కరీంనగర్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో మూడు రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేస్తూ బిల్లు ప్రవేశపెడతామని ప్రధాని మోడీ ప్రకటించడం హర్షణీయమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ ఉద్ఘాటించారు. నిన్న హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో కలిసి చేసిన ధర్నాతో కేంద్రం వెనక్కి తగ్గిందని పేర్కొన్నారు. శుక్రవారం కరీంనగర్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. అటు కేంద్రం వైఖరి.. ఇటు బీజేపీ రాష్ట్ర శాఖ తీరును తూర్పారబట్టారు. రైతు చట్టాలను ఉపసంహరించుకోవాలని ఏడాది నుంచి దేశవ్యాప్తంగా రైతాంగం ఉద్యమించినా.. మేధావులు సూచించినా మోడీ ప్రభుత్వం పట్టించుకోలేదని దుయ్యబట్టారు. ఈ చట్టాలపై పార్లమెంట్లో చర్చకు పెట్టాలని టీఆర్ఎస్ సభ్యులు కోరినా పట్టించుకోకుండా నిమిషాల్లో ఆమోదించారని విమర్శించారు. 1200 మంది రైతుల ఉసురు తీసుకున్నదని నిప్పులు చెరిగారు. కనీసం ఆరు నెలల కిందట ఈ నిర్ణయం తీసుకొని ఉంటే రైతుల ప్రాణాలు దక్కేవవన్నారు. మరణించిన రైతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రాష్ట్ర బీజేపీతో గందరగోళం..
యాసంగి వడ్ల కొనుగోలుపై కేంద్రం ఇచ్చిన ఆదేశాలకు భిన్నంగా రాష్ట్ర బీజేపీ నేతలు ప్రకటనలు చేస్తూ రైతులను గందరగోళానికి గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. మహాధర్నాలో ఈ విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రం వైఖరిని వెల్లడించాలని సూటిగా ప్రశ్నించారని చెప్పారు. ‘వరి నాట్లు వేయండి, కేసీఆర్ మెడలు వంచి వడ్ల కొనుగోళ్లు జరిపిస్తాం’ అంటూ రైతులను రెచ్చగొట్టిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఇపుడు ఎవరి మెడలు వంచుతాడని నిలదీశారు. రైతులకు అండగా దేశవ్యాప్త ఉద్యమం చేపడతామని కేసీఆర్ ప్రకటించిన కారణంగానే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నదన్నారు. ప్రజలు మోడీ విధానాలను వ్యతిరేకిస్తున్నారన్నారు. ‘బీజేపీ హఠా వో.. దేశ్ బచావో’ నినాదం దేశవ్యాప్తంగా మార్మోగుతుందని చెప్పారు. ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్, ఇండోనేషియా లాంటి దేశాల్లో అత్యధికంగా వరి పండించడంతో ప్రపంచవ్యాప్తంగా ధాన్యం దిగుబడులు పేరుకుపోతున్నాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బండి సంజయ్ రైతులను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాడన్నారు. నిన్నమొన్నటి దాకా వరి అంటూ ఊర్ల వెంట తిరిగిన ఆయన, ఇప్పుడు పెట్రోల్ ధరలపై ఆందోళన చేస్తామని చెప్పడం హాస్యాస్పదమన్నారు. ఆరున్నరేండ్లలో రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారి కూడా పెట్రోల్‌పై పన్నులు పెంచలేదని, ఒకేసారి రూ. 2 మాత్రం కన్వర్టు చేసిందన్నారు. కేంద్రం 18 సార్లు పెట్రో ధరలు పెంచడమేగాకుండా చట్ట విరుద్ధంగా సెస్సు వసూలు చేస్తున్నదని విమర్శించారు. రాష్ర్టాలకు వాటా పంచకుండా చోద్యం చూస్తున్నదని దుయ్యబట్టారు. వీటిపై అవగాహన లేని సంజయ్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడని విమర్శించారు. ఎంపీగా ఉన్న ఆయన బాధ్యతగా మాట్లాడాలని హితవు పలికారు. కేంద్రం తెలంగాణకు రావాల్సిన ఎరువులను ఎన్నికలు జరుగుతున్న పంజాబ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ర్టాలకు మళ్లించేందుకు కుట్రలు చేస్తున్నదని ఆరోపించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అనేక సార్లు విన్నవించినా పెడచెవిన పెడుతున్నదన్నారు. ఈ సీజన్లో తెలంగాణకు అవసరమైన యూరియా, డీఏపీ, పొటాష్ ఎరువులను ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, మాజీ ఎమ్మెల్యేలు కోడూరి సత్యనారాయణ గౌడ్, ఆరెపల్లి మోహన్, డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపారాణి, మాజీ మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్, నేత రవీందర్రావు ఉన్నారు.