కోల్‌సిటీ, జూలై 10: ‘హరిత’ పండుగకు రామగుండం నగర పాలక సంస్థ సన్నద్ధమవుతున్నది. ఆకుపచ్చ తెలంగాణ నిర్మాణంలో భా గంగా సీఎం కేసీఆర్ గొప్ప యజ్ఞంగా ముందు చూపుతో చేపట్టిన ‘తెలంగాణకు హరితహారం’ 8వ విడుతకు రామగుండం కార్పొరేషన్ అంతా సిద్ధం చేసుకుంది. దాదాపు 13 లక్షల మొక్కలు నాటేందుకు నిర్దేశిత లక్ష్యంగా నిర్ధారించారు. ఏడు విడుతలుగా రామగుండం కార్పొరేషన్లో పక్కా ప్రణాళికతో పకడ్బందీగా హరితహారంలో మొక్కలు నాటి వాటిని సంరక్షించినందుకు గానూ భారత ప్రభుత్వం రామగుండం కార్పొరేషన్‌కు ‘గ్రీన్-2022’ అవార్డు ప్రకటించగా ఇటీవలే న్యూఢిల్లీలో జరిగిన ఆలిండియా మేయ ర్ల సదస్సులో రామగుండం తరపున ఇక్కడి మేయర్ అనిల్‌కుమార్ హాజరై అవార్డును అం దుకున్న విష యం విదితమే. అదే స్ఫూర్తితో 8వ విడుతను విజయవంతంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ దిశా నిర్దేశం మేరకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతుండగా, ఇటీవల జరిగిన నగర పాలక సంస్థ 5వ సాధారణ సమావేశంలో హరితహారానికి రూ.14.60 కోట్లు నిధులు కూడా కేటాయించారు.
ఎటు చూసినా మొక్కల జాతరే..
ఏడు విడుతలుగా వరుసగా నాటిన లక్షల కొద్ది మొక్కలు ఇప్పుడు వృక్షాలుగా ఎదిగి ఎటు చూసినా పచ్చదనం పరిఢవిల్లుతున్నది. గతంలో హరితహారంలో మొక్కలు నాటేందుకు బయటి ప్రాంతాల నుంచి మొక్కలను దిగుమతి చేసుకునేవారు. గతేడాది నుంచి స్థానికంగానే మొక్కల పెంపకం కోసమని స్వశక్తి సంఘాలకు బాధ్యతలు అప్పగించారు. కార్పొరేషన్ ఆధ్వర్యంలో సుమారు 13 తాగునీటి ట్యాంకుల వద్ద కూడా నర్సరీలను ఏర్పాటు చేసి మొక్కలను పెంచుతున్నది. ఈసారి సుమారు 2 మీటర్ల పొడుగు జాతి మొక్కలు నాటేందుకు లక్ష్యంగా నిర్ధారించుకోగా, వాటిని బయటి నుంచి కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఎన్టీపీసీ సంస్థ తమవంతు భాగస్వామ్యంగా కార్పొరేషన్‌కు రూ.9 కోట్లు నిధులు సమకూరుస్తున్నది. ఎన్టీపీసీ పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతలను కాంట్రాక్ట్ పద్ధతిన అప్పగించనున్నది.
43.71 లక్షల లక్ష్యం
8వ విడుత హరితహారంలో భాగంగా జిల్లా లో 43.71 లక్షల మొక్కలు నాటేందుకు అధికార యంత్రాంగం లక్ష్యంగా నిర్ణయించింది. రామగుండం కార్పొరేషన్ ఆధ్వర్యంలో 5.89 లక్షలు, సింగరేణి ఆర్జీ-1,2,3 ఏరియాలకు 6 లక్షలు, ఎన్టీపీసీ సంస్థకు 10, 340 మొక్కలు, ఆర్ఎఫ్సీఎల్కు 50 వేలు, టీఎస్ జెన్కో సంస్థకు మరో 5లక్షలు మొత్తం కలిపి రామగుండం బల్దియాలో 13లక్షల మొక్కలు నాటాలని టార్గెట్‌గా విధించింది. అటవీ శాఖ ద్వారా 2లక్షలు, డీఆర్డీఏ ద్వారా 23.51లక్షలు, పెద్దపల్లి మునిసిపాలిటీ ద్వారా 2 లక్షలు, మంథని మునిసిపాలిటీ ద్వారా లక్ష, సుల్తానాబాద్ మునిసిపాలిటీ ద్వారా లక్షా 20వేలు, వివిధ పరిశ్రమలకు మరో లక్ష మొక్కలు నాటాలని టార్గెట్ విధించింది.
ఇంటింటికో ఆరు మొక్కలు…
రామగుండం కార్పొరేషన్ 50 డివిజన్ల పరిధిలోని ఇంటింటికీ ఆరు మొక్కలను పంపిణీ చేసేందుకు సర్వం సిద్ధం చేశారు. పట్టణ ప్రగతిలో భాగంగా హరితహారంలో మొక్కలు పెంచేందుకు ఎంపిక చేసిన అనువైన స్థలాలతోపాటు బీ పవర్ హౌస్ కాలనీ నుంచి గోదావరి నది వంతెన వరకు గల సర్వీస్ రోడ్డు వెంట మొక్కలు నాటనున్నారు.