కరీంనగర్ రూరల్, జూలై 1: ‘వైద్యోనారాయణో హరిః అన్న సూక్తి ప్రకారం ప్రాణం పోసేది బ్రహ్మ అయితే.. పునర్జన్మను ఇచ్చేది వైద్యులు’ అని ప్రతిమ ఫౌండేషన్ చైర్మన్, ప్రతిమ మెడికల్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ బోయినపల్లి హరిణి అభివర్ణించారు. శుక్రవారం కరీంనగర్ మండలం నగునూర్ ప్రతిమ వైద్యవిజ్ఞాన సంస్థలో ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ నిర్వహించారు. వైద్య కళాశాల ఆవరణలో డాక్టర్ హరిణితోపాటు వైద్యులు మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డాక్టర్ హరిణి మాట్లాడారు. తల్లిదండ్రులు, గురువుల తర్వాత దేవుడిగా భావించేది వైద్యులనే అని చెప్పారు. ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా వైరస్‌కు ఎదురొడ్డి ముం దుండి పోరాడారని, తమ ప్రాణాలను పణంగా పెట్టి లక్షలాది మందిని కాపాడారని చెప్పారు. ఇంకా కాలుష్య నివారణ, ప్రాణవాయువు కోసం ప్రతి ఒక్కరూ మొక్క లు నాటాలని సూచించారు. ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ సీహెచ్ లక్ష్మణ్‌కుమార్ మాట్లాడుతూ.. వైద్య వృత్తి పవిత్రమైనదని, వైద్యులు అనునిత్యం వైద్యంపై శోధన చేయాలని సూచించారు. ఐఎంఏ సెక్రెటరీ డాక్టర్ కటారి అరుణ్‌కుమార్.. మాట్లాడుతూ వైద్యులు జవాబుదారీగా ఉన్నప్పుడే రోగులకు మనపై నమ్మకం ఏర్పడుతుందని చెప్పారు. అనంతరం వైద్య కళాశాలలో పీజీ చేస్తూ వివిధ విభాగాల్లో ప్రతిభచూపిన వైద్య విద్యార్థులకు ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నగదుతోపాటు, జ్ఞాపిక, సర్టిఫికెట్స్‌ను అందించి, సన్మానించారు.
ప్రభుత్వ దవాఖానకు మినీ అంబులెన్స్
వైద్య సేవల్లో ముందుండే కరీంనగర్‌లోని ప్రతిమ ఫౌండేషన్ మరోసారి తన గొప్ప మనసును చాటుకుం ది. వైద్యుల దినోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు మినీ అంబులెన్స్‌ను అందించారు. ఈ మేరకు ప్రతిమ ఫౌండేషన్, ప్రతిమ మెడికల్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ బోయినపల్లి హరిణి అంబులెన్స్ తాళాలను ప్రభుత్వ దవాఖానకు మెడికల్ సూపరింటెండెంట్ రత్నమాలకు అందించారు. కళాశాల డీన్ అచంట వివేకానంద, సీఏవో డాక్టర్ సీ రామచంద్రరావు, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ సీహెచ్ రవీందర్రావు, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యులు పిడియాట్రిక్ హెచ్‌వోడీ డాక్టర్ సీహెచ్ అమిత్‌కుమార్, ప్రొఫెసర్ జనరల్ మెడిసిన్ హెచ్‌వోడీ డాక్టర్ కే రవీందర్ రెడ్డి ఉన్నారు.