‘గుర్తు తెలియని వాహనం ఢీ. ఒకరు మృతి’ ఈ వార్తలు మనం తరచూగా చూస్తూనే ఉంటాం. ఢీకొట్టింది ఏం వాహనమో..? ప్రమాదానికి కారకుడెవరో తెలియదు. కేసు దర్యాప్తు చేసినా ఒక్కోసారి నెలలైనా తేలదు. కానీ, హుజూరాబాద్ ఎస్ఐ ఆసిఫ్ మాత్రం కేసును ఛేదించేదాకా వదిలిపెట్టలేదు. ప్రమాదం జరిగిన స్థలం నుంచి ఒక్కో సీసీ కెమెరాను పరిశీలిస్తూ.. 80 కిలోమీటర్ల వరకు వెళ్లడమే కాదు, దాదాపు 15 గ్రామాల పరిధిలో ఉన్న సీసీ ఫుటేజీలను పరిశీలించి.. లారీని, నిందితున్ని కనిపెట్టేదాకా విడిచిపెట్టలేదు.
హుజూరాబాద్ రూరల్, జూన్ 20: హుజూరాబాద్ పట్టణానికి చెందిన భగీరథ అనే యువకుడిని ఈ నెల16న అర్ధరాత్రి హుజూరాబాద్-జమ్మికుంట ప్రధాన రహదారిపై ఉన్న రంగాపూర్ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ఘటనలో భగీరథ అక్కడికక్కడే మృతి చెందాడు. ఢీకొట్టిన వాహనాన్ని కనిపెట్టి అదుపులోకి తీసుకోవాలని టౌన్ సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎస్ఐ ఆసిఫ్‌కు కేసును అప్పగించి విచారణ చేపట్టారు. ప్రమాదం జరిగిన సమయంలో కొందరు స్థానికులు ఓ భారీ వెళ్లినట్లు చెప్పడంతో.. దాని ఆధారంగా ఎస్ఐ ఆసిఫ్ శోధించడం మొదలు పెట్టారు.
ఈ నెల 18వ తేదీన మధ్యాహ్నం రంగంలోకి దిగారు. హుజూరాబాద్ నుంచి జమ్మికుంట వెళ్లే దారిలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. 16న రాత్రి 11 గంటల నుంచి ఒంటి గంట వరకు పరిశీలించగా.. ఆ సమయంలో కేవలం ఒక్క లారీ (టీఎస్ యూబీ 1703) మాత్రమే వెళ్లినట్లు గుర్తించారు. అది కూడా యాక్సిడెంట్ జరిగిన సమమయంలోనే వెళ్లినట్లు ఫుటేజీల్లో చూశారు. ఆ వాహనం నంబ ర్ నోట్ చేసుకున్నారు. అది ఎక్కడికి వెళ్లిందో పట్టుకునేందుకు అన్వేషించారు.
హుజూరాబాద్ నుంచి మొదలు.. ఒక్కో సీసీ కెమెరా పరిశీలిస్తూ జమ్మికుంట మీదుగా పెద్దపల్లి వరకు వెళ్లారు. దాదాపు 80 కిలోమీటర్ల మేర ఉన్న సుమారు 15కుపైగా గ్రామాల పరిధిలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. చివరగా పెద్దపల్లిలోని మంథని ఫ్లై ఓవర్ సమీపంలో వాహనం ఉన్నట్లు కనిపెట్టారు. ఆదివారం రాత్రి పోలీస్ సిబ్బందితో ఎస్ఐ అక్కడకు వెళ్లి లారీని స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. మొత్తంగా 18గంటల పాటు శోధించి.. శ్రమించి లారీని పట్టుకోవడంతో ఎస్ఐ ఆసిఫ్‌ను ఉన్నతాధికారులు అభినందించారు.