ఆపత్కాలంలో అమాత్యుడు రామన్న అండగా నిలిచారు. వర్షాలతో ఇండ్లు కూలి నష్టపోయిన వారిని ఆదుకోవాలని ఆదేశించిన 24 గంటల్లోనే.. అధికారులు సాయం అందించారు. సిరిసిల్ల జిల్లాలో మొత్తం 335 ఇండ్లకు సంబంధించి 11.63 లక్షల పరిహారాన్ని శుక్రవారం ఒక్కరోజే పంపిణీ చేశారు. బాధిత కుటుంబాలకు యుద్ధ ప్రతిపాదికన అందించగా, బాధితులు మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
ఎడతెరిపిలేని వానలు అతలాకుతలం చేశాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 13 మండలాల్లో 335 ఇండ్లు పూర్తిగా, పాక్షికంగా దెబ్బతిన్నాయి. గురువారం సిరిసిల్లలో పర్యటించిన సందర్భంగా బాధితకుటుంబాలను ఆదుకోవాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఆ మేరకు రంగంలోకి దిగిన తహసీల్దార్లు, యుద్ధప్రాతిపదికన సా యం అందించేందుకు ఏర్పాట్లు చేశారు. 11,63,900 మంజూరుకాగా, శుక్రవారం ఒక్కరోజే ఆ మొత్తాన్ని బాధితుల ఇండ్లకు వెళ్లి మరీ అందించారు. బోయినపల్లి మండలం రామన్నపేట, తడగొండలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, ఎల్లారెడ్డిపేటలో టీఆర్ఎస్ అధ్యక్షుడు తోట ఆగయ్య, జడ్పీ చైర్మన్ చీటి లక్ష్మణ్‌రావు, ముస్తాబాద్ మండలంలో ఎంపీపీ జనగామ శరత్‌రావు, జడ్పీటీసీ గుండం నర్సయ్య చెక్కులను అందజేశారు. ఆ చెక్కులను అందుకొని బాధితులు ఉద్వేగానికి లోనయ్యారు. నాడు ఏండ్లు గడిచినా పరిహారం రాకపోయేదని, కానీ నేడు మంత్రి చెప్పిన 24గంటల్లోనే వచ్చిందని చెబుతున్నా రు. మంత్రి కేటీఆర్‌కు రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలిపారు. పరిహారం అందించి ఆదుకున్న మంత్రికి ప్రజాప్రతినిధులు ధన్యవాదాలు చెప్పారు.