వాన దంచి కొట్టింది. బుధవారం రాత్రి నుంచి గురువారం మధ్యాహ్నం వరకు కుండపోత పోసింది. రెండు రోజులుగా పడుతున్న వానలతో ఉమ్మడి జిల్లా అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతుండడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. గోదావరి, మానేరు, మోయతుమ్మెద, మూల వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. భారీగా వరద వస్తుండడంతో ప్రాజెక్టులు, చెరువులు నిండుతున్నాయి. కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా 63.6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదవగా, మండలాల వారీగా చూస్తే రాయికల్‌లో 180 మిల్లీ మీటర్లు పడింది.
– కరీంనగర్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ)
కరీంనగర్ జిల్లాలో వాన కుండపోత పోసింది. సగటు వర్షపాతం 63.6 మిల్లీ మీటర్లు నమోదవగా, తిమ్మాపూర్ మండలంలో అత్యధికంగా 170.2 (17.02 సెంటి మీటర్లు) మిల్లీ మీటర్లు పడింది. మోయతుమ్మెద వాగు ద్వారా ఎల్ఎండీ రిజర్వాయర్‌లోకి భారీ వరద వచ్చి చేరుతున్నది. తిమ్మాపూర్, గన్నేరువరం, శంకరపట్నం, చొప్పదండి తదితర మండలాల్లో వాగులు, వంకలు, కల్వర్టులు పొంగడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. తిమ్మాపూర్ మండలం గొల్లపల్లిలో చెరువు మత్తడి కింద 40 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. వాతావరణ శాఖ అధికారులు బుధ, గురువారాల్లో జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.
జగిత్యాల జిల్లాలో 60 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదవగా, అత్యధికంగా రాయికల్ మండలంలో 180 మిల్లీమీటర్లు పడింది. ప్రతి మండలంలోనూ సగటున 5 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. జిల్లాలోని వాగులు, వంకలు పొంగి పొర్లాయి. లోతట్టు గ్రామాలు పూర్తిగా జలమయమయ్యాయి. రాయికల్ మండల వ్యాప్తంగా 15 వంతెనలు, కల్వర్టులపై నుంచి నీరు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలను నిలిపివేశారు. బీర్పూర్ మండల కేంద్రంలో నర్సింహులపల్లి గ్రామ శివారులో ఎస్సారెస్పీ మెయిన్ కెనాల్ యూటీకి గండి పడడంతో పంట పొలాలు నీట మునిగాయి. గోదావరి నది పరీవాహక ప్రాంతాలైన రంగసాగర్, మంగెల, కమ్మునూరు, రేకులపల్లి, చిత్ర వేణు గూడెం గ్రామాల్లో పంటపొలాలు నీట మునిగాయి. భారీ వర్షం నేపథ్యంలో జాతీయ రహదారి 563పై పలు చోట్ల ఉన్న వాగులు, వంతెనలు పొంగిపొర్లాయి. దీంతో చాలా చోట్ల వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. జగిత్యాల-మంచిర్యాల మధ్య బుధవారం రాత్రి నుంచి గురువారం మధ్యాహ్నం వరకు రాకపోకలు నిలిచిపోయాయి.
భారీ వర్షాలతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో జనజీవనం స్తంభించి పోయింది. కామారెడ్డి జిల్లాలో పడిన భారీ వానలతో గంభీరావుపేట మండలం ఎగువ మానేరు ప్రాజెక్టులోకి భారీగా వరద చేరి మత్తడి ఉప్పొంగి దుంకుతున్నది. మాచారెడ్డి, ముస్తాబాద్ మండలాలకు వెళ్లే రహదారిపై నుంచి వరద నీరు ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచి పోయాయి. మరోవైపు మాచారెడ్డి మండలం పాల్వంచ వాగు బ్రిడ్జి పైనుంచి వరద నీటి ప్రవాహంతో రోడ్డు కుంగిపోయింది. దీంతో కామారెడ్డి, కరీంనగర్‌కు వెళ్లాల్సిన వాహనాలు ఎక్కడికక్కడే నిలిచి పోయాయి. రా మారెడ్డి మండలం నుంచి దారి మళ్లించినప్పటికీ, ఆ రహదారిలోని కల్వర్టులు నీటిలో మునిగి పోవడంతో రాకపోకలు పూర్తిగా నిలిచి పోయాయి. కరీంనగర్ నుంచి కామారెడ్డి వెళ్లాల్సిన ఆర్టీసీ బస్సులు మాచారెడ్డి వరకే నడిపిస్తున్నారు. కూడెల్లి, పాల్వంచ వాగులతో పాటు వరద నీరు భారీగా చేరి ప్రాజెక్టు దిగువన ఉన్న సిరిసిల్ల మానేరులోకి నీరు చేరి వాగు ఉగ్రరూపం దాల్చింది. మానేరు వాగుపై నిర్మించిన చెక్‌డ్యాంలు నిండి మత్తడి దుంకుతున్నాయి. మానేరు వాగు ఇరువైపులా ఒడ్లవరకు నీరు ప్రవహిస్తున్నది. సిరిసిల్ల పట్టణంలోని బతుకమ్మ ఘాట్ మెట్ల వరకు, గంగమ్మ గర్భగుడి వరకు మునిగి పోయింది.
రాయికల్, ఆగస్టు 28 : పురిటినొప్పులతో తల్లడిల్లుతున్న ఓ నిండు గర్భిణి ఎక్స్కవేటర్ సాయంతో అవతలి ఒడ్డుకు చేరింది. వివరాల్లోకి వెళ్తే.. రాయికల్ మండలం ఒడ్డెలింగాపూర్ పరిధిలోని మాంగ్త్యానాయక్ తండాకు చెందిన గుగ్లావత్ కళ్యాణికి గురువారం సాయంత్రం పురిటినొప్పులు ఎకువ కావడంతో కుటుంబ సభ్యులు ఆమెను తీసుకొని జగిత్యాలకు బయలుదేరారు. మార్గమధ్యలో భూపతిపూర్- రామాజీపేట గ్రామాల మధ్యగల వంతెనపై నీటి ఉధృతి అధికంగా ఉండడంతో అవతలి వైపునే ఆగిపోయారు. దీంతో విషయం తెలుసుకున్న రామాజీపేటకు చెందిన యువకులు ఎక్స్కవేటర్ సాయంతో గర్భిణిని అవతలి ఒడ్డుకు చేర్చారు. అకడి నుంచి అంబులెన్స్‌లో దవాఖానకు తరలించారు.
తిమ్మాపూర్, చిగురుమామిడి, సిద్దిపేట జిల్లా కోహెడ, బెజ్జంకి మండలాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా ఎల్ఎండీలోకి భారీగా వరద వస్తున్నది. మొన్నటి వరకు 11.546 టీఎంసీలు ఉండగా, గురువారం మధ్యాహ్నం 12 గంటల వరకు 15.022 టీఎంసీలకు చేరింది. ఉదయం మోయతుమ్మెద వాగు ద్వారా 18,657 శ్రీరాజరాజేశ్వర జలాశయం ద్వారా 43 వేల క్యూసెక్కుల నీరు వచ్చింది. సాయంత్రం వరకు మొత్తం 55,829 క్యూసెక్కులుగా నమోదైంది. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టం 24.034 టీఎంసీలుకాగా ప్రస్తుతం 15.652 టీఎంసీలకు చేరింది. గంట గంటకు నీటి మట్టం పెరుగుతుండడంతో అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే రిజర్వాయర్‌ను సందర్శించారు. కాగా, రిజర్వాయర్‌లోకి భారీగా వరద వచ్చి చేరుతుండడంతో శుక్రవారం ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య గేట్లు ఎత్తే అవకాశం ఉంటుందని ఇరిగేషన్ సర్కిల్ -2 ఎస్ఈ పీ రమేశ్ తెలిపారు.
అంతర్గాం, ఆగస్టు 28 : అధిక వర్షాలతో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతున్నది. గురువారం సాయంత్రం 6 గంటల వరకు చూస్తే ఇన్‌ఫ్లో 5 లక్షల 14వేల 332 క్యూసెక్కులుగా ఉంది. అధికారులు 38 గేట్లు ఎత్తి 5 లక్షల 91వేల 166 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టుకు వరద తాకిడి మరింతగా పెరిగే ప్రమాదం ఉన్న కారణంగా దిగువన రామగుండం, గోదావరిఖని, మంథని తదితర గోదావరి నది పరీవాహక ప్రాంతాలకు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రాజెక్టు సామర్థ్యం 148 మీటర్లు కాగా, ప్రస్తుతం 146.59 లెవల్లో ఉంది. 20.175 టీఎంసీల నీటి సామర్థ్యం గల ప్రాజెక్టులో ప్రస్తుతం 16.3621 టీఎంసీల నీరు నిల్వ ఉంది.