కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల దేశంలోని అనేక థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తికి తీవ్ర విఘాతం తలెత్తుతున్నది. దేశంలో బొగ్గు కొరత కారణంగా అనేక విద్యుత్ కేంద్రాలకు ముప్పు ఏర్పడి, ఉత్పత్తి కేంద్రాలను ఆపేయాల్సిన సంకట పరిస్థితి ఏర్పడింది. ఆ పరిస్థితి రాకుండా తెలంగాణ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నది. రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు ప్రధానంగా సింగరేణి సంస్థ నుంచి బొగ్గు సరఫరా జరుగుతున్నది. టీఎస్ జెన్కో సింగరేణి సంస్థలు ఒప్పందం ప్రకారం బొగ్గు సరఫరా చేస్తున్నాయి. బొగ్గు గనులు ఉన్న ప్రాంతాల్లో దాదాపుగా జెన్కోకు సంబంధించిన థర్మల్ విద్యుత్ యూనిట్లు కూడా ఉండడంతో బొగ్గు సరఫరాకు ఆటంకం లేకుండా కొనసాగుతున్నది.
రాష్ర్టానికి విద్యుత్ వెలుగులు అందిస్తున్న టీఎస్ జెన్కోకు చెందిన కేటీపీఎస్ నుంచి ప్రస్తుతం 1800 మెగావాట్ల విద్యుత్ రాష్ట్ర గ్రిడ్‌కు సరఫరా అవుతున్నది. ఆ తర్వాత భూపాలపల్లిలోని కాకతీయ థర్మల్ కేంద్రం నుంచి 1100మెగావాట్లు, రామగుండంలో 60మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్నది. అలాగే మణుగూరులోని బీటీపీఎస్‌లో 1080 మెగావాట్లకు గానూ 800 మెగావాట్ల వరకూ విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్నది. ఆయా కేంద్రాలకు ప్రధానంగా సింగరేణి సంస్థ నుంచి ఒప్పందం చేసుకుని బొగ్గు సరఫరా కొనసాగుతున్నది. కేటీపీఎస్‌లోని 6వ