కరీంనగర్, జూలై 21 (నమస్తే తెలంగాణ): గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ (జీఎస్టీ) అంటేనే సామాన్యుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఇప్పటి వరకు దీని పరిధిలోని లేని ఆహార పదార్థాలపైనా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 5 శాతం పన్ను పోటు పొడుస్తోంది. చివరికి పాలు, పాల ఉత్పత్తులను కూడా వదలడం లేదు. ఫ్రీ ఫ్యాక్డ్, అండ్ ఫ్రీ లేబుల్డ్ ప్యాకెట్ ఉత్పత్తులపై ఇక నుంచి అదనంగా జీఎస్టీ చెల్లించాల్సిన దుస్థితి సామాన్యులకు ఏర్పడింది. ప్యాక్ చేసి లేబుల్ వేసిన పెరుగు, మజ్జిగ, పన్నీరు, లస్సీ వంటి పాల ఉత్పత్తులు ఈ కారణంగా జీఎస్టీ పరిధిలోకి వచ్చాయి. ఇక ఇవి తిందామనో, తాగుదామనో ఆశపడితే ముందుగా కేంద్ర ప్రభుత్వానికి 5 శాతం పన్ను చెల్లించాల్సిందే. 2017 జూలై 1 నుంచి జీఎస్టీ అమలులోకి వచ్చిన ఐదేళ్లలో ఇప్పటికే ధరలు రెండు నుంచి మూడింతలు పెరిగాయి. ఇప్పుడు మరిన్ని ఆహార పదార్థాలను ఈ పన్ను పోటులో చేర్చడంతో మరింత అదనపు భారం తప్పదని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధిని మరిచి కేంద్రం పన్నుల వసూలుకే ప్రాధాన్యత ఇస్తోందని ఇంటింటా ఆగ్రహం వ్యక్తమవుతోంది.
ఆదాయమంతా నిత్యావసరాలకే..
ఇదీ.. కరీంనగర్‌లోని రాంచంద్రాపూర్‌లో నివాసం ఉండే తిప్పారపు శ్రీధర్ది మధ్య తరగతి కుటుంబం. ఇతని ఇంట్లో తల్లి వజ్రమ్మ, భార్య వర్షిని, కూతురు సాన్వి ఉంటున్నారు. శ్రీధర్ కార్ గ్యాస్ వర్క్ చేసుకుని జీవించే సామాన్యుడు. ఇతని నెల సంపాదన గరిష్టంగా రూ.25 వేలు. 2017లో జీఎస్టీ రాక ముందు తన సంపాదనలో రూ.10 వేలు కుటుంబ పోషణకు ఖర్చుచేసి పైసా పైసా కూడబెట్టి ఇల్లు కట్టుకున్నాడు. ఐదేళ్లలో పెరిగిన నిత్యావసర ధరలు, కేంద్రం పన్ను పోట్ల కారణంగా కుటుంబ పోషణ ఖర్చు ఇప్పుడు ఏకంగా రూ.24 వేలకు చేరుకుంది. కేంద్రం పుణ్యమాని వచ్చిన ఆదాయమంతా ఇంటి ఖర్చులకే సరిపోతే తన కూతురు భవిష్యత్తు ఏమిటనే ఆందోళన శ్రీధర్‌లో కనిపిస్తోంది. చివరికి పాలు, పాల ఉత్పత్తులపైనా కేంద్రం పన్ను విధించే స్థాయికి దిగజారడంతో ఈ కుటుంబంపై మరింత ఆర్థిక భారం పడుతోంది. తన లాంటి సామాన్యులు ఇక సినిమాలు, షికార్లు, విందులు, వినోదాలు పక్కన పెట్టి బతకాల్సిందేనని శ్రీధర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జీఎస్టీని తరుచూ తనకు అనుకూలంగా మార్చుకుంటూ ఇష్టారీతిన పన్నులు విధించిన కేంద్ర ప్రభుత్వ తీరును చూస్తే శ్రీధర్ ఆవేదన అక్షరాల నిజమనిపిస్తోంది. ఇది ప్రతి సామాన్య, మధ్య తరగతి కుటుంబ యజమాని గుండె చప్పుడుగా వినిపిస్తోంది. కేంద్రం విధిల్చిన జీఎస్టీ అడకత్తెరలో చిక్కుకున్న పేద, మధ్య తరగతి కుటుంబాలు ఐదేళ్లుగా అల్లాడి పోతున్నాయి. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో సామాన్యుల జీవితాలు మరింత ఆర్థికభారంలో చిక్కుకు పోతున్నాయి. తినాలంటే కొనాలి. కొనాలంటే కేంద్రానికి పన్నులు చెల్లించాలి. అన్నట్లు నోట్ల కట్టలు ఉంటేనే నోట్లోకి ముద్దదిగే పరిస్థితి సామాన్యులది.
