వైద్యరంగానికి అధిక ప్రాధాన్యతనిస్తున్న సర్కారు ఈ దిశగా మరో అడుగు ముందుకువేసింది. గ్రామీణులకు మెరుగైన వైద్యసేవలందించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రుద్రంగిలోని హెల్త్సబ్సెంటర్లకు సొంత భవనాలు నిర్మించాలని సంకల్పించింది. ఎమ్మెల్యే రమేశ్‌బాబు చొరవతో 32లక్షలు విడుదల కాగా, పనులు వేగంగా సాగుతున్నాయి. త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉండగా మండలప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
– రుద్రంగి, జూలై 10
మారుమూల ప్రాంతమైన రుద్రంగి మండల ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు సర్కారు ఉపక్రమించింది. చందుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో రుద్రంగిలో కొనసాగుతున్న రెండు ఉప కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించాలని నిర్ణయించింది. ఎమ్మెల్యే రమేశ్‌బాబు విజ్ఞప్తి మేరకు రెండు భవనాలకు 16లక్షల చొప్పున మంజూరు చేసింది. వెనువెంటనే ప్రారంభించిన పనులు ప్రస్తుతం వేగంగా కొనసాగుతున్నాయి. త్వరలోనే అందుబాటులోకి రానుండగా గ్రామీణులకు మరింత మెరుగైప సేవలు అందనున్నాయి. అలాగే డాక్టర్లతోపాటు ఏఎన్ఎంలు, వైద్య సిబ్బంది పూర్తిస్థాయిలో సేవలు అందించ నుండగా స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
రెండు ఉప కేంద్రాలు..
మండల కేంద్రంలోని మొదటి ఆరోగ్య ఉప కేంద్రం గ్రామ జీపీ భవనంలో, రెండోది అద్దె భవనంలో కొనసాగుతున్నాయి. రోగులు, సిబ్బందిపడుతున్న ఇబ్బందులను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఉపకేంద్రాలకు నిధులు మంజూరు చేసింది. ఇవి అందుబాటులోకి వస్తే హెల్త్‌సబ్ సెంటర్లలో ఉదయం 9 నుంచి సాయం త్రం 4గంటల వరకు సేవలందుతాయి. ప్రాథమిక చికిత్స, మాతాశిశు సంరక్షణ సేవలు, టీకాల పంపిణీ, మధుమేహం, హైబీపీ, వంటి దీర్ఘకాలిక వ్యాధులకు సేవలు చేరువకానున్నాయి.
ఎమెల్యే చొరవతోనే పనులు
ఎమ్యెల్యే రమేశ్‌బాబు ప్రత్యేక చొరవతో రెండు సబ్ సెంటర్లకు 32 లక్షలు మంజూరయ్యాయి. ప్రస్తుతం పనులు చకచకా సాగుతున్నాయి. ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండడంతో ప్రజలకు మరింత చేరువగా సర్కారు వైద్యం అందుతుందని గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్య ఉప కేంద్రాలకు నిధులు మంజూరు చేసిన ఎమ్యెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు.
– జడ్పీటీసీ గట్ల మీనయ్య, రుద్రంగి