ధర్మపురి, జూన్ 20: గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన విద్యా వైద్యం అందించాలనే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం ఆయా రంగాలకు అధిక ప్రాధాన్యతనిస్తున్నదని రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు.. మన బడి’ దేశానికే ఆదర్శమని చెప్పారు. ధర్మపురి మండలం రాయపట్నం గ్రామంలో సోమవారం నిర్వహించిన మన ఊరు-మనబడి కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాయపట్నం మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో 12.60లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఉన్నత విద్యా ప్రమాణాలతో పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి, వారిని ఉన్నతంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ మన ఊరు- మనబడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. మూడేళ్లలో రాష్ట్రంలోని మొత్తం పాఠశాలల్లో అన్ని సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదన్నారు.
మొదటి సంవత్సరం 7,229 కోట్లు వెచ్చించి పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తున్నామన్నారు. కాగా, రెండు జిల్లాలను కలిపే రాయపట్నం కూడలి వద్ద సుందరీకరణ పనులు చేపట్టనున్నట్లు మంత్రి ఈశ్వర్ తెలిపారు. అలాగే రాయపట్నంలో రైతులు మక్క, దోసకాయలు అధికంగా పండిస్తారని, వాటిని విక్రయించుకునేందుకు పాత వంతెన రహదారి పక్కన మూడెకరాల ప్రభుత్వ స్థలం ఉందని, ఇందులో ఎకరంలో షెడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు చెప్పారు. మిగతా రెండెకరాల్లో 30 ఫీట్ల బుద్దుడి విగ్రహం, 25 ఫీట్ల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే సందర్శకుల ఆహ్లాదం కోసం పార్కు కూడా ఏర్పాటు చేస్తామన్నారు.
కార్యక్రమంలో డీసీఎమ్మెస్ చైర్మన్ డా. ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, ఎంపీపీ ఎడ్ల చిట్టిబాబు, జడ్పీటీసీ బత్తిని అరుణ, ఏఎంసీ చైర్మన్ అయ్యోరి రాజేశ్‌కుమార్, వైస్ చైర్మన్ అక్కనపల్లి సునీల్‌కుమార్, తహసీల్దార్ వెంకటేశ్, ఎంపీడీవో ప్రవీణ్, సర్పంచ్ ఈర్ల చిన్నక్క-మొండయ్య, మండల పరిషత్ కోఆప్షన్ సభ్యుడు ఎండీ కైసర్, నాయకులు పురాణపు సాంబమూర్తి, అయ్యోరి వేణు పాల్గొన్నారు.
“సారూ దండాలు.. మీరచ్చినంక మా రాయపట్నం పూర్తిగా మారింది. తలాపున గోదారి ఉన్నా ఒకప్పుడు తాగడానికి నీళ్లు దొరికేవి కావు.. సరిపోయేన్ని నీళ్లు లేక పంటలు ఎండేవి. మీరచ్చినంక లిఫ్ట్ మొదలైంది. గోదారి నుంచి మా ఊరి దాకా పైప్‌లైన్ వేసి మా చెరువు నింపుతున్రు. ఇంటింటికీ నల్లా నీళ్లు అస్తున్నయ్. ఇప్పడు మూడు పంటలు పండించుకునేటంత నీరున్నది. వరి, పత్తి, పసుపు, సీజనల్ కూరగాయలు, దోసకాయ, మక్క పంటలు వేస్తూ దర్జాగా దొరలెక్క బతుకుతున్నం.” అంటూ మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో ఓ మహిళ తన సంతోషాన్ని పంచుకున్నది. సోమవారం ధర్మపురి మండలం రాయపట్నం కూడలి వద్ద మంత్రి ఈశ్వర్ మక్క కంకులు విక్రయించే మహిళా రైతు వద్దకు వెళ్లి కంకులు కొని చేసి కాసేపు మాట్లాడారు. దీంతో ఆ మహిళా రైతు ఎంతో సంతోషంతో మక్కజొన్న కంకిని మంత్రి చేతికి అందిస్తూ తన సంతోషాన్ని పంచుకున్నది.