ఉప్పు నుంచి పప్పు దాకా కిరాణా దుకాణంలో నిత్యావసరం ఏది కొన్నా ఇప్పటికే జీఎస్టీ విధిస్తున్న కేంద్రం ఇప్పుడు పాలు మరగబెట్టి పెరుగు తోడు పెడితే కూడా జీఎస్టీ విధించే స్థాయికి దిగజారింది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి సామాన్యులు బతకలేని పరిస్థితికి తెచ్చిపెట్టిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ నెల 18 నుంచి ఫ్రీ ప్యాక్డ్ అండ్ ఫ్రీ లేబుల్డ్ రిటైల్ ప్యాకెట్ల ఉత్పత్తుల పైనా 5 శాతం జీఎస్టీ విధిస్తోంది. ఇప్పటి వరకు జీఎస్టీ పరిధిలోకి రాని ఆహార పదార్థాలను దీని పరిధిలోకి తెచ్చింది. ఫలితంగా పాలు, పెరుగు, పన్నీరు, లస్సీ, తేనె, డ్రై సోయాబిన్, బఠానీ, గోధుమలు, పఫ్ట్ రైస్‌తోపాటు మాంసం, చేపలు వంటి ఫ్రీ ప్యాక్డ్ లేబుల్ ఆహార పదార్థాలకు సామాన్యులు జీఎస్టీ చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది.
ఉప్పిడి.. ఉపవాసాలు తప్పవా?
కేంద్రం విధిస్తున్న పన్ను పోటు కారణంగా సామాన్యులకు ఆర్థిక భారం తప్పడం లేదు. రోజు వారీ ఖర్చులకే జేబులు గుల్లవుతుంటే ఇక విందులు, వినోదాలకు నోచుకోని పరిస్థితి వారిది. గతంలో వారంలో రెండు సార్లు చికెన్, ఒక్కసారైనా మటన్ తిన్న కుటుంబాలు ఇప్పుడు వాటి రుచి చూడాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. నెల సంపాదనలో కనీస అవసరాలైన ఉప్పు, పప్పులు, నూనెలు కొనుగోలు చేసేందుకే జేబులు ఖాళీ అవుతున్నాయి. ఇక విందులు, వినోదాల మాట అటుంచితే పౌష్టికాహారం తీసుకునే పరిస్థితి క్రమంగా దూరమవుతోంది. నిరుపేద కుటుంబాలకైతే ఉప్పిడి, ఉపవాసం తప్పని పరిస్థితి. ఒకప్పుడు ఇల్లు గడవగా ఎంతో కొంత వెనకేసుకుని తమ అవసరాలు తీర్చుకున్న ప్రజలు ఇప్పుడు బతకడమే కష్టంగా మారిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సామాన్య, మధ్య తరగతి కుటుంబాలైతే జల్సాలు, విందులు, వినోదాలు మర్చిపోయారు. సినిమాలు షికార్లు అంటే అప్పులు చేయాల్సిందేనని వ్యాఖ్యానిస్తున్నారు. ఇలాంటి పరిస్థితి కల్పించిన కేంద్రంపై ప్రతి ఇంట్లో నిరసన సెగలు వ్యక్తమవుతున్నాయి. ఇల్లాళ్లు ఆగ్రహిస్తున్నారు..
రూపాయి వెనకేసుకునే పరిస్థితి లేదు..
పాల మీద జీఎస్టీ విధించడం చాలా దారుణం. ఇప్పటికే ఉన్న ధరలతోని బతుకుడు తప్ప రూపాయి ఎనకేసుకోలేక పోతున్నం. ఇప్పుడు ఇంకిన్ని ఆహార పదార్థాల మీద పన్నుల చెల్లించి కొనుక్కోవాల్నంటే అప్పులు చేసి బతకాల్సి వస్తదేమో. ఆహార పదార్థాల మీద విధించే పన్నుతోని కేంద్రం దేశంల ఏం అభివృద్ధి చేస్తున్నది. అప్పట్ల మా ఇంట్లకు వెయ్యి పదిహేను వందలు పెట్టి సామన్లు తెచ్చుకుంటే నెల రోజుల దాకా మళ్లీ షాపింగ్ చేసేదిగాదు. ఇప్పుడు ఐదారు వేలు పెట్టినా నెల గడుస్తలేదు. మళ్ల ఏదో ఒకటి లోటు ఉంటనే ఉంది. ఇసోంటి పరిస్థితిల మా అసోంటోళ్లు ఎట్ల బతుకుతరు. ఇంటి ఖర్చులు ఎల్లదీసుడే కష్టమైతుంటే పైసలు కూడేసుకుని అవసరాలు ఎట్ల తీర్చుకునేది.
– తోట మమత, మధ్య తరగతి గృహిణి
అలా గడిపేస్తున్నమంతే..
కేంద్రం చానా నిర్దయగా ఉంది. సామాన్యుల నోటికాడి బుక్కక్కూడా వెలకడ్తంది. మాలాంటోళ్లకు మస్తు కష్టమైతంది. నలుగురు సభ్యులం ఉన్న మా ఇల్లు గడవాలంటే ఒకప్పుడు పది వేలు ఖర్చయ్యేది. ఇప్పుడు రూ.25 వేలు సరిపోతలేవు. నాలాంటి స్కిల్డ్ వర్కర్లు ఎంత కష్డపడినా నెలకు రూ.25 వేలకు ఎక్కువ సంపాయించరు. కేంద్రం వేసే పన్నులు తడిసి మోపెడైతన్నయి. ఆఖరికి ఆహార పదార్థాలను సుతం వదలక పాయిరి. తినాలంటే కొనాలె. కొనాలంటే పైసలుగావాలె అన్నట్టయింది మా పరిస్థితి. అప్పట్ల వారం ఒకట్రెండు సార్లయినా చికెన్ తినెటోళ్లం. మటన్ తెచ్చుకునేటోళ్లం. ఇప్పుడు నెలకోసారి తెచ్చుకుంటే పండుగ లెక్కనే అయితంది. సామాన్యుల బతుకుదెరువు దృష్టిల పెట్టుకుని ఇప్పటికైనా కేంద్రం ఈ జీఎస్టీ భారాన్ని ఆహార పదార్థాల మీద తొలగించాలె..
– తిప్పారపు శ్రీధర్, మధ్య తరగతి కుటుంబ యజమాని
ఆలోచిస్తనే భయమేస్తుంది..
మధ్య తరగతి కుటుంబాల బతుకు భారంగా మారింది. రెండు మూడేండ్లకు ఇప్పటికే పూర్తిగా ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొంది. కూరగాయల నుంచి మొదలుకొని దినసరి వెచ్చాల వరకు అన్ని ధరలు ఆకాశాన్నంటినయ్. నూనె ప్యాకెట్ల ధర 200కు చేరింది. కారపు పొడి నుంచి మొదలు పెడితే అన్ని రకాల పిండ్ల ధరలు పెరిగినయ్. గ్యాస్ సిలిండర్‌ను చూస్తేనే భయం వేస్తున్నది. ధర 1100 ధర దాటింది. ఉప్పు, పప్పు, బియ్యం ధరలు ఆకాశంలో ఉన్నాయి. మొన్నటి వరకు 25 కిలోల దిగువన ఉన్న ప్యాకేజీ నిత్యావసర వస్తువుల ధరలన్నీ ఇప్పుడు జీఎస్టీతో పెరిగిపోయాయని దుకాణాదారులు చెబుతున్నరు. పాలు, పెరుగు ప్యాకెట్లు, టెట్రా ప్యాకెట్లు అన్ని పెరిగినయ్. ఇట్లయితే ఎలా బతుకాలో అర్థం కావడం లేదు. ఆలోచిస్తేనే భయమేస్తున్నది.
-కరండ్ల సునిత, గృహిణి, జగిత్యాల
కేంద్రం సామాన్యులను దోచుకుంటున్నది..
కేంద్రంలోని బీజేపీ సర్కారు జీఎస్టీ పేరుతో సామాన్యులను దోచుకుంటున్నది. ప్యాకింగ్ చేసి విక్రయించే ప్రతి వస్తువుకు కేంద్రం జీఎస్టీ విధించడం కరెక్ట్ కాదు. ఇప్పటికే గ్యాస్, వంటనూనె, పప్పుల ధరలు ఆకాశాన్నంటినయ్. అవీ చాలవన్నట్లు మళ్లిప్పుడు పాల ఉత్పత్తులతో పాటు నిత్యవసర సరుకులపై జీఎస్టీ విధించడం కేవలం పేద ప్రజల జీవితాలతో ఆడుకోవడమే. వారిని ఆర్థికంగా కుంగుపాటు గురి చేసేందుకే కేంద్రం ఇలాంటి నిర్ణయం తీసుకుంది.
-రాగి సౌమ్య , గృహిణి, మంథని.
పాలపై జీఎస్టీ ఏంటి?
కేంద్ర ప్రభుత్వం పన్నుల రూపంలో చేస్తున్న దోపిడీ గురించి సామాన్యులకు తెలియని పరిస్థితి నెలకొన్నది. పాల ధరలకు పెరిగాయని భావించే సామాన్యులు ఎందుకు పెరిగాయనే విషయంలో మాత్రం ఆలోచించే పరిస్థితిలో లేరనడానికి ఈ టీ స్టాల్ నిర్వాహకుడైన శివనే నిదర్శనం. కరీంనగర్ కలెక్టరేట్ రోడ్డులోని ప్రెస్‌క్లబ్‌కు ఎదురుగా ఉన్న శివ టీ స్టాల్ నిత్యం కిట కిటలాడుతుంది. ప్రతి రోజు కనీసం 50 ప్యాకెట్ల పాలను వినియోగించి శివ తన కష్టమర్లకు టీ అందిస్తాడు. ఇంత పెద్ద మొత్తంలో పాలు వినియోగించే ఈ టీ స్టాల్ యజమానికి పాలపై జీఎస్టీ వేశారనే విషయం తెలియలేదు. కేంద్రం ఏ విధంగా గుట్టుగా పన్నులు విధిస్తున్నదో ఇంత కన్నా పెద్ద నిదర్శనం ఇంకొకటి ఉండదు. పాలు, పాల పదార్థాలపై ఈ నెల 18 నుంచే కేంద్ర 5 శాతం జీఎస్టీ విధిస్తోంది. కేంద్రం గుట్టుగా వేసిన ఈ అదనపు భారాన్ని నిరసిస్తూ టీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేసింది. కేంద్రం విధానాలను ఎండగట్టింది. టీఆర్ఎస్ ఆందోళనలు చేయకుంటే అసలు పాలపై, పాల పదార్థాలపై జీఎస్టీ విధించిన సంగతి సామాన్యులకు తెలిసి ఉండేది కాదనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది.
ఇంటికొచ్చినోళ్లకు చాయ్ ఇవ్వలేం..
ఇంటికొచ్చినోళ్లకు చాయ్ ఇచ్చి మర్యాద చేసే సంప్రదాయం ప్రతి ఇంట్ల ఉంటది. కేంద్ర ప్రభుత్వం ఇట్ల రోజు రోజుకు ప్రతి వస్తువు మీద పన్ను ఏసుకుంటబోతే ఇక నుంచి ఆ సంప్రదాయం సుతం ఉండది. పాల మీద, పాలతోని తయారయ్యే పదార్థాల మీద సుతం ఇంత దారుణంగా పన్నులు వేసే ప్రభుత్వాన్ని ఇప్పుడే చూస్తున్నం. ప్రతి కుటుంబంల తప్పకుండా పాలు వాడుతరు. పిల్లలకైతే తప్పకుండా ఇవ్వాలె. మా ఇంట్లో ప్రతి రోజూ లీటరు పాలు వాడుతం. ఇప్పుడు అర లీటరు తెచ్చుకుని సరిపెట్టుకోవాల్సి వస్తదేమో. మూడు నాలుగేండ్ల కింద లీటర్ పాల ప్యాకెట్ రూ.40 ఉండేది. ఇప్పుడు రూ.80 నడుస్తోంది. జీఎస్టీ వేసినంక ఇంకా పెరుగుతది. మాలాంటోళ్లు ఎట్ల బతకాలె. కేంద్రం ఒక్కసారి ఆలోచించాలె.
– కొప్పురపు సంగీత, మధ్య తరగతి గృహిణి
గిట్లయితే బతకుడెట్లనో..
ఇప్పటికే నూనె, పప్పు, వంట సరుకుల ధరలు బాగా పెరిగినయ్. గిట్ల పన్నులు పెంచితే ఎట్ల బతుకుడు. పాలపై గూడ పన్నేయడం అన్యా యం. మోదీ పాలనలో పేదలకు బుక్కెడు బువ్వ దొరుకుడే కష్టమైతంది. మధ్య తరగతోళ్లం మస్తు కష్టాలు పడుతున్నం. పన్నులు పెంచితే పేదోళ్లు ఇంకా పేదోళ్లయితరు. పాలతో పాటు మిగతా సరుకులపై జీఎస్టీ రద్దు చేయాలి.
-నాంసాని రాయమల్లమ్మ, గృహిణి, పెద్దపల్లి మండలం.
బతుకుమంటరా సావమంటరా..
అడ్డగోలుగా ధరలు పెంచిండ్రు. పేదలను అరిగోస పెడుతున్నరు. దీనికితోడు ఎప్పుడు పడితే అప్పుడు పన్నులు మోపుతుండ్రు. కూలీనాలీ పనిచేసుకునే వారిని బతుకుమంటరా..? సావమంటరా..? చాలీచాలని ఆదాయంతో కుటుంబాలను నెట్టుకురావడమే కష్టంగా ఉన్న పరిస్థితుల్లో రేట్లు దించాల్సింది పోయి మరింత భారం మోపడం ఎంత వరకు కరెక్ట్. బీజేపీ ప్రభుత్వంల కష్టాలు, కన్నీళ్లే తప్ప ఎవరికీ ఏం మేలు కాలే. ఇప్పటికైనా పెంచిన ధరలు దించాలె. పన్నులు తీసేయాలి.
– దుగ్గు స్వప్న, గృహిణి, రాజన్నసిరిసిల్ల (కలెక్టరేట్)
ప్రజల బాధలు పట్టవా..
కేంద్ర ప్రభుత్వానికి ప్రజల బాధలపై పట్టింపు లేదు. నిత్యావసర సరుకుల ధరలు భారీగా పెరిగిపోవడంతో ఇబ్బందులు పడుతున్నం. మళ్లీ ఇప్పుడు అన్ని వస్తువులపై పన్నులు వేస్తే ఎట్లా బతుకుడు. మరీ ఇంత దోపిడీనా..? బీజేపీ ప్రభుత్వం పేదల పాలిట శాపంగా మారింది. చివరికి పాలు, పెరుగును కూడా వదలకుండా పన్నులు వేస్తరా..? పేదోళ్లు ఎట్ల బతుకుతరు. వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి.
– ఇంజమూరి విజయలక్ష్మి, గృహిణి, రాజన్నసిరిసిల్ల (కలెక్టరేట్)