తిమ్మాపూర్ రూరల్, జూలై 8: పదేండ్ల బాలికను ప్రమాదరూపంలో ఓ కారు కబలించింది. రోడ్డు పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తున్న బాలికను వెనుకనుంచి ఢీకొట్టగా ఎగిరి దూరంగా పడిపోయింది. తీవ్ర గాయాలపాలైన బాలికను దవాఖానకు తీసుకెళ్తుండగా మార్గంమధ్యలో కన్నుమూసింది. అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డ కండ్లెదుటే మృత్యుఒడికి చేరడాన్ని చూసి తల్లిదండ్రులు రోదించిన తీరు స్థానికులను కలిచివేసింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.
చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామానికి చెందిన లోకిని జంపయ్య తిమ్మాపూర్‌లోని వైన్స్‌లో పని చేస్తుండగా, అతడి భార్య సమీపంలోని టిఫిన్ సెంటర్లో పని చేస్తూ స్థానికంగా నివాసముంటున్నారు. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం వారి కూతురు లోకిని శివాని (10) వారి ఇంటి నుంచి తల్లి పని చేసే స్థలానికి రాజీవ్ రహదారి పక్క నుంచి వెళ్తున్నది. ఇదే సమయం లో కరీంనగర్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు చిన్నారిని వెనుక నుంచి ఢీ కొట్టడంతో ఎగిరి దూరంగా పడిపోయింది. కారు అదుపు తప్పి రోడ్డు పక్కనున్న కరెంట్ స్తంభాన్ని ఢీ కొట్టింది. శివానికి తీవ్ర గాయాలు కాగా, స్థానికులు ఆటోలో కరీంనగర్‌లోని దవాఖానకు తరలిస్తుండగా అల్గునూర్ వద్ద మార్గం మధ్యలో మృతిచెందింది. అక్కడి నుంచి అంబులెన్స్‌లో మృతదేహాన్ని కరీంనగర్ దవాఖానకు తీసుకెళ్లారు. కారు స్తంభాన్ని ఢీకొట్టడంతో విరిగిపోయి వైర్లు తెగిపడ్డాయి. ఈ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కారును తిమ్మాపూర్ ఠాణాకు తరలించారు. బాలిక కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ ప్రమోద్‌రెడ్డి తెలిపారు.