కోనరావుపేట, జూలై 8: ఆరేళ్లుగా గ్రామంలోకి వచ్చిన ఉత్తరాలను బట్వాడా చేయకుండా ఇంట్లోనే ఉంచుకున్నాడు ఓ పోస్ట్‌మ్యాన్. గ్రామస్తుల ఫిర్యాదుతో ఈ సంఘటన ఆలస్యంలోకి వెలుగులోకి రాగా గ్రామానికి ఉన్నతాధికారులు వచ్చి విచారణ చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని కనగర్తి గ్రామానికి చెందిన పోస్టుమ్యాన్ వేణుగోపాల్ గ్రామంలో వివిధ అవసరాల కోసం వస్తున్న ఉత్తరాలను బట్వాడా చేయకుండా తన ఇంట్లోనే ఉంచుకున్నాడు.
ఈ క్రమంలో కాల్‌లెటర్, ఇంట ర్వ్యూ లెటర్లు మిస్సయిన వారు ఇటీవల అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో గ్రామంలోకి అధికారులు చేరుకొని విచారణ చేపట్టగా వేణుగోపాల్ ఇంట్లో 2016 నుం చి వచ్చిన ఉత్తరాలన్నీ ఉన్నాయి. వాటిలో ఆధార్‌కార్డులు, బ్యాంక్ ఏటీఎం కార్డులు, ఇతర పలు రకాల సంస్థల ఉత్తరాలు ఉన్నాయి. దీంతో పోస్టల్ సూపర్ వైజర్లు భూమయ్య, అంజనేయులు స్థానిక గ్రామపంచాయతీ వద్దకు వాటిని తీసుకువచ్చి పంపిణీ చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన వేణుగోపాల్‌ను ఆరునెలల పాటు సస్పెండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. అప్పటి వరకు మల్కపేట బ్రాంచ్ పోస్టుమార్ట్గా పనిచేస్తున్న రాజునాయక్‌కు కనగర్తి బాధ్యతలను అప్పగించినట్లు పేర్కొన్నారు.