గోదావరిఖని, జూలై 17: వరద బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేతకాని భరోసా ఇచ్చారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని 9వ డివిజన్ జనగామ గ్రామంలో ఆదివారం ఆయన పర్యటించారు. స్థానిక ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌తో కలిసి ఆయన జనగామ గ్రామంలో దెబ్బతిన్న కల్వర్టును పరిశీలించారు. భారీ వర్షాలతో గోదావరి వరద ఉధృతి కారణంగా దెబ్బతిన్న జనగామ గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలోని శివాలయం నుంచి గోదావరి నదికి వెళ్లే సీసీ రోడ్డు మధ్యలోనే కొట్టుకుపోయిన కల్వర్టును పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ వెంకటేశ్ నేతకాని మాట్లాడుతూ తీవ్ర వర్షాలతో తెలంగాణలో చాలా చోట్ల నష్టం జరిగిందన్నారు. కల్వర్టుకు వెంటనే మరమ్మతులు చేస్తామన్నారు. ప్రస్తుతం వెళ్లేలా మార్గం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. సింగరేణి జీఎం కే.నారాయణతో మాట్లాడి సర్వీసు రోడ్డు తాత్కాలిక నిర్మాణం కోసం ఏర్పాటు చేస్తామన్నారు. అతి త్వరలో శాశ్వత నిర్మాణం కూడా చేపడుతామన్నారు. ఇటీవల ఇంటెక్‌వెల్‌లో చిక్కుకున్న ఏడుగురిని క్షేమంగా తీసుకువచ్చేందుకు కృషి చేసిన ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ను, ఆర్జీ-1 జీఎం కే.నారాయణను, ఎన్డీఆర్ఎఫ్ టీం, పోలీసులను అభినందించారు. జీఎం కే.నారాయణ మాట్లాడుతూ సింగరేణి ప్రభావిత గ్రామాల వారికి కావాల్సిన అన్ని వసతులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇక్కడ నగర మేయర్ డా.అనిల్ కుమార్, కార్పొరేటర్ జనగామ కవిత సరోజని, ఏజెంట్ బానోతు సైదులు, డీజీఎం పర్సనల్ లక్ష్మీనారాయణ, డీజీఎం సివిల్ నవీన్, డీజీఎం మదన్మోహన్, ఇంజనీర్ వెంకటేశ్వరరావు, ఇతర అధికారులు ఉన్నారు.