కార్పొరేషన్, జూలై 17: వచ్చే ఎన్నికల్లో హుజూరాబాద్‌లో ఓడిపోతాననే భయంతోనే గజ్వేల్‌లో పోటీ చేస్తానని ఈటల రాజేందర్ ప్రకటించుకున్నారని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు ఎద్దేవా చేశారు. జిల్లా కేంద్రంలోని ఓ హోటల్లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గజ్వేల్‌లో సీఎం కేసీఆర్‌పై పోటీ చేసి ఓడిపోతే పరపతి మిగులుతుందనే ఆలోచనతోనే ఈ ప్రకటన చేశారని ఆరోపించారు. టీఆర్ఎస్ను పిట్ట పార్టీ అని విమర్శించే రాజేందర్ ఈ పార్టీ నుంచే రాజకీయాల్లోకి వచ్చారని గుర్తు పెట్టుకోవాలన్నారు. తెలంగాణను సాధించింది కూడా ఈ పార్టీనేనని పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీ చిన్న పార్టీగానే మిగులుతుందని తెలిపారు. సీఎం కేసీఆర్ 13 ఎన్నికల్లో ఓటమి ఎరుగకుండా గెలుస్తూనే ఉన్నారని, అతడిపై పోటీ చేసే వారిలో నీవు కూడా ఒక వ్యక్తిగా మిగిలిపోతావని తెలిపారు. బీజేపీ అభ్యర్థిగా హుజూరాబాద్ ఎమ్మెల్యేగా గెలిచి ఈ 8 నెలల్లో నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ఇకపై సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా, రైల్వే కోచ్ ప్యాక్టరీ, సమ్మక్క జాతరకు జాతీయ హోదా తీసుకురావాలని సవాల్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు చల్ల హరిశంకర్, చీటి రాజేందర్రావు, తోట మధు, శ్రీనివాస్‌గౌడ్, ఉదారపు మారుతి, టీఆర్ఎస్వీ జిల్లా కో ఆర్డినేటర్ పొన్నం అనిల్‌కుమార్‌గౌడ్, నాయకుడు ఆరె రవి తదితరులు పాల్గొన్నారు.