మల్యాల, మే 23: కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో సోమవారం హనుమాన్ పెద్ద జయంతి వేడుకలకు అంకురార్పణ జరిగింది. మూడు రోజుల పాటు నిర్వహించే వేడుకలను అర్చకులు, వేద పండితులు సోమవారం అట్టహాసంగా ప్రారంభించారు. ఆదివారమే అర్చకులు శాస్ర్తోక్తంగా ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. తొలిరోజైన సోమవారం స్వామివారి మూల విరాట్టుకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భద్రాచలం శ్రీ సీతారాచంద్రస్వామి ఆలయ బాధ్యులు స్వామివారికి పట్టువస్ర్తాలు సమర్పించారు. ప్రభుత్వం తరఫున చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ దంపతులు పట్టువస్ర్తాలు అందజేశారు.
భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం నుంచి కొండగట్టు హనుమాన్ సన్నిధికి నూతన పట్టు వస్ర్తాలను భద్రాద్రి ఆలయ అర్చకులు రామభద్రాచార్యులు, పర్యవేక్షకుడు కిశోర్ సోమవారం తీసుకొచ్చారు. వీరికి అర్చకులు, ఆ లయ అధికారులు, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయ సాంస్కృతిక ఇన్చార్జి కలకోట శ్రీనివాసాచారి ఆధ్వర్యంలో కళాకారుల కోలాట ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కొండగట్టు వై జంక్షన్ నుంచి ఆలయం వరకు చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ దంపతులు పట్టువస్ర్తాలను తీసుకురాగా, డప్పుచప్పుళ్లు, కోలాటాలు, ఒగ్గు డోలు విన్యాసాలు, శివసత్తుల పూనకాల నడుమ ఎదుర్కొన్నారు. గడ్డం వెంకట్రాజం బృందం ఆధ్వర్యంలో చిందు కళాకారులు వివిధ వేషధారణలతో అలరించగా, కచ్చు అంజయ్య నేతృత్వంలో ఒగ్గు డోలు బృందం విన్యాసాలు ఆకట్టుకున్నాయి. చిరంజీవి ఆధ్వర్యంలో కోలాట ప్రదర్శన నిర్వహించారు. సంగెం రాధాకృష్ణ ఆధ్వర్యంలో మహిళలు నెత్తిన బోనాలతో చేసిన కోలాట ప్రదర్శన ఆహుతులను కట్టిపడేసింది. డప్పు కళాకారులకు సంజీవ్ సారథ్యం వహించారు. సాంస్కృతిక కళా బృందాలను కేబీ శర్మ, జగదీశ్వర్‌శర్మ పర్యవేక్షించారు.
కొండగట్టు ఆలయానికి పట్టువస్ర్తాలు తీసుకొచ్చిన భద్రాద్రి దేవస్థానం అర్చకుడు రామభద్రాచార్యులు, ఆలయ పర్యవేక్షకుడు కిశోర్‌ను కొండగట్టు ఆలయ అర్చకులు స్వామివారిని దర్శింపజేశారు. అనంతరం వారిని ఘనంగా సన్మానించారు. ఆలయ ఈవో టంకశాల వెంకటేశం, పాలక మండలి చైర్మన్ తిరుక్కోవెల మారుతీస్వామి, ఏఈవో బుద్ది శ్రీనివాస్, స్థానాయార్యుడు కపీందర్, ప్రధానార్చకులు రామకృష్ణ, జితేంద్రప్రసాద్, వకుళాభరణం రఘు, ఉప ప్రధానార్చకులు చిరంజీవి, పర్యవేక్షకులు శ్రీనివాస శర్మ, సునీల్, టెంపుల్ ఇన్స్పెక్టర్లు రాజేశ్వర్‌రావు, సంపత్, వేదపండితులు రాజేశ్వర్‌రావు, పెద్దన్నశర్మ తదితరులు పాల్గొన్నారు.
హనుమాన్ పెద్దజయంతికి దీక్షాపరులు రాష్ట్ర నలుమూలల నుంచి తరలివస్తున్నారు. కాలినడకన వచ్చిన భక్తులు కొండగుట్టు గుట్ట కింది నుండి ఘాట్ రోడ్డు, పురాతన మెట్ల దారి ద్వారా కాలినడకన ఆలయానికి చేరుకుంటున్నారు. ఉత్సవాల తొలి రోజే మాల విరమణ మండపాన్ని తెరిచారు. కాగా, ఉత్సవాల నేపథ్యంలో జగిత్యాల డీఎస్పీ ప్రకాశ్, సీఐ రమణమూర్తి ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఉత్సవాలకు తరలివచ్చే హనుమాన్ దీక్షాపరుల స్నానాలు, ఇతర అవసరాల కోసం కొండపైన గల నూతన పుష్కరిణిలో గల కోనేరును మిషన్ భగీరథ జలాలతో నింపా రు. కొండకింద సంపు, కొండపైన గల రెండు వాటర్ ట్యాంకు ల్లో 15 లక్షల లీటర్ల నీటిని అందుబాటులో ఉంచారు. ఆలయ ఏఈఈ లక్ష్మణ్‌రావు ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఎలక్ట్రిసిటీ, వాటర్ పంపింగ్ పనులను పర్యవేక్షిస్తున్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ రామ్మోహన్రావు, స్థానిక సర్పంచ్ బద్దం తిరుపతిరెడ్డి, మల్యాల సర్పంచ్ సుదర్శన్, టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు జనగాం శ్రీనివాస్ పలు సూచనలు చేస్తూ పనుల్లో మునిగి తేలుతున్నారు.