కరీంనగర్ రూరల్, జూలై 10: కరీంనగర్ మండలంలోని పలు గ్రామాల్లో మూడు రోజులుగా కురుస్తున్న వర్షానికి జనజీవనం స్తంభించింది. పలు గ్రామాల్లో ఇండ్ల మధ్య నీరు నిలిచి స్థానికులకు ఇబ్బందికరంగా మారింది. దుర్శేడ్,చేగుర్తి, నల్లగుంటపల్లి, ఇరుకుల్ల, గోపాల్పూర్, మొగ్దుంపూర్లో వర్షపునీటితో ప్రజలు బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. చెర్లభూత్కూర్‌లోని గుజ్జులపల్లి, ప్రశాంత్ నగర్కాలనీల రహదారిపై బ్రిడ్జి నుంచి నీరు ప్రవహిస్తున్నది. దీంతో రెండు గ్రామాల మధ్య రవాణా నిలిచిపోయింది. చామనపల్లిలో వటవృక్షాలు నేలకూలాయి. జూబ్లీనగర్, ఎలబోతారం, నగునూర్ గ్రామంలోని ప్రజలు వర్షానికి బయటకు రాలేదు. చెక్‌డ్యామ్ వద్ద నీరు మత్తడి దూకుతున్నది. పంట పొలాలు, ఇండ్ల మధ్య నీరు నిలిచింది. ఇరుకుల్ల పాత బ్రిడ్జి వద్ద నీటి ఉధృతి పెరిగింది. బొమ్మకల్‌లోని ప్రియదర్శిని కాలనీ, గుంటూర్పల్లి, లక్ష్మీనగర్, రజియాచమాన్, ఎస్సీకాలనీలో ఇండ్ల వద్ద నీరు నిలిచింది.
మత్తడి దుంకిన కొత్తపల్లి చెరువు
కొత్తపల్లి, జూలై 10 : కుండపోతగా కురుస్తున్న వర్షాలతో మండలంలోని గ్రామాలకు జలకళ వచ్చింది. మండల పరిధిలోని బావుపేట, నాగులమల్యాల, ఎలగందుల, ఖాజీపూర్, బద్దిపల్లి, నాగులమల్యాల చెరువులకు భారీగా వరద చేరుకున్నది. ఎగువనుంచి వస్తున్న వర్షపు నీటితో కొత్తపల్లి చెరువు మత్తడి దుంకుతున్నది. చెరువు నుంచి చేపలు మత్తడి నీరు ద్వారా బయటకు రావడంతో మత్స్యకారులు భారీగా పట్టారు. కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు, రూరల్ సీఐ, ఎస్ఐ విజ్ఞాన్‌రావు, ఎల్లాగౌడ్, రెవెన్యూ అధికారులు పరిస్థితిని పరిశీలించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. కొత్తపల్లి పట్టణంలోని అంబేద్కర్‌నగర్‌లో కుమ్మరి లక్ష్మికి చెందిన పురాతన ఇల్లు నేలమట్టమైంది. మండలంలోని లక్ష్మీపూర్ ఉన్న శ్రీ లక్ష్మీ హోమ్స్ కాలనీని వరద ముంచెత్తింది. కాలనీకి వచ్చే ప్రధాన రహదారిపై మోకాలులోతు నీరు నిలిచిపోవడంతో కాలనీవాసులు ఇబ్బందులు పడ్డారు.
తడిసి ముద్దయిన నగరం
కార్పొరేషన్, జూలై 10 : రెండు రోజులుగా ఎడతెరిపి లేకుం డా కురుస్తున్న వర్షంతో కరీం‘నగరం’ తడిసి ముద్దయింది. పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎక్కడా వరద నీటి ఇబ్బందుల్లేకుండా నగరపాలక సంస్థ పకడ్బందీ చర్యలు చేపడుతున్నది. డీఆర్ఎఫ్ బృందాలను 24 గంటలు అందుబాటులో ఉంచారు. ఆయా డివిజన్ల నుంచి వస్తున్న ఫిర్యాదులతో ఎప్పటికప్పుడు వర్షపు నీరు నిల్వ లేకుండా చర్యలు చేపడుతున్నారు. శివారు ప్రాంతాల్లో కచ్చ కాల్వల ద్వారా వర్షపు నీటిని పంపించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రేకుర్తి, తీగలగుట్టపల్లి, రాంనగర్, చైతన్యపురి ప్రాంతాల్లో వరద సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. శని, ఆదివారాల్లో వర్షం మూలంగా జనసంచారం లేక రోడ్లన్నీ బోసిపోయాయి. మురుగు కాల్వల్లో చెత్త పేరుకపోకుండా సిల్ట్‌ను తొలగిస్తున్నారు.
కూలిన ఇల్లు
భారీ వర్షానికి నగరంలోని టవర్ సర్కిల్ ప్రాంతంలో కందుకూరి హనుమయ్యచారి, భాగ్యలక్ష్మి వృద్ధ దంపతులకు చెందిన ఇంట్లో పై కప్పు ఆదివారం కూలింది. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. మున్సిపల్ కమిషనర్ సేవాలాల్ ఇస్లావత్, డీసీపీ సుభాష్ ఘటనా స్థలాన్ని సందర్శించారు. పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
దంచి కొడుతున్న వానలు
గంగాధర, జూలై 10 : మండలంలో భారీ వర్షం కురిసింది. మొగులుకు చిల్లులు పడ్డట్లు ఉదయం నుంచి సాయంత్రం వరకు ముసురు పడింది. మండలంలో 84.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. మండలంలోని వెంకంపల్లిలో పిట్టల మహేశ్, మల్లాపూర్‌లో ఏనుగు రాజయ్య, కొలెపాక మల్లిశ్వరీకి చెందిన ఇండ్లు కూలిపోగా.. సర్పంచులు ముక్కెర మల్లేశం, ఆకుల శంకరయ్య పరిశీలించారు. వెంకటాయపల్లి వాగు, హిమ్మత్‌నగర్, కురిక్యాల ఒర్రెలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. లింగంపల్లి వద్ద రోడ్డుపై వరద నిలిచిపోవడంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. గంగాధరలో రోడ్డుకు అడ్డుగా వృక్షం పడడంతో సర్పంచ్ మడ్లపెల్లి గంగాధర్ తొలగింపజేశారు. మండలంలోని అన్ని గ్రామాల్లో చెరువుల్లోకి భారీగా వరద చేరుతున్నది. ఆయా గ్రామాల్లో పంట పొలాలు నీట మునిగాయి. మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ రాజు సూచించారు. పాత ఇండ్లలో ఉండవద్దని, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లను తాకవద్దని పేర్కొన్నారు. ఉధృతంగా ప్రవహించే వాగులు, వంకలు, ఒర్రెలను దాటే ప్రయత్నం చేయవద్దన్నారు. అవసరమైతే తప్ప ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని, భారీ వర్షం పడుతున్న సందర్భంగా చిన్న పిల్లలను బయటికి పంపవద్దని తెలిపారు. నీటితో నిండిన చెరువులు, కుంటలను చూసేందుకు వెళ్లిన సమయంలో జాగ్రత్తగా ఉండాలని, ఈత కొట్టడానికి, ఆటలు ఆడడానికి నీటిలోకి దిగవద్దన్నారు. అత్యవసర సమయంలో డయల్ 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
వరదకాలువకు నీటి విడుదల
భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి వరదకాలువ ద్వారా మిడ్ మానేర్ డ్యామ్‌కు అధికారులు 5వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు తహసీల్దార్ శ్రీనివాస్ తెలిపారు. కాలువ నిండుగా నీరు ప్రవహిస్తుండడంతో వరదకాలువ పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలెవరూ వరదకాలువ వద్దకు వెళ్లరాదని ఆదేశించారు.
పొంగిన వాగులు, వంకలు
రామడుగు, జూలై 10 : మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలోని పలు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వెలిచాల నుంచి కొత్తపల్లికి వెళ్లేదారిలో రోడ్ డ్యాం పొంగిపొర్లుతున్నది. దీంతో జగిత్యాల వైపు నుంచి కరీంనగర్ వెళ్లే బైపాస్ మూసుకుపోయింది. వెలిచాల వాసులు కొత్తపల్లికి పనులమీద వెళ్లడానికి వీలు లేకుండాపోయింది. భారీ వర్షాలకు పై నుంచి వచ్చే వరద చేరడంతో వెలిచాల చించెరువు అలుగు దూకుతున్నది. రామడుగు వాగులో వరద భారీగా కిందికి వెళ్తున్నది. మండలంలోని గుండిలో భారీ వర్షాల కారణంగా గ్రామానికి చెందిన గసికంటి అఖిల్ మట్టిల్లు కూలిపోయింది. దీనిపై రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టారు.
నిండిన కుంటలు, చెరువులు
చొప్పదండి, జూలై 10 : మూడు రోజులుగా మండలంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో మండలంలోని అన్ని గ్రామాల్లో చెరువులు, కుంటలు నీటితో కళకళలాడుతున్నాయి. ప్రజలు ఇంటికే పరిమితమయ్యారు. ఆదివారం తొలిఏకాదశి, బక్రీద్ పండుగలు అయినప్పటికీ ఎడతెరిపి లేకుండా వర్షం కురియడంతో ప్రజలు ఇంటి వద్దే జరుపుకున్నారు. మత్స్యకారులు చెరువులు, కుంటల్లో చేపలు పట్టారు. వర్షాలకు మండలకేంద్రంలోని 11 వార్డులో మసీద్ సమీపంలో గోడస్వల్పంగా కూలిపోయింది.