కొత్తపల్లి, జూన్ 20 : ఉరుకుల పరుగుల జీవితం.. పని ఒత్తిడి. మారిన ఆహారపు అలవాట్లు, జీవన విధానంలో మార్పులు మనిషిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మనుషులు మానసిక, శారీరక రుగ్మతల బారిన పడుతున్నారు. వీటిని నిర్లక్ష్యం చేయడం ద్వారా విపరీత పరిణామాలకు దారితీసిన ఉదాంతాలు ఎన్నో ఉన్నాయి. కొన్నిసార్లు నేరాలు, ఆత్మహత్యలకు సైతం పురి గొల్పుతున్న దాఖలాలున్నాయి. ఆధునిక వైద్యం చూపని అనేక సమస్యలకు పరిష్కారం చూపే మహాత్తు ప్రాచీన భారతీయ యోగాకు ఉన్నది.
ఒకప్పుడు రుషులు, యోగులకు మాత్రమే పరిమితం కాగా ప్రస్తుతం మారుమూల పల్లెలకు విస్తరించింది. సనాతన భారతదేశంలో పుట్టిన శాస్ర్తాల్లో యోగా ఒకటి. యోగా అనే పదం యూజ్ అనే సంస్కృత ధాతువు నుంచి వచ్చింది. యోగా అంటే అదృష్టం. కూడిక, మానసిక శుద్ధ్ది, శారీరక ధారుడ్య, రోగ నిరోధక శక్తి పెంపునకు ఉపయోగపడుతుంది. శరీరాన్ని, మనసును అదుపులో ఉంచుతుంది. అష్టాంగ యోగాను పతంజలి పొందుపరిచారు.
ప్రధాని మోదీ సూచన మేరకు 2014 డిసెంబర్ 11న ఐక్యరాజ్యసమితి సాధారణ సభ్య సమావేశంలో ఏటా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది. ఇది భారతదేశానికి దక్కిన గొప్ప గౌరవం. ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా వైరస్ (కొవిడ్-19)ను అడ్డుకునేందుకు సైతం ఉపయోగపడుతుందని యోగాచార్యులు పేర్కొంటున్నారు.
వేకువజామున ఉదయం ప్రసరించే సూర్యరశ్మిలో యోగా సాధన శ్రేయస్కరం. వీలుకానప్పుడు సంధ్యా సమయం కూడా అనుకూలమే.కాలకృత్యాలు, స్నానం తరువాత యోగా మంచిది. అలానే స్నానం చేయక ముందూ చేయవచ్చు. గాలి వెలుతురు వచ్చే ప్రదేశాల్లోను, కిటికీలు, తలుపులు తెరిచి ఉన్న గదుల్లో సమతలంగా ఉన్న చోట యోగా చేయడం మంచిది. నేల గచ్చు, బండలపై యోగా చేయకూడదు. తివాచీ లేదంటే కంబళి, పరిశుభ్రమైన వస్త్రం పరిచి దానిపై కూర్చొని చేయాలి.ధరించే వస్ర్తాలు వదులుగా, సౌకర్యంగా ఉండాలి.తొందరపడకుండా, అలసట లేకుండా తాపీగా చేయాలి. ఇబ్బందిగా అనిపిస్తే కొద్దిసేపు శవాసనంతో విశ్రాంతి తీసుకోవాలి. యోగా సాధనకు ముందు పసుపు, తేనె, వేప వంటివి తీసుకోవడమూ మంచిది.వేప, పసుపుని గోరు వెచ్చని నీటిలో కొంచెం తేనెతో కలుపుకొని తాగవచ్చు. ఇది కణాలను శుద్ధి చేస్తుంది. సాధన చేస్తున్నప్పుడు కండరాల వ్యాకోచత్వం మెరగవుతుంది.
ఆసనాలకు ముందు కొంచెం తేనే కలిపిన గోరువెచ్చని నీళ్లు తాగితే జీర్ణ వ్యవస్థ మెరగవుతుంది.
ప్రాచీన యోగాకు 5వేల సంవత్సరాల చరిత్ర ఉంది. పతంజలి మహార్షి ప్రాచీన యోగాపై విస్తృత అధ్యయనం చేసి పలు కొత్త విషయాలను ఆవిష్కరించారు. యోగాతో మనో, శరీర సంబంధమైన వ్యాధులను పూర్తిగా నయం చేయవచ్చు. యోగాలో 86 లక్షల ఆసనాలను వేయవచ్చు. 8 నుంచి 100 సంవత్సరాల వయస్సు గల వారు యోగాను చేయవచ్చు. మనస్సు, శరీరం కలిసుంటే వ్యాధులు దరిచేరవు. ప్రతిరోజూ యోగా చేయడం ద్వారా వ్యాధులు దరిచేరవు.
– నాగిరెడ్డి సిద్దారెడ్డి, యోగా అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి
కరోనా వైరస్ ప్రధానంగా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిపై పెను ప్రభావం చూపుతుంది. సరియైన పౌష్టికాహారం తీసుకుంటూ కొన్ని యోగా ప్రక్రియల్ని ప్రతి రోజు సాధన చేయడం వల్ల కరోరా వైరస్‌ను అడ్డుకోవడంతో పాటు వాటిని నిర్వీర్యం అవకాశం ఉంది. వైరస్ ప్రధానంగా కనుకొలుకులు, ముక్కు, నోరు ద్వారా దేహంలోకి ప్రవేశిస్తుంది. ఈ భాగాలను శుద్ధి చేయడం ద్వారా ఊపిరితిత్తులు, శ్వాస కోశ నాళాలు పటిష్టంగా మారి వైరస్ రాకుండా అడ్డుకోవచ్చు.
– మల్లీశ్వరి, జాతీయ యోగా క్రీడాకారిణీ
యోగా ఆరోగ్య ప్రధాయిని. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు పరిష్కారం చూపే వరదాయిని. నిత్య సాధకులకు దివ్య ఔషదం ఇంతటి ప్రాధాన్యమున్న యోగా విద్యపై రోజు రోజుకు అవగాహన పెరుగుతుంది. ప్రస్తుతం బాలుడి నుంచి వృద్ధుడి వరకు యోగా నేర్చుకొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఒకప్పటితో పోల్చితే సాధన చేసే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఇది వరకే క్రీడా కోటలో యోగాను చేర్చారు. ఆలిండియా యూనివర్సిటీ పోటీల్లో యోగా క్రీడాంశంగా ఉంది. తాజాగా యోగాను కేంద్ర క్రీడ మంత్రిత్వశాఖ క్రీడగా గుర్తించడంతో రాబోయే తరాలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగనున్నాయి.
– ఉదయ్‌కిరణ్, జాతీయ స్థాయి యోగా క్రీడాకారుడు