మానకొండూర్ రూరల్, జూలై 8: మహిళలకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో ‘అభయ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని సదాశివపల్లి, మానకొండూర్ మండలం కొండపల్కలలో మహిళలకు సుంకుభాచంద్ర (హైదరాబాద్) ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తున్నారు. అభయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో టైలరింగ్, మెహిందీలకు ట్రైనింగ్ ఇస్తున్నారు. దాతల సహకారంతో పలు రాష్ర్టాల్లో సేవలందిస్తున్నట్లు కో ఆర్డినేటర్ అరుణ ప్రభంజన్ తెలిపారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొండపల్కలలో 32 మంది, సదాశివపల్లిలో 25 మందికి ట్రైనింగ్ ఇస్తూ , సబ్సిడీతో కుట్టు మిషన్లను అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఉచిత శిక్షణ, భోజన వసతి
అభయ హోం, ఇబ్రహీపట్నం ఆశ్రమంలో పురుషులు, మహిళలకు కంప్యూటర్, కార్ డ్రైవింగ్, మొబైల్ రిపేరింగ్, కుట్టు, మగ్గం, బ్యుటీషియన్ తదితర కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నాం. భోజన వసతి ఉచితంగా కల్పిస్తున్నాం. ఆసక్తి గల వారు ఫౌండేషన్ సేవలను వినియోగించుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలి. ఫౌండేషన్ వ్యవస్థాపకులకు హృదయ పూర్వక కృతజ్ఞతలు .
-అరుణా ప్రభంజన్, కో ఆర్డినేటర్
మా అదృష్టంగా భావిస్తున్నం
అభయ ఫౌండేషన్ వారు మా ఊరిలో 32 మందికి ట్రైనింగ్ ఇస్తున్నరు. మా ఊరికే వచ్చి ట్రైనింగ్ ఇవ్వడంతో ప్రయాణ భారం తప్పింది. స్వప్న మేడమ్ ట్రైనింగ్ ఇచ్చారు. ఎప్పటి నుంచో కుట్టు మిషన్ నేర్చుకోవాలనుకున్న. సహకరించిన సర్పంచ్ నల్ల వంశీధర్‌రెడ్డి, ఫౌండేషన్ వ్యవస్థాపకులకు రుణపడి ఉంటా. ప్రతి ఒక్కరూ వినియోగించుకొని ఆర్థికంగా ఎదగాలి.
-జీ లత, కొండపల్కల
కుట్టు పనిరానేరాదనుకున్న
మా ఊరు కరీంనగర్ కార్పొరేషన్ పరిధి సదాశిపల్లి. మా ఊరి నుంచి కరీంనగర్ 2 కి.మీ ఉంటుంది. బస్సు సౌకర్యం లేదు. ఇంటి దగ్గర్లో ఎవ్వరన్న నేర్పిస్తరనుకుంటే కుట్టే పని వస్తదా తీయనుకున్న. గీ మధ్య అభయ ఫౌండేషన్ వారు వచ్చి 30 మందితో బ్యాచ్ తయారు చేసి కుట్టు మిషన్ నేర్పించారు. ఇప్పుడు 25 మందిమి నేర్చుకుంటున్నం.
– వైష్ణవి, సదాశివపల్లి