మెట్పల్లి, జూలై 21: మిషన్ భగీరథ పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు ఆదేశించారు. గురువారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో కోరుట్ల, మెట్పల్లి మున్సిపాలిటీల్లో జరుగుతున్న అభివృద్ధి పనులకు సంబంధించి కమిషనర్లు, ఇంజినీరింగ్ విభాగం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మిషన్ భగీరథ పనులను వెంటనే పూర్తి చేసి ప్రతి ఇంటికి త్వరలోనే తాగునీరు అందించేందుకు ప్రత్యేక దృష్టిసారించాలని అధికారులకు సూచించారు. ప్రజా సమస్యలను సత్వర పరిష్కారమయ్యేలా చూడాలని, మున్సిపల్ అధికారులు, సం బంధిత విభాగాల అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉండి పనిచేయాలన్నారు. అదే విధంగా ఆయా మున్సిపాలిటీల్లో జరుగతున్న అభివృద్ధి పనులు, అవసరమైన పనులకు సంబంధించి వివరాలను మున్సిపల్ కమిషనర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ అధ్యక్షురాళ్లు రాణవేని సుజాత, అన్నం లావణ్య, మున్సిపల్ కమిషనర్లు అయాజ్, సమ్మయ్య, వైస్ చైర్మన్లు గడ్డమీది పవన్, చంద్రశేఖర్‌రావు, డీఈలు వెంకటరమణ, రాజ్‌కుమార్, అభినయ్, ఏఈలు అరుణ్‌కుమార్, సిరాజ్, నాయకుడు, డాక్టర్ సత్యనారాయణ, అన్నం అనిల్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కుల సంఘాల అభివృద్ధికి కృషి
కోరుట్ల రూరల్, జూలై 21: రాష్ట్ర ప్రభుత్వం అన్ని కుల సంఘాల అభివృద్ధికి కృషి చేస్తున్నదని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు అన్నారు. గురువారం యూసుఫ్‌నగర్ గ్రామంలోని గౌడ సంఘ అభివృద్ధి పనులకు రూ.2లక్షలు, మున్నూరు కాపు సంఘ అభివృద్ధికి రూ.3లక్షలు, వంజరి కుల సంఘ అభివృద్ధికి రూ.2.50లక్షల సీపీడీ నిధుల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గంలోని అన్ని కుల సంఘాల అభివృద్ధికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తున్నామన్నారు. కుల సంఘాల అభివృద్ధితో పాటు కుల వృత్తులను ప్రోత్సహిస్తూ వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతున్నట్లు తెలిపారు. కాగా నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో కుల సంఘాల అభివృద్ధికి ప్రత్యేక నిధులతో కృషి చేస్తానన్నారు.
అనంతరం గ్రామంలోని భీమన్న గుడి రహదారికి సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యేను ఆయా కుల సంఘాల సభ్యులు శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచ్ గుగ్గిళ్ల తుకారాంగౌడ్, ఎంపీటీసీ గుగ్గిళ్ల ప్రియాంక, ఎంపీపీ తోట నారాయణ, సర్పంచుల ఫోరం జిల్లా గౌరవాధ్యక్షుడు దారిశెట్టి రాజేశ్, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ చీటి వెంకట్రావ్, జిల్లా గ్రంథాలయ మాజీ డైరెక్టర్ గుగ్గిళ్ల సురేశ్ గౌడ్, మాజీ సర్పంచ్ ఎనగందుల సత్యనారాయణ గౌడ్, టీఆర్ఎస్ గ్రామ శాఖాధ్యక్షుడు గోపు ప్రశాంత్, నాయకులు అచ్చ చంద్రశేఖర్, వైఎస్ సత్యనారాయణ, పులి రాజేశ్, రాజనర్సయ్య గౌడ్, పంజాల నరేశ్, కరిపె శ్రీనివాస్, ఆయా కుల సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.