కమాన్చౌరస్తా, జూలై 8: జిల్లా కేంద్రంలోని ఎస్సారార్ కళాశాలలో ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ, ఈషా ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం ‘రైడ్ ఫర్ సాయిల్’ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కల్పించేందుకు 25 మంది ఈషా వలంటీర్ల బృందం బైక్ రైడింగ్ చేస్తూ కళాశాలకు చేరుకున్నది. వారికి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రామకృష్ణ, వలంటీర్లు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురువు ఇటీవల చేపట్టిన ‘మట్టిని రక్షించు’ 100 రోజుల ప్రపంచవ్యాప్త బైక్ రైడ్ కార్యక్రమం కొనసాగింపుగా ‘రైడ్ ఫర్ సాయిల్’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తలుగా ఈషా యువ వలంటీర్లు అభిరామ్, చైతన్య, అరుణ్, సాయి భూసారాన్ని రక్షించడంపై అవగాహన కల్పించారు. అనంతరం వలంటీర్లతో ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే రామకృష్ణ అధ్యక్షత వహించగా, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ వీ వరప్రసాద్, ఎన్ఎస్ఎస్ అధికారులు ఏ నారాయణ, సురేశ్ కుమార్, డీడీ నాయుడు, ఎన్సీసీ లెఫ్టినెంట్ పీ రాజు, అధ్యాపకులు, ఈషా ఫౌండేషన్ సభ్యులు ప్రియాంక, కుమార్, నాయకి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.