ఇన్నాళ్లు కూలీనాలీ చేసుకుంటూ బతికిన కుటుంబానికి దళితబంధు కింద ట్రాక్టర్ వచ్చింది..ఇగ కష్టాలు తీరినట్టేనని ఇంటిల్లిపాది సంబురపడ్డది..కానీ నెల తిరగకముందే పెద్ద దిక్కు మరణంతో దిక్కుతోచని స్థితిలో చిక్కుకున్నది.. గురువారం ట్రాక్టర్ సహా బావిలో పడి గల్లంతైన వ్యక్తి మృత్యుఒడికి చేరడంతో ఆ నిరుపేద దళితకుటుంబంలో విషాదం అలుముకున్నది.
తిమ్మాపూర్ రూరల్, జూలై 8: గురువారం ట్రాక్టర్‌తో సహా బావిలో పడి గల్లంతైన శంకర్ ఆచూకీ విషాదాంతమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మానకొండూర్ మండలం బంజేరుపల్లికి చెందిన శంకర్ (55) దళితబంధు యూనిట్ కింద ట్రాక్టర్ కొనుగోలు చేశాడు. గత నెల 6న ఎమ్మెల్యే రసమయి అతడికి ట్రాక్టర్‌ను అందించారు. శంకర్‌కు డ్రైవింగ్ రాకపోవడంతో అదే గ్రామానికి చెందిన మల్లేశం సహాయంతో ట్రాక్టర్ నడపడం నేర్చుకుంటున్నాడు. ఈ క్రమంలో గురువారం తన పొలంలో రొటోవేటర్‌తో దున్నుతుండగా అదుపుతప్పి ట్రాక్టర్‌తో సహా బావిలో పడి గల్లంతయ్యాడు. తన పక్కనే కూర్చున్న మల్లేశం ప్రాణాలతో బయటపడ్డాడు.
రెండు రోజులు శ్రమించి..
ప్రమాద సమాచారం అందుకున్న ఎల్ఎండీ ఎస్ఐ ప్రమోద్‌రెడ్డి సిబ్బందితో వెళ్లి సహాయక చర్యలు ప్రారంభించారు. రాత్రి వరకు గజ ఈతగాళ్లతో వెతికించినా లాభం లేకపోవడంతో వెనుదిరిగారు. శుక్రవారం తెల్లవారుజామునే మళ్లీ భారీ క్రేన్ సాయంతో నీళ్లలో వెదికారు. అలాగే జిల్లా రెస్క్యూ టీం చేరుకుని క్రేన్‌కు పాతాళగరిగెతో వెతుకుతుండగా మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో ట్రాక్టర్ చిక్కగా పైకి లాగారు. అనంతరం శంకర్ మృతదేహాన్ని పైకి తీశారు. విగతజీవిగా కనిపించిన శంకర్‌ను చూసి భార్య లక్ష్మి, కూతుర్లు అంజలి, అఖిల రోదించిన తీరు అక్కడున్న వారిని కలిచివేసింది. కాగా, సహాయక చర్యలను సీపీ సత్యనారాయణ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు పర్యవేక్షించారు.