మామిడి ధర ఎగబాకుతున్నది. టన్నుకు రూ.70వేలపైనే పలుకుతున్నది. ఈ యేడు తగ్గిన దిగుబడులతో భారీగా డిమాండ్ ఏర్పడడం, సరఫరా అంతగా లేకపోవడంతో కరీంనగర్ జిల్లా కేంద్రంగా వ్యాపారం జోరుగా జరుగుతున్నది. ఇక్కడి నుంచే వివిధ రాష్ర్టాలకు ఎగుమతి జరుగుతుండగా, దళారుల బెడద లేకుండా అండగా నగరంలోని పండ్ల మార్కెట్ అండగా నిలుస్తున్నది.
– ముకరంపుర, ఏప్రిల్ 15
కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ యార్డులోని పండ్ల మార్కెట్ మామిడి రైతులకు అండగా నిలుస్తున్నది. సుమారు ఐదెకరాల్లో అన్ని వసతులతో ఏర్పాటు చేసిన ఈ విఫణికే జిల్లాలోని పలు మండలాలకు చెందిన రైతులు మామిడి దిగుబడిని తీసుకువచ్చి విక్రయిస్త్తున్నారు. గతంలో రైతులు తమ తోటల వద్దే దళారులకు తక్కువ ధరకు విక్రయిస్తూ నష్టపోవాల్సిన దుస్థితి ఉండేది. అయితే జిల్లా కేంద్రంలోనే పూర్తి స్థాయిలో పండ్ల మార్కెట్ అందుబాటులోకి రావడంతో దళారుల బెడద తప్పింది. రైతులు తమకు నచ్చిన ధరకు విక్రయించుకునే వెసులుబాటు ఏర్పడింది.
జిల్లాలో 7వేల ఎకరాల్లో తోటలు విస్తరించి ఉండగా, గతేడాదితో పోల్చితే ఈ యేడు దిగుబడి అంచనాలు తప్పాయి. అకాల వర్షాలతో పూత సరిగా రాకపోవడం, వచ్చినా నిలువకపోవడం ప్రధాన సమస్యగా మారింది. కాత కూడా అంతంత మాత్రంగానే ఉండడంతో దిగుబడులు భారీగా తగ్గాయని ఉద్యాన శాఖ అధికారులు పేర్కొంటున్నారు. సాధారణంగా మార్చి నుంచే మామిడి కాయలు మార్కెట్కు వస్తుంటాయి. ప్రతికూల వాతావరణ ప్రభావంతో ఈ యేడు సీజన్ నెల రోజులు ఆలస్యమైంది. నేల స్వభావంతో పాటు అనువైన వాతావరణం ఉన్నందున జిల్లాలో సాగయ్యే మామిడి రకాలకు దేశంలోని పలు రాష్ర్టాల్లో మంచి ఆదరణ ఉంది. సరఫరా తగిన విధంగా లేక ధర అమాంతం పెరిగింది. ఇక్కడి నుంచే మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తర్ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఢిల్లీతో పాటు ఇతర రాష్ర్టాలకు పెద్ద ఎత్తున ఎగుమతి అవుతుంది. కరీంనగర్ మార్కెట్కు అంతంత మాత్రంగానే కాయలు వస్తుండగా, వివిధ రాష్ర్టాల నుంచి ఇక్కడి వచ్చిన వ్యాపారులు మామిడి కొనుగోళ్లకు పోటీ పడుతున్నారు. కరీంనగర్ వ్యవసాయ మార్కెట్లోని పండ్ల మార్కెట్లో కాయ నాణ్యత, పరిమాణం ఆధారంగా టన్ను ధర రూ.50వేల నుంచి రూ.70వేలపైనే పలుకుతున్నది. రెండు రోజుల క్రితం వరంగల్లోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు అనుసంధానంగా ఉన్న లక్ష్మీపురం మార్కెట్లో టన్ను మామిడి ధర రికార్డు స్థాయిలో రూ.80 వేలు పలికింది. కాగా, కరీంనగర్ పండ్ల మార్కెట్లో మామిడి వ్యాపారమే ఎక్కువగా జరుగుతుంది. వ్యాపారులు, కొనుగోలు దారులతో సందడి కనిపిస్తున్నది. గతేడాది రూ.5.50కోట్ల మేర మామిడిని రైతుల నుంచి కొనుగోలు చేయగా, మార్కెట్ ఫీజు రూపంలో మార్కెట్ కమిటీకి రూ.5.50లక్షల ఆదాయం సమకూరింది.