కరీంనగర్ జూలై 15 (నమస్తేతెలంగాణ ప్రతినిధి) : భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన వారికి ప్రజాప్రతినిధులు అండగా నిలుస్తున్నారు. అనుక్షణం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ముమ్మరంగా సహాయక చర్యలు చేపడుతున్నా రు. ప్రభావిత ప్రాంతాల్లో కాలినడకన తిరుగు తూ బాధితులతో మమేకమవుతున్నారు. చేతనైన సాయం చేస్తూ అధైర్యపడవద్దని భరోసానిస్తున్నారు. గురువారం మంత్రి కేటీఆర్ సిరిసిల్ల కలెక్టరేట్లో ఉన్నతస్థాయి సమీక్షించి, అధికారులకు దిశానిర్దేశం చేశారు. వర్షాలతో కూలిన, దెబ్బతిన్న ఇండ్లకు 11.63 లక్షల పరిహారం మంజూరు చేయించారు. శుక్రవారం ఇందుకు సంబంధించిన చెక్కులను బాధిత కుటుంబాల కు అందజేశారు. మంత్రి గంగుల కమలాకర్ నాలుగురోజులుగా వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. బాధితులను పలకరిస్తూ సమస్యలు తెలుసుకుంటూ ముందుకెళ్లారు. మరో మంత్రి కొప్పుల సైతం అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారం శివారులో చిక్కుకుపోయిన మ త్స్యకారుల కుటుంబాలను తెప్పపై వెళ్లి పరామర్శించారు. తక్షణ సాయాన్ని ప్రకటించి ఆదుకుంటామని భరోసానిచ్చారు.
కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు మెట్పల్లి మండలం మెట్లచిట్టాపూర్, ఆత్మకూర్, పాటిమీది తండా, కేసీఆర్ తండా, ఏఎస్సార్ తండా, రంగారావుపేట గ్రామాల్లో దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టులు, చెరువులను పరిశీలించారు. కోరుట్ల మండలంలోని చిన్నమెట్పల్లి, ఐలాపూర్ గ్రామాల్లో వానలకు దెబ్బతిన్న పంటలు, కూలిన ఇండ్లను పరిశీలించారు. ప్రభుత్వపరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ బోయినపల్లి మండలం రామన్నపేట, తడగొండ గ్రామాలతోపాటు కొడిమ్యాల మండలం తుర్కాశీనగర్లో సాయం అందించారు. రామగుండం ఎమ్మెల్యే కోరుకం టి చందర్ గోదావరి తీరాన్ని పరిశీలించారు. తీరంలో నివసిస్తున్న జాలర్ల కుటుంబాలను పరామర్శించారు. ఆ ప్రాంతంలో విద్యుత్ పునరుద్ధరణ పనులు చేపట్టాలని ఆ శాఖ అధికారులను ఆదేశించారు. పాలకుర్తి మండల ప్రజాప్రతినిధులు, అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. గ్రామస్థాయిలో సర్వేలు చేసి పంట నష్టంతోపాటు కూలిన ఇండ్ల జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించారు. పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ మంథనిలోని మర్రివాడ, ముత్యాలమ్మవాడ, అంబేద్కర్‌నగర్, బో యినిపేట, దుబ్బుగూడెంలో పర్యటించారు. ముంపు బాధితులతో మాట్లాడి ఆదుకుంటామని హామీ ఇచ్చారు.