హుజూరాబాద్‌టౌన్, జూలై 1: తెలంగాణ ఇమేజ్ను బద నాం చేసేందుకు కేంద్ర మంత్రులు, బీజేపీ నాయకులు తెలంగాణలో పర్యటిస్తున్నారని, ఉత్త మాటలు వద్దని, నిజంగా తెలంగాణపై ప్రేముంటే నిధులు ఇవ్వాలని తెలంగాణకు వస్తున్న కేంద్ర మంత్రులను ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి డిమాండ్ చేశారు. హుజూరాబాద్ పట్టణంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో టీఆర్ఎస్వీకేలో నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన 200 మంది వీవోఏలు చేరారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కౌశిక్‌రెడ్డి మాట్లాడారు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నారని పేర్కొన్నారు. వీవోఏల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. ఉన్నత పదవిలో ఉండి కూడా దళితుల భూములను కబ్జా చేసిన ఈటల రాజేందర్ విషయం అందరికీ తెలిసిందేనని, ప్రభుత్వం వాటిని పేదలకు పంచిందని పేర్కొన్నారు. మహిళలపై తనకు అపారమైన గౌరవముందని, కానీ, కొందరు తాను అనని మాటలు అన్నట్లుగా చూపారని ఆరోపించారు.
81వ సర్వే నంబర్లో 5.36 ఎకరాల భూమి జమున హెచరీస్ పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకున్న మాట వాస్తవం కాదా..? అని ప్రశ్నించారు. కబ్జా భూములను పేదలకు పంచితే తప్పేముందని ప్రశ్నించారు. తప్పు ఎవరిదైతే వారు ముకు భూమికి రాయాలని ఈటలకు సవాల్ విసిరారు. అంతకుముందు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ మాట్లాడుతూ, కార్మిక సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. టీఆర్ఎస్ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి గెల్లు శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ, తెలంగాణకు వస్తున్న కేంద్ర మంత్రులకు ఇక్కడి పల్లెల ప్రగతిని చూపాలని, సమస్యల పరిష్కారానికి వారేం చేస్తారో నిలదీయాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గ అభివృద్ధికి కేంద్ర మంత్రులతో రూ. 100 కోట్లను మంజూరు చేయించే సత్తా స్థానిక ఎమ్మెల్యే ఈటలకు ఉందా? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, కార్మిక విభాగం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఎల్ రూప్సింగ్ మాట్లాడుతూ, తెలంగాణ వచ్చాక అన్ని రంగాల్లోని మహిళలకు గౌరవ వేతనాలు పెంచిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.
వీవోఏలను పీఆర్సీ పరిధిలోకి తేవడంతో పాటు గౌరవ వేతనం పెంచిన ఘనకీర్తి కేసీఆర్‌దే అని అన్నారు. త్వరలో వీవోఏలకు డ్రెస్ కోడ్, బీమా సౌకర్యం కల్పించేందుకు సీఎం కృషి చేస్తున్నారని తెలిపారు. మహిళలు ఆశించిన విధంగా పనిచే స్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో మద్దతు పలు కాలని కోరారు. ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక, వైస్ చైర్ పర్సన్ కొలిపాక నిర్మల, వీవోఏల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు మారిపెల్లి మాధవి, ఆర్పీల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు మానుకోట సునీ త, టీఆర్ఎస్వీకే జిల్లా అధ్యక్షుడు ఎం శ్రీనివాస్, రాష్ట్ర కోశాధికారి పీ తిరుపతి, జిల్లా నాయకుడు రాంమూర్తి, మహిళా నాయకులు రాధ, సంధ్య, శ్రీలత, హుజూరాబాద్, కమలాపూర్, జమ్మికుంట వీణవంక, ఇల్లంతకుంట మండలాలకు చెందిన మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.