గన్నేరువరం, నవంబర్ 19: గన్నేరువరం మండల కేంద్రం ప్రగతి పథంలో ముందుకు సాగుతున్నది. తెలంగాణ ప్రభుత్వం అందజేస్తున్న పల్లెప్రగతి నిధులతో పాటు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సహకారంతో పాలకవర్గ సభ్యులు గ్రామ అభివృద్ధికి తమవంతు కృషి చేస్తున్నారు. గ్రామంలో 4,777 మంది జనాభా ఉండగా, 1,387 ఇండ్లు ఉన్నాయి. ఇంటింటా ఇంకుడుగుంత, మరుగుదొడ్డి నిర్మించుకొని వినియోగిస్తున్నారు. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఇంటింటికీ మిషన్ భగీరథ నీరు సరఫరా చేస్తున్నారు. ప్రతి వాడలో సీసీ రోడ్డు, మురుగు కాలువలు నిర్మించారు. పారిశుధ్య సిబ్బంది ఎప్పటికప్పుడు మురుగు కాలువలు, రోడ్లకు ఇరువైపులా పెరిగిన పిచ్చిమొక్కలను శుభ్రం చేయడంతో పాటు బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్నారు. గ్రామస్తులకు తడి, పొడి చెత్తను వేరు చేసేలా అవగాహన కల్పించి, ఇంటికి రెండు డబ్బాలు పంపిణీ చేశారు. దీంతో చెత్తను వేర్వేరుగా డబ్బాల్లో వేసి నిత్యం పారిశుధ్య సిబ్బంది తీసుకువచ్చే ట్రాక్టర్లో వేస్తున్నారు. చెత్తను సెగ్రిగేషన్ షెడ్డుకు తరలించి తడి చెత్తతో వర్మీ కంపోస్టు ఎరువు తయారు చేస్తున్నారు. ఈజీఎస్ నిధులు రూ. 12 లక్షలు, గ్రామ పంచాయతీ నిధులు రూ. 10 లక్షలతో వారసంతను నిర్మించి, సకల సౌకర్యాలు కల్పించారు.
ప్రతి మంగళవారం సంత నిర్వహిస్తుండగా చుట్టూ పక్కల గ్రామాల రైతులు కూరగాయలు తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. అలాగే, వైకుంఠధామం నిర్మాణం పూర్తి చేసి వినియోగంలోకి తెచ్చారు. పల్లె ప్రకృతి వనంలో వివిధ రకాల పూలు, పండ్లు, నీడనిచ్చే మొక్కలు నాటగా ఏపుగా పెరిగి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ప్రకృతి వనంలో బెంచీలు ఏర్పాటు చేయగా సాయంత్రం సమయంలో గ్రామస్తులు సేదతీరుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతు వేదికను నిర్మించగా, క్లస్టర్ పరిధిలో గ్రామాల రైతులకు వ్యవసాయాధికారులు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. గ్రామ పంచాయతీకి వివిధ నిధుల కింద ప్రతి నెలా రూ. 6 లక్షలు వస్తుండగా పారిశుధ్య కార్మికులకు, గ్రామ పంచాయతీ సిబ్బందికి రూ. 85,000 వేతనాల రూపంలో చెల్లిస్తున్నారు. అలాగే, ట్రాక్టర్ కిస్తీ, కరెంటు బిల్లు చెల్లిస్తున్నారు.
మరింత అభివృద్ధి చేస్తాం
ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సహకారంతో మండల కేంద్రాన్ని మరింత అభివృద్ధి చేస్తాం. గ్రామంలో వైకుంఠధామం, రైతు వేదిక, సెగ్రిగేషన్ షెడ్డు, వారసంత నిర్మాణాలు పూర్తి చేసి వినియోగంలో తీసుకువచ్చాం. ఎమ్మెల్యే సహకారంతో త్వరలోనే ప్రభుత్వ కార్యాలయాలకు భవనాలు, మండల కేంద్రానికి డబుల్ రోడ్డు నిర్మాణం చేపడుతాం.
-మాడుగుల రవీందర్ రెడ్డి, జడ్పీటీసీ
ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నం
ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, జడ్పీటీసీ మాడుగుల రవీందర్రెడ్డి, పంచాయతీ పాలకవర్గ సభ్యుల సహకారంతో గ్రామస్తులకు పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పిస్తున్నం. పల్లె ప్రగతి నిధులతో అభివృద్ధి పనులు చేపట్టాం. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి సెగ్రిగేషన్ షెడ్డుకు తరలిస్తున్నం. ప్రతి మంగళవారం వారసంతలో కూరగాయలు విక్రయిస్తున్నారు. గ్రామ అభివృద్ధికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. -పుల్లెల లక్ష్మి, సర్పంచ్