ధర్మపురి, నవంబర్19 : ఏడాది కాలంగా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న వ్యవసాయ చట్టాలను స్వయంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఉపసంహరించుకోవడంపై రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ హర్షం వ్యక్తం చేశారు. నల్ల చట్టాలపై అడ్డదిడ్డంగా మాట్లాడిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, నిజామామాద్ ఎంపీ అర్వింద్ తప్పు ఒప్పుకొని చెంపలేసుకోవాలని, ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేశారు. ధర్మపురిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రం వెనక్కి తగ్గడం ముమ్మాటికీ టీఆర్ఎస్ పోరాట ఫలితమేనని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. రైతులను ఇబ్బంది పెట్టే విధానాల అమలు చేయడం తప్పుగా భావిస్తున్నామని ఇప్పుడు చెప్పుకురావడం కేంద్ర సర్కార్ బాధ్యతారాహిత్యానికి నిదర్శనమన్నారు. రాష్ట్రంలో రైతుల కోసం అనేక పథకాలను అమలుచేసి, ప్రాజెక్టులు నిర్మించుకొని, వ్యవసాయ రంగంలో దేశానికే ఆదర్శంగా మార్చి ముందుకుసాగుతుంటే రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న కేంద్ర విధానాలపై టీఆర్ఎస్ ఉక్కుపాదం మోపాల్సి వచ్చిందన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో జాతీయ రైతు ఉద్యమానికి టీఆర్ఎస్ నడుం బిగించిందన్నారు.
దీని ఫలితంగానే కేంద్రం దిగివచ్చిందని చెప్పారు.అలాగే ఉపఎన్నికల ఫలితాలు కూడా కేంద్ర సర్కార్ చెంప చెల్లుమనిపించాయన్నారు. దేశవ్యాప్తంగా 32 స్థానాల్లో పోటీ చేస్తే కేవలం 8 స్థానాల్లోనే గెలిచిందన్నారు. కేంద్ర విధానాల వల్ల వందల మంది రైతులు బలయ్యారని, వారి కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర బీజేపీ నాయకుల వైఖరిలో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో రైతులను చైతన్య వంతులను చేసే విధంగా ప్రభుత్వం ముందుకు సాగుతుంటే.. బీజేపీ అధికారదాహం కోసం తీసుకున్న నిర్ణయాల వల్ల రైతులు ఇబ్బందులు పడ్డారని తెలిపారు. సమావేశంలో ఉమ్మడి జిల్లా డీసీఎమ్మెస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ సంగి సత్తెమ్మ, ఆర్బీఎస్ కన్వీనర్ సౌళ్ల భీమయ్య, కౌన్సిలర్లు అనంతుల విజయలక్ష్మి, అశోక్, టీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు మొగిలి శేఖర్, అకుల రాజేశ్ పాల్గొన్నారు.