కమాన్‌చౌరస్తా, జూలై 17: ఆషాఢ మాసం పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో వివిధ కుల సంఘాల ఆధ్వర్యంలో బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. ఆయా డివిజన్లలో కార్పొరేటర్లు వేడుకల్లో పాల్గొని స్థానిక ఆలయాల వద్ద ఏర్పాట్లు పరిశీలించారు. భగత్‌నగర్‌లో నిర్వహించిన వేడుకలకు నగర మేయర్ వై సునీల్ రావు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, టీఆర్ఎస్ నాయకుడు చల్లా హరిశంకర్ హాజరై నెత్తిన బోనాలు ఎత్తుకొని పోచమ్మ ఆలయానికి తరలివెళ్లి అమ్మవారికి బోనాలు సమర్పించారు. మార్కండేయనగర్లో ముత్యాల పోచమ్మ తల్లికి డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపారాణి-హరిశంకర్ దంపతులు బోనం సమర్పించారు. 41వ డివిజన్లో కార్పొరేటర్ బండారి వేణు ఆధ్వర్యంలో సుభాష్‌నగర్, వావిలాలపల్లిలో కాలనీ మహిళలు పెద్ద సంఖ్యలో అమ్మవార్లకు బోనాలు సమర్పించారు. అలాగే, 9వ డివిజన్లో కార్పొరేటర్ జంగిల్ ఐలేందర్ యాదవ్‌తో పాటు డివిజన్ ప్రజలు బోనాలతో పోచమ్మ ఆలయానికి తరలివెళ్లారు. బోనాల్లో తెచ్చిన నైవేద్యం అమ్మవారికి సమర్పించి మొకులు చెల్లించారు. ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల వేడుకలకు మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేణి మధు హాజరై అమ్మవారికి మొక్కులు చెల్లించారు. అర్ష కిరణ్మయి-మల్లేశం, శ్రీకాంత్, లక్ష్మీనారాయణ, రాజనర్సు, ఓదయ్య, నర్సయ్య, రాజయ్య, రాజేందర్, ప్రదీప్, వెంకటేశ్, దిలీప్ పాల్గొన్నారు.
ముకరంపుర, జులై 17: నగరంలోని 18వ డివిజన్ (రేకుర్తి)లో పెద్దమ్మ, మడేలేశ్వర స్వామి బోనాల వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో మహిళలు బోనాలతో ఆలయానికి తరలివెళ్లి పెద్దమ్మతల్లికి మొకులు చెల్లించారు. వెంకటి, రేగుల ఎల్లయ్య, శంకర్, తదితరులు పాల్గొన్నారు. రజక సంఘం ఆధ్వర్యంలో మడేలేశ్వర స్వామికి బోనాలు సమర్పించి, మొకులు చెల్లించుకున్నారు. పెద్దమ్మ, మడేలేశ్వర స్వామి, పోచమ్మ ఆలయాల్లో కార్పొరేటర్ సుధగోని మాధవి-కృష్ణాగౌడ్ మొకులు చెల్లించారు.