ఉత్తమ సేవలు అందిస్తున్న జిల్లా, ఏరియా దవాఖానలతో పాటు పీహెచ్‌సీలకు కేంద్ర ప్రభుత్వం కాయకల్ప అవార్డులు ప్రకటించగా, ఉమ్మడి జిల్లాలో మూడు ఎంపికయ్యా యి. రాజన్న సిరిసిల్ల జిల్లా దవాఖానకు మూడో సారి అ వార్డు దక్కింది. కాగా, ప్రభుత్వ సహకారం, మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో కార్పొరేట్‌కు దీటైన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్ర దవాఖాన పారిశుధ్య నిర్వహణ, రోగులకు అందుతున్న సేవలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కాయకల్ప అవార్డు-2022లో రాష్ట్రంలోనే 2వ స్థానంలో నిలిచింది. 2020లో మొదటి స్థానం రాగా, 2021లో ద్వితీయస్థానం దక్కిం చుకున్నది. అవార్డుతో పాటు రూ.10 లక్షల ప్రోత్సాహాన్ని అందించనుంది.
ఉత్తమ వైద్య సేవలకు గుర్తింపు లభించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మూడు దవాఖానలు కాయకల్ప అవార్డులకు ఎంపికయ్యాయి. ముఖ్యంగా పారిశుధ్య నిర్వహణ, రోగులకు అందిస్తున్న సేవలకు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్ర వైద్యశాల మూడోసారి అవార్డు దక్కించుకున్నది. ఈసారి ఏకంగా రాష్ట్రంలో రెండోస్థానంలో నిలిచింది. వేములవాడ ఏరియా దవాఖాన ప్రారంభమైన ఏడాది లోపే కాయకల్ప అవార్డుకు ఎంపిక కాగా, రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలవడం గమనార్హం. మానకొండూర్ పీహెచ్సీ 84.83 మార్కులతో అవార్డు సొంతం చేసుకున్నది.
మంత్రి కేటీఆర్ సహకారంతోనే..
మంత్రి కేటీఆర్ సంపూర్ణ సహకారం, మార్గదర్శనం వల్లే జిల్లా దవాఖాన, వేములవాడ దవాఖానకు అవార్డులు వచ్చాయి. అవార్డులు మరింత బాధ్యతను పెంచాయి. రెట్టింపు ఉత్సాహంతో పని చేసేందుకు ఈ అవార్డులు ప్రేరణగా నిలుస్తాయి. వైద్యులు, సిబ్బంది పనితీరు నిబద్దతకు ఈ అవార్డుతో తగిన గుర్తింపు వచ్చింది.
– అనురాగ్ జయంతి, కలెక్టర్ , రాజన్న సిరిసిల్ల
నాణ్యతా ప్రమాణాలతోనే..
నాణ్యతా ప్రమాణాలతోనే ఈ గౌరవం దక్కింది. జిల్లా దవాఖానలో వైద్యులు, సిబ్బంది నిబద్ధతతో పని చేస్తున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఎప్పటికప్పుడు దవాఖాన తీరుతెన్నులను తెలుసుకుంటున్నారు. పారిశుధ్యం, పచ్చదనాన్ని పటిష్టంగా నిర్వహిస్తున్నాం. దీంతో రోగులకు ఆహ్లాదకర, ఆరోగ్యకర పరిసరాలను తీర్చిదిద్దగలిగాం. ఈ అవార్డుతో దవాఖానను మరింత ఉన్నతంగా నిర్వహించడానికి నిధులు సమకూరుతాయి.
– మురళీధర్‌రావు, సూపరింటెండెంట్, జిల్లా దవాఖాన, రాజన్న సిరిసిల్ల