హుజూరాబాద్ టౌన్, నవంబర్ 19: కార్తీక పౌర్ణమి సందర్భంగా డివిజన్లోని అన్ని శివాలయాల్లో అభిషేకాలు, దీపారాధనలతో భక్తిభావం వెల్లివిరిసింది. ఉదయం నుంచే దైవ దర్శనానికి తరలివచ్చిన భక్తులతో దేవాలయాల్లో సందడి కనిపించింది. పట్టణంలోని శ్రీసంతోషిమాత సహిత అయ్యప్పస్వామి ఆలయంలో అర్చకులు గూడ జగదీశ్వరశర్మ ఆధ్వర్యంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు జరిగాయి. ఇందులో సుమారు 45 మంది జంటలు పాల్గొన్నాయి. అలాగే ఆంజనేయస్వామి, ప్రతాపవాడలోని రాజరాజేశ్వరస్వామి ఆలయం, శివరామాలయం, కొత్తపల్లిలోని శ్రీనాగేంద్రస్వామి ఆలయం, బోర్నపల్లి శివాలయంలో కార్తీక దీపాలు వెలిగించారు. అందంగా అలంకరించారు. ఆయా కార్యక్రమాల్లో ఆలయాల ప్రధాన పూజారులు వెంకట్రావు, పందిళ్ల భాస్కర్‌శర్మ, అవధానుల భాస్కర్‌శర్మ, రామాచార్యులు, రాహులాచార్యులు తదితరులతో పాటు ప్రజాప్రతినిధులు, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
జమ్మికుంట, నవంబర్ 19: కార్తీక పౌర్ణమి సందర్భంగా పట్టణంలోని ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. ముఖ్యంగా శివాలయాల్లో భక్తులు బారులు తీరి దైవ దర్శనం చేసుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. మొక్కులు చెల్లించారు. ఆలయ కమిటీల ఆధ్వర్యంలో భక్తుల కోసం ఉసిరి చెట్టు కింద అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. సాయంత్రం ఆలయాల్లో, ఇండ్ల ముందట దీపాలు వెలిగించారు.
ఇల్లందకుంట, నవంబర్ 19: అపరభద్రాద్రి ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలోని రామలింగేశ్వరస్వామికి అర్చకుడు నవీన్‌శర్మ ప్రత్యేక పూజలు చేశారు. ఫల, పుష్పాలు సమర్పించి, పంచామృతాలతో స్వామి వారిని అభిషేకించారు. సాయంత్రం ఆలయ ఆవరణలో నిర్వహించిన కార్తీక దీపార్చన కార్యక్రమంలో మహిళలు పాల్గొని దీపాలు వెలిగించారు. ఇక్కడ దేవాలయ ఈవో కందుల సుధాకర్, అర్చకులు శేషం రామాచార్యులు, వంశీధరాచార్యులు, దేవాలయ సిబ్బంది మోహన్, రవి, రాజన్న, భక్తులు పాల్గొన్నారు.
హుజూరాబాద్ రూరల్, నవంబర్ 19: మండలంలోని తుమ్మనపల్లిలో శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి, సింగాపూర్‌లో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం, చెల్పూర్లో పురాతన శివాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. భక్తులు దైవ దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
సైదాపూర్, నవంబర్ 19: మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లోని ఆలయాల్లో కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు దీపారాధన చేశారు. పలు గ్రామాల్లో సత్యనారాయణ స్వామి నోములతో సందడి వాతావరణం కనిపించింది.
వీణవంక, నవంబర్ 19: మండల కేంద్రంలోని పురాతన శివాలయంలో మొక్కులు చెల్లించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయంలో కార్తీక దీపాలు వెలిగించారు. శివలింగానికి అభిషేకాలు చేశారు. మామిడాలపల్లిలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో సాయంత్రం కార్తీక దీపోత్సవం కనుల పండువగా సాగింది. ఆయా కార్యక్రమాల్లో సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, భక్తులు పాల్గొన్నారు.
జమ్మికుంట రూరల్, నవంబర్ 19: మండలంలోని మాచనపల్లి పురాతన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో జ్వాలాతోరణం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ముందుగా అర్చకులు ఉమాశంకర్, శ్రీనివాస్ వేద మంత్రోచ్ఛారణల మధ్య శ్రీ రామలింగేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు ఆలయ ఆవరణలో కార్తీక దీపాలను వెలిగించి మొకులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాజమల్లు, బొజ్జం తిరుపతి రెడ్డి, సతీశ్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, సుమన్ రెడ్డి, గోపాల్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.