మహోజ్వల చరిత్ర ఇది!
మనోహర ధరిత్రి ఇది!!
పారుతున్న నది పరవళ్లు
మనసుపెట్టి చూసినట్టు
కొండశిఖరాలు మేఘాల చెవిలో
చెప్పే మాటలన్నీ చెవొగ్గి విన్నట్టు
హృదయ వేణువు స్వరాల పదలయలు
కారుణ్య భావాలైనట్టు
మరల మరల పాడుకునే
మహోజ్వల చరిత్ర ఇది
మనోహర ధరిత్రి ఇది
జమాయించి కొట్టే వానై కణకణమండే ఎండై
మనిషై మాటై బాటై
లోలోన దాగిన బడబాగ్నియై
పైపైకి ఎగిసిన నినాదాల వెల్లువై
దశాబ్దాల పోరాటాల వర్గ శోభిత ఫలితమై
సకలజన కోరికల సాకార రూపమిది || మహోజ్వల||
అచంచల విశ్వాసం అంచులు దాటిన ఆవేశం
ఒక్క పిడికిలిగా ఒక్క చేతనయ్యె
వివక్షల కక్ష సాధింపుల సతాయింపులకు
ఉవ్వెత్తున ఎగిసి ఉద్యమాలు చేసి
మనం మనమయ్యే వెన్నెల రేఖలమై
మనసులు మురిసిన మెరుపుల దాఖలాలమై
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ నేత స్ఫూర్తై
తెలంగాణ తల్లినలంకరించిన || మహోజ్వల||
ఒడుపు తెలిసిన నాయకుడు
పండొలిచి పెట్టినట్టు చెప్పే అప్పటి దోపిళ్లు
అస్తిత్వ గాథలూ ఆక్రమిత బాధలూ
అర్థమై మనసుకెక్కి రోడ్డెక్కి గళమెత్తాం
నాయకుడంటే ప్రజల భాష నాయకుడంటే జన భావన
పోరాటాలు జెండాలై ప్రణాళికలు అజెండాలై …
రైల్రోకోలూ వంటావార్పుల తిరుగుబాటైన || మహోజ్వల||
తెలంగాణ రూట్ మ్యాప్ సిద్ధమయింది
మాట తప్పిన కేంద్రాన్ని నిలదీసే ప్రజా వెల్లువై
ఈ స్ఫూర్తి ఈ కీర్తి నాయకుని కంటి వెలుగై
పదవులు తృణప్రాయమై ప్రాణత్యాగానికి సిద్ధమై
ఉద్యమ కెరటంగా ఉప్పొంగిన రణమైన || మహోజ్వల||
ఇచ్చిన మాట నిలిపేలా నిలదీసి సాధించె
కచ్చబట్టి తెలంగాణ వికాసాల తేజమయ్యె
చరిత పుటల రక్తాశ్రువులు లిఖించినట్టె
వీర విజయ గీతికలను లిఖించిన || మహోజ్వల||
గలగల చెరువుల హరితహారాలు
బిర బిర పరుగుల నదీ సంధానాలు
అమరజ్యోతి వెలుగులు సచివాలయ నిర్మాణాలు
గురుకులాల ఒడులు యువతకెన్నో కొలువులు
తెలంగాణ గ్రాఫ్ లైన్ పైపైకి ఎగిసిన || మహోజ్వల||
సబ్బండ వర్ణాల వృత్తి వ్యాపారాలు
పాఠాలు పథకాలు నిర్ణయ ప్రభంజనాలు
సంస్కరణలు సంస్కృతులు గౌరవంగా నినదించె
సమస్త జాతుల ఆచారాలు గర్వంగా తలయెత్తె
ప్రపంచ పట పరిణామంలో పరిమాణం పెంచేసె
మనమత కళాదీప్తుల కిరణాలతోబాటు
పరమత సహనంలో పరిత్రాణమైన || మహోజ్వల||
ఇంటింటికీ నల్లాల మంచినీటి ప్రవాహం
తరగని విద్యుత్తుకేమో సరిపడ ప్రస్థానం
బంధువంటే బంధువే రైతుబంధు పథకం
పల్లెలు నగరాలయ్యె నవ్య దారుల ప్రమోదం || మహోజ్వల||
తెలంగాణ రాష్ట్ర ప్రగతి
తెలంగాణ జీవన స్రవంతి
కేసీఆర్ భుజస్కంధాలాయె
కాలం కప్పిన పొరల్లో మనోనేత్రమిప్పిన ఇజాలలో
పట్టుబట్టి సాధించిన సత్య సంధతకు
‘నిజం’ ఓ వాక్యాన్ని నిలకడగా రాస్తోందిలా….
రాష్ట్ర సాధకుని జన్మదిన గీతిక ఇదంటూ !!
మహోజ్వల చరిత్ర ఇది!
మనోహర ధరిత్రి ఇది!!
– డాక్టర్ కొండపల్లి నిహారిణి