పెగడపల్లి, జూన్ 20: ప్రైవేటుకు దీటుగా ప్రభు త్వ పాఠశాలలను పూర్తి స్థాయిలో బలోపేతం చేసేందుకే సీఎం కేసీఆర్ మన ఊరు మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, ఇది దేశంలోనే వినూత్న కార్యక్రమం అని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మన ఊరు మన బడిలో భాగంగా రూ.10 లక్షలతో నిర్మించే ప్రాథమిక పాఠశాల భవన నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.
పాఠశాల విద్యార్థులకు పలకలు, నోట్ పుస్తకాలు అందజేయడంతో పాటు, వారికి అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలను ప్రక్షాళన చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు, పాఠశాలల్లో ఆహ్లాదకర వాతావరణం కల్పించేందుకు సీఎం కేసీఆర్ మన ఊరు మన బడి కార్యక్రమాన్ని ప్రారంభించారని, మొదటి విడుతలో 35 శాతం బడులను ఇందులో చేర్చినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇందులో ఎంపిక చేసిన పాఠశాలల అభివృద్ధికి రూ.7229 కోట్ల నిధులను కేటాయించారని వివరించారు.
రాష్ట్రంలో ఉన్న సుమారు 1000 గురుకుల పాఠశాలలు దేశంలోనే ఆదర్శంగా నిలిచాయని, వాటికి దీటుగా పాఠశాలలను తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమ ఉద్దేశమని తెలిపారు. ఇందులో చదువుకునే విద్యార్థులకు నాణ్యతతో కూడిన విద్యను అందించడంతో పాటు, వారిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. మన ఊరు మన బడిలో మండలంలో 13 పాఠశాలలను ఎంపిక చేయడంతో పాటు వీటి అభివృద్ధికి రూ.2 కోట్ల 50 లక్షల నిధులు మంజూరు చేశామని, ఇక్కడి జడ్పీ పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణం కోసం రూ.70 లక్షల నిధులు మంజూరు చేయగా, పనులు చివరి దశకు చేరుకున్నట్లు మంత్రి తెలిపారు.
కార్యక్రమంలో జడ్పీటీసీ కాసుగంటి రాజేందర్రావు, సర్పంచ్ మేర్గు శ్రీనివాస్, ఎంపీటీసీ బొమ్మెన జమున-స్వామి, ఏఎంసీ చైర్మన్ నగావత్ తిరుపతినాయక్, నంచర్ల విండో చైర్మన్ మంత్రి వేణుగోపాల్, ఎస్ఎంసీ చైర్మన్ చిలుక నర్సయ్య, తహసీల్దార్ కృష్ణచైతన్య, ఎంపీడీవో పుల్లయ్య, ఎంపీవో మహేందర్, ఎంఈవో శ్రీనివాస్, ఆర్అండ్బీ ఏఈ ఆదిత్య, హెచ్ఎంలు మధుసూదన్‌రెడ్డి, లచ్చయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు లోక మల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శి బండి వెంకన్న, పార్టీ నాయకులు గోళి సురేందర్‌రెడ్డి, మాదారపు కరుణాకర్‌రావు, తోట మోహన్‌రెడ్డి, సాగి శ్రీనివాసరావు, పెద్ది రమేశ్, తోడేటి లోకేశ్, తడ్కమడ్ల శ్రీనివాస్‌రెడ్డి, బోగ లక్ష్మీనారాయణ, నర్సింహారెడ్డి, సంజీవరెడ్డి, సత్యనారాయణరెడ్డి, విజయ్‌యాదవ్, శ్రీనివాస్, చంద్రారెడ్డి, కనకయ్య, ఉప సర్పంచ్ సాగర్‌రావు, సర్పంచులు రాజేశ్వర్‌రావు, లక్ష్మణ్, రాకేశ్, ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
వెల్గటూర్, జూన్ 20: గుల్లకోటలో జనం కోసం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు లింగంపల్లి చందు ఆధ్వర్యంలో గురుకుల పాఠశాలలో 2022 విద్యా సంవత్సరంలో 5వ తరగతిలో 27 మంది విద్యార్థులు అర్హత సాధించారు. వారిని సోమవారం మంత్రి కొప్పుల ఈశ్వర్ కరీంనగర్‌లోని తన క్యాంపు కార్యాలయంలో అభినందించారు. చందు రెండు సంవత్సరాలుగా విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇస్తున్నారు.
కాగా ఇప్పటి వరకు సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన 71 మంది విద్యార్థులు గురుకులకు అర్హత సాధించారు. చందు వృత్తిరీత్యా ప్రభుత్వ ఉపాధ్యాయుడు. తన గ్రామంలోని పేద విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ పొందిన విద్యార్థులు గురుకులాల్లో ప్రవేశానికి అర్హత సాధించడంతో మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను చందును అభినందించారు. ఇక్కడ పలువురు నాయకులున్నారు.