హుజూరాబాద్ టౌన్, జూన్ 20: బడిబాటలో భాగంగా పెరిగిన విద్యార్థులతో ప్రభుత్వ పాఠశాలలు కళకళలాడాయి. ఈ ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా సోమవారం సరస్వతీ పూజ, సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాలు జరిగాయి. కొత్తగా చేరిన చిన్నారులతో ఉపాధ్యాయులు అక్షరాలు దిద్దించి, ఆశీర్వదించారు. హుజూరాబాద్ మున్సిపల్ పరిధిలోని ప్రతాప్వాడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు రాజశ్రీ, ఉపాధ్యక్షురాలు సునీత, 8వ వార్డు పరిధి కేసీక్యాంప్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో వార్డు కౌన్సిలర్ బొరగాల శివకుమార్, విద్యా కమిటీ చైర్మన్, ఎస్ఎంసీ సభ్యులు, చిన్నారులతో అక్షరాలు దిద్దించారు. కార్యక్రమంలో కేసీక్యాంపు పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు రావుల రమేశ్, ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
వీణవంక, జూన్ 20: మండల కేంద్రంతో పాటు మండలంలోని ఆయా గ్రామాల్లో సోమవారం పాఠశాలల్లో నూతనంగా చేరిన విద్యార్థులకు ఉపాధ్యాయులు అక్షరాభ్యాసం చేయించారు. మండల కేంద్రంలో స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు పులి అశోక్‌రెడ్డి ప్రాథమిక పాఠశాలలో నూతనంగా చేరిన విద్యార్థినీవిద్యార్థులతో అక్షరాలు దిద్దించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఒత్తిడిలేని, ఆట పాటలతో కూడిన నాణ్యమైన బోధన కొనసాగుతున్నదని, తద్వారా పిల్లల్లో మనోవికాసం పెంపొందుతుందని పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సంతానపురి నాగిరెడ్డి, కుమార్, శ్రీనివాస్, కంప్యూటర్ ఆపరేటర్ రవి తదితరులు పాల్గొన్నారు.
జమ్మికుంట రూరల్, జూన్ 20: మండలంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. కోరపల్లి ప్రాథమిక పాఠశాలలో హెచ్ఎం రాజిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన అక్షరాభ్యాస కార్యక్రమంలో భాగంగా ముందుగా సరస్వతీమాతకు ప్రత్యేక పూజలు చేశారు. పిల్లలతో అక్షరాలు దిద్దించారు.
ఈ సందర్భంగా హెచ్ఎం మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం బడిబాట కార్యక్రమంలో భాగంగా సర్కార్ బడుల్లో అన్ని వసతులు కల్పిస్తున్నదని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. ఇక్కడ ఉపాధ్యాయులు సీహెచ్ బాబయ్య, బాలరాం, శ్రీధర్, సీఆర్పీ గుర్రుప్ప, అంగన్వాడీ టీచర్లు రమా, భాగ్యరేఖ పాల్గొన్నారు.