జమ్మికుంట, జూలై 21: ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్ హుజూరాబాద్ నియోజకవర్గాన్ని ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదని, జమ్మికుంట-హుజూరాబాద్ జంట నగరాలను అద్దంలా తీర్చిదిద్దుతున్నామని ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి తెలిపారు. దుమ్ముకుంటగా పేరున్న జమ్మికుంటను ఇటీవల రూ.42కోట్లు కేటాయించి అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. పూర్తిస్థాయిలో డ్రైనేజీ వ్యవస్థను నిర్మించేందుకు పాలకవర్గం విన్నపం మేరకు మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి మరో రూ.4కోట్లను అందించేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. గురువారం ఆయన జమ్మికుంటలో పర్యటించారు.
తర్వాత మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్‌రావు నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇటీవల కురిసిన భారీ వానలకు జన జీవనం అస్తవ్యస్తమైందని, హైదరాబాద్ నుంచి భద్రాచలం వరకు సీఎం కేసీఆర్ పర్యటించారని చెప్పారు. వరద ఇబ్బందులు తొలగించేందుకు రూ.వెయ్యి కోట్లు అందించిన సీఎం కేసీఆర్ ఔన్నత్యాన్ని కొనియాడారు. మంత్రిగా ఈటల హౌసింగ్‌బోర్డు కాలనీని పట్టించుకోని వైనాన్ని దుయ్యబట్టారు. లోతట్టు కాలనీల బాధ్యత ఇప్పుడు తామే తీసుకుంటామని, సమస్యలన్నీ పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ప్రజలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కాలనీ మునిగిపోకుండా నిద్రాహారాలు మానేసి పనిచేసిన అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, నాయకులకు అభినందనలు తెలిపారు. వైద్యారోగ్యశాఖ మంత్రిగా ఈటల చేసిన తప్పిదాలను ఎండగట్టారు. మంత్రి హరీశ్‌రావుతో మాట్లాడి దవాఖానలో వైద్యులు, సిబ్బందిని నియమిస్తామని చెప్పారు. నిత్యం ప్రసవాలు జరిగేలా చూస్తామన్నారు. ప్రభుత్వ దవాఖాన వైద్యంపై భరోసా కల్పిస్తామని స్పష్టం చేశారు. సమస్యలను నేరుగా తెలియజేయాలని, ఎల్లవేళలా అన్ని వర్గాలకు అందుబాటులో ఉండి పరిష్కరించే బాధ్యత తీసుకుంటానని చెప్పారు.
కేంద్రం నిధులివ్వడం లేదు: బండ శ్రీనివాస్
తెలంగాణపై కేంద్రం చిన్నచూపు చూస్తున్నదని, రాష్ర్టానికి నిధులివ్వడం లేదని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ ఆరోపించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ ప్రాతినిథ్యం వహించడం లేదని, అయినా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తామే తీసుకున్నామని తెలిపారు. ఇక్కడి బీజేపీ ఎమ్మెల్యే, ఎంపీ హుజూరాబాద్‌కు పెద్ద ఎత్తున కేంద్రం నుంచి నిధులు తేవాలని డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, రాజేశ్వర్‌రావు, సంపత్, మల్లయ్య, కోటి, భిక్షపతి, శ్రీనివాస్, శ్రీహరి, దిలీప్, భాస్కర్, కిషన్‌రెడ్డి, వెంకటేశ్, రాజయ్య పాల్గొన్నారు.