కలెక్టరేట్, మే 23: రాజన్న క్షేత్ర అభివృద్ధికి ‘వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ’ మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేసిందని వీటీడీఏ వైస్ చైర్మన్ పురుషోత్తంరెడ్డి పేర్కొన్నారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా జీఐఎస్ ఆధారిత మాస్టర్ ప్లాన్‌ను రూపొందించినట్లు వివరించారు. సోమవారం వీటీడీఏ మాస్టర్ ప్లాన్ ముసాయిదాపై జిల్లా అదనపు కలెక్టర్ బీ సత్యప్రసాద్, వీటీడీఏ పరిధిలోని ప్రజాప్రతినిధులు, అధికారులతో కలెక్టరేట్లోని ఐడీవోసీ కాన్ఫరెన్స్ హాల్లో తొలి సమావేశం నిర్వహించి చర్చించారు.
అనంతరం మాట్లాడారు. వేములవాడ పట్టణంతో సహా 6 విలీన గ్రామాలు, ఏడు ఆర్అండ్ఆర్ గ్రామాలను కలుపుకుని మాస్టర్‌ప్లాన్‌ను సిద్ధం చేశామన్నారు. మాస్టర్ ప్లాన్ అనేది వీటీడీఏ అభివృద్ధికి కీలకమైనదని, లైన్ డిపార్ట్మెంట్లు, ఎన్జీవోలు, ప్రజాప్రతినిధులు, ప్రజల అభిప్రాయాలను క్రోడీకరించి వచ్చే 40 ఏండ్ల ప్రజా అవసరాలు, అభివృద్ధితోపాటు పలు రకాల అంశాలను పొందుపరిచినట్లు వెల్లడించారు.
దీనిపై అన్నివర్గాల అభిప్రాయం మేరకు సమావేశం నిర్వహిస్తున్నామని, ఇక్కడ చర్చకు వచ్చే సూచనలు, సలహాలు, అభ్యంతరాలపై మరోసారి సమీక్షించి ఫైనల్ చేస్తామని చెప్పారు. అదనపు కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మాస్టర్‌ప్లాన్‌ను సిద్ధం చేశామని, అభ్యంతరాలు, సలహాలు, సూచనలు ఉంటే లిఖితపూర్వకంగా ఇవ్వాలన్నారు. కాగా, మాస్టర్‌ప్లాన్‌ను తమకు అర్థం అయ్యేలా విడమరిచి చెప్పాలని, వేములవాడ చారిత్రక ప్రత్యేకతను, పర్యావరణ, పురావస్తు అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని పలువురు ప్రజాప్రతినిధులు కోరగా, టౌన్‌ప్లానింగ్ శాఖ ముఖ్య ప్రణాళిక అధికారి చంద్రిక పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఇక్కడ వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ మాధవి, టౌన్‌ప్లానింగ్ డీడీ జగన్మోహన్, ఎంపీపీ బీ వజ్రమ్మ, జడ్పీటీసీ మ్యాకల రవి, అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.