుకే ప్రభుత్వం మన ఊరు-మన బడి పథకాన్ని అమలు చేస్తున్నదన్నారు. గవర్నమెంట్ దవాఖానల్లో మెరుగైన వసతులు కల్పించడంతో 80 శాతం ప్రసవాలు జరుగుతున్నాయన్నారు.
విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, గురుకులాల ఏర్పాటు, అన్నదాతకు రైతుబంధు, రైతుబీమా, మహిళల అభ్యున్నతికి కల్యాణలక్ష్మి స్కీంలను ప్రారంభించిందన్నారు. పోటీపరీక్షలకు సిద్ధమయ్యే పేద, మధ్యతరగతి యువత కోసం సీఎం కేసీఆర్ స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేశారని తెలిపారు. ఆర్థికంగా భారమైనా రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజనూ కొనుగోలు చేశారని చెప్పారు. కాగా, జగిత్యాలలో స్టడీ సర్కిల్ ఏర్పాటుకు కృషి చేసిన ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ను మంత్రి అభినందించారు. అనంతరం ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ.. జగిత్యాలలో ఏర్పాటు చేసిన స్టడీ సర్కిల్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఉద్యోగార్థులకు పిలుపునిచ్చారు.
జడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఎస్సీ, ఎస్టీ, బీసీల అభ్యున్నతికి అనేక స్కీంలు అమలు చేస్తున్నారని కొనియాడారు. జగిత్యాల స్టడీ సర్కిల్లో నాణ్యమైన ఫ్యాకల్టీతో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి కోచింగ్ ఇవ్వడం అభినందనీయని ఎమ్మెల్సీ ఎల్.రమణ పేర్కొన్నారు. ఇందుకు కృషి చేసిన మంత్రులు కొప్పుల, గంగులకు కృతజ్ఞతలు తెలిపారు. కలెక్టర్ జీ రవి మాట్లాడారు. అంతకుముందు మంత్రి కొప్పుల జ్యోతి ప్రజ్వలన చేసి జ్యోతిబా ఫూలే చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం స్టడీ సర్కిల్ విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ రాజేశంగౌడ్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి, జగిత్యాల, రాయికల్ మున్సిపల్ అధ్యక్షులు బోగ శ్రావణి, మోర హన్మాండ్లు, జిల్లా బీసీ, ఎస్సీ సంక్షేమ శాఖల అధికారులు సాయిబాబా, రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.