కలెక్టరేట్, జూలై 8: జిల్లాలో ఈనెల 15 నుంచి రెవెన్యూ సదస్సుల నిర్వహణకు సన్నద్ధం కావాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం ఆయన అదనపు కలెక్టర్లు, తహసీల్దార్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి మండలంలో గ్రామాలను మూడు భాగాలుగా విభజించి, మూడు రోజులకు మించకుండా సదస్సులు మండల కేంద్రంలో నిర్వహించాలని సూచించారు. సదస్సుల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని సిద్ధం చేయాలన్నారు. అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా జిల్లాల కలెక్టర్‌తో సమీక్షా సమావేశం నిర్వహించారు.
సదస్సుల నిర్వహణపై చర్చించేందుకు సీఎం కేసీఆర్ ఈనెల 11న హైదరాబాద్‌లోని ప్రగతి భవన్లో కలెక్టర్లతో సమావేశం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అప్పటి వరకు జీవో నం. 58 కింద వచ్చిన దరఖాస్తుల ప్రాథమిక విచారణ ప్రక్రియ పూర్తి చేసి, సమాచారంతో సమావేశానికి హాజరు కావాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వంద బృందాలను రెవెన్యూ ఉన్నతాధికారుల అధ్యక్షతన ఏర్పాటు చేయాలని సీఎం సూచించినట్లు పేర్కొన్నారు. జిల్లాలోని ప్రతి 5 మండలాలకొక బృందాన్ని ఏర్పాటు చేసి, ప్రతి మండల కేంద్రంలో మూడు రోజులకు మించకుండా రెవెన్యూ సదస్సులు నిర్వహించాలన్నారు.
అత్యధిక విస్తీర్ణం కలిగిన వేదికల్లో వీటిని నిర్వహించాలని, వాహనాల పార్కింగ్, కంప్యూటర్లు, ప్రింటర్, జిరాక్స్ యంత్రం, మొబైల్ మీసేవ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. స్థానిక ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకొని సదస్సుల తేదీలు ఖరారు చేయాలన్నారు. సదస్సుల షెడ్యూల్‌పై గ్రామాల్లో ప్రచారం చేయాలని సూచించారు. సీఎం సమీక్షకు వచ్చే క్రమంలో జిల్లాలో ఏర్పాటు చేసే బృందాల వివరాలు, మండల కేంద్రాల్లో వేదికలు, షెడ్యూల్ లాంటి లాజిస్టిక్ వివరాలు కూడా సిద్ధం చేయాలన్నారు. సంక్షేమ గురుకుల పాఠశాలలు మంజూరు చేసిన ప్రాంతాల్లోనే ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించినట్లు సీఎస్ పేర్కొన్నారు. ప్రతి జిల్లాలో ఆగస్టు 15 నాటికి బీసీ, ఎస్సీ స్టడీ సర్కిళ్ల ఏర్పాటుకు స్థలాలు, భవనాలను గుర్తించాలని ఆదేశించారు. హరితహారం, గ్రామీణ క్రీడా ప్రాంగణాల పురోగతి వివరాలు తయారు చేయాలని సూచించారు.