కరీంనగర్, జూలై 10(నమస్తే తెలంగాణ): మూడు రోజులుగా జిల్లాలో వర్షం ఎడ తెడగం లేదు. పలు చోట్ల కుండ పోత కురిసింది. చొప్పదండి మండలం ఆర్నకొండలో 108.3 మిల్లీ మీటర్ల వర్షం పడింది. అనేక గ్రామాల్లో ఇదే పరిస్థితి. ఆదివారం ఉదయానికే జిల్లాలో సగటున 66.7 మిల్లీ మీటర్ల వర్ష పాతం నమోదైంది. ఫలితంగా జిల్లాలోని పలు వాగులు, వంకలు స్పల్పంగా పారుతున్నాయి. రామడుగు మండలం గుండిలో ఒక ఇల్లు కూలిపోవడం, అక్కడక్కడా పంట పొలాల్లోని స్వల్పంగా నీరు చేరడం మినహా ఇప్పటి వరకు ఎలాంటి నష్టం జరుగలేదని అధికారులు చెబుతున్నారు.
ఉధృతంగా వాగులు..
మూడు రోజులుగా ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా పలు వాగులు, వంకలు ఉధృతంగా పారుతున్నాయి. మూలవాగు, మానేరు, పెద్దపల్లిలో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గోదావరి ఉగ్రరూపంతో ఎల్లంపల్లికి భారీగా ఇన్‌ఫ్లో వస్తుండడంతో గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ఇక సిరిసిల్లలోఎస్సారార్ రిజర్వాయర్‌కు వరదతోపాటు ఎస్సారెస్పీ నుంచి 16వేల క్యూసెక్కులకు పైగా ఇన్‌ఫ్లో వస్తున్నది. ఇక జిల్లాలో ఎల్ఎండీ రిజర్వాయర్‌లోకి నిన్నటి నుంచి ఇన్‌ఫ్లో పెరిగింది. నిన్న సాయంత్రం మోయతుమ్మెద వాగు ద్వారా 973 క్యూసెక్కుల వరద రాగా ఈ రోజు పెరిగింది. ఆదివారం సాయంత్రం వరకు 3,566 క్యూసెక్కుల వరద రిజర్వాయర్‌లోకి చేరుతోంది. ఉదయం నుంచి వరద పెరుగుతూ వస్తోంది.
ఇటు హుజూరాబాద్ పట్టణం సమీపం నుంచి చిలుక వాగు కూడా పారుతోంది. రామడుగు మండలం వెలిచాల, కొత్తపల్లి మండల కేంద్రం మధ్యలో ఉన్న ఒర్రె ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఈ రెండు గ్రామాల మధ్య కాకతీయ కాలువకు సమీపంలో ఉన్న రొడ్డాం మీదుగా వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. రామడుగు మండలంలోని మోతె వాగులో కూడా స్వల్పంగా వరద వస్తోంది. అలాగే కొత్తపల్లి మండలం లక్ష్మీపూర్‌లోని లక్ష్మీహోం కాలనీలోకి వదర వచ్చి చేరింది. ప్రధాన రహదారిపై మోకాలులోతు నీరు నిలిచి ఉండడంతో కాలనీ వాసులు ఇబ్బందులు పడ్డారు. చొప్పదండిలోని శనగ కుంటలోకి వరద వచ్చి చేరుతోంది.
ఈ మండలంలోని ఆర్నకొండ గ్రామంలో అత్యధికంగా 108.3 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. ఈ గ్రామంలోని చెరువులు, కుంటల్లోని వరద వచ్చి చేరుతోంది. ఇల్లందకుంట మండలం బోగంపాడు, మర్రివానిపల్లి, జమ్మికుంట మండలం విలాసాగర్తోపాటు వీణవంక మండలంలోని పలు చెరువులు మత్తడి పడుతున్నాయి. రామడుగు మండలం గుండిలో గసికంటి అఖిల్ అనే వ్యక్తికి సంబంధించిన ఒక ఇల్లు కూలిపోవడం, పంట పొలాల్లోకి అక్కడక్కడా నీళ్లు చేరడం మినహా ఇప్పటి వరకు ఎలాంటి నష్టం జరగ లేదు. హుజూరాబాద్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో సహాయ చర్యలు అందించేందుకు సహాయక బృందాలను ఏర్పాటు చేశారు..
రామడుగులో భారీగా..
జిల్లా వ్యాప్తంగా ఆదివారం ఉదయం వరకు 66.7 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. పొద్దంతా తెరిపి లేకుండా పడింది. అక్కడక్కడా భారీ వర్షాలు పడ్డాయి. రామడుగు మండలంలో అత్యధికంగా 98.4 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. అలాగే గంగాధరలో 93.8, చొప్పదండిలో 68.0, కరీంనగర్ అర్బన్‌లో 68.2, కరీంనగర్ రూరల్‌లో 32.5, కొత్తపల్లిలో 80.0, మానకొండూర్‌లో 48.8, తిమ్మాపూర్‌లో 65.4, గన్నేరువరంలో 58.0, చిగురుమామిడిలో 64.6, సైదాపూర్‌లో 58.8, శంకరపట్నంలో 52.2, వీణవంకలో 75.6, హుజూరాబాద్‌లో 31.2, జమ్మికుంటలో 74.8, ఇల్లందకుంటలో 71.5 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. ఆటోమెటిక్ వెదర్ స్టేషన్లు ఉన్న గ్రామాల్లో చూస్తే చొప్పదండి మండలం ఆర్నకొండలో వర్షం దంచి కొట్టింది. ఇక్కడ 108.3 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. ఇదే మండలం వెదురుగట్టలో 86.5, రామడుగు మండలం గుండిలో 94.8, గంగాధర మండల కేంద్రంలో 85.5 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది..
యంత్రాంగం అప్రమత్తం..
భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆయన అన్ని జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వర్షాల కారణంగా ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్‌ను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలను గుర్తించి జలమయం కాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అవసరం అయితే సహాయక శిబిరాలు ఏర్పాటు చేయాలని, విద్యుత్తు స్తంభాలు పడిపోతే వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించగా, కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆధ్వర్యంలో యంత్రాంగం అప్రమత్తమైంది.