కలెక్టరేట్, జూన్ 20 : ప్రజావాణిలో వస్తున్న ఫిర్యాదులు ప్రాధాన్యతతో పరిష్కరించాలని జడ్పీ సీఈవో ప్రియాంక సూచించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో వివిధ సమస్యలపై ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ 323 దరఖాస్తులు రాగా వాటిని ఆయా విభాగాలకు చెందిన అధికారులకు పంపినట్లు వెల్లడించారు. ఇందులో ఎస్సీ కార్పొరేషన్‌కు 175, రెవెన్యూ విభాగానికి 86, పంచాయితీ శాఖకు 10, మున్సిపల్ శాఖలో సమస్యలపై 13 దరఖాస్తులు రాగా, మిగతా 39 ఇతర విభాగాలకు సంబంధించినవి ఉన్నట్లు పేర్కొన్నారు.
కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో లక్ష్మారెడ్డి, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డా.జువేరియా, జిల్లా సంక్షేమాధికారి వీ పద్మావతి, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి నతానియేలు, డీవైఎస్వో రాజవీరు, మెప్మా పీడీ రవీందర్, వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి రాజ మనోహర్‌రావు, ఉద్యానవన శాఖ డీడీ శ్రీనివాస్, ల్యాండ్ సర్వే ఏడీ అశోక్‌కుమార్, సీపీవో కొమురయ్య, జిల్లా గిరిజన అభివృద్ధ్ది అధికారి గంగారాం, ఎల్డీఎం ఆంజనేయులు, డిప్యూటీ తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.
రాజీవ్ గృహకల్ప లబ్ధిదారులకు సూచించిన నిబంధనలు కఠినంగా అమలు చేయాలంటూ లబ్ధిదారుడు లింగంపల్లి షాజా సోమవారం ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. గృహకల్ప నిబంధనలకు విరుద్ధంగా ప్లాట్లు విక్రయిస్తున్నారని ఫిర్యాదు చేశారు. సత్వరమే తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
కరీంనగర్ రూరల్, జూన్ 20: బొమ్మకల్ వాగు నుంచి ఇసుక సరఫరాకు అనుమతించాలని కోరుతూ ప్రజావాణిలో బొమ్మకల్ గ్రామానికి చెందిన గోష్కి శంకర్ వినతి పత్రం అందజేశారు. గ్రామంలోని ట్రాక్టర్ల యజమానులకు ఎలాంటి పనులు లేకపోవడంతో ట్రాక్టర్ ఫైనాన్స్ చెల్లించడం ఇబ్బందిగా మారిందన్నారు. ప్రభుత్వం గ్రామంలో ఇసుక రవాణా చేసేందుకు అనుమతించాలని కోరారు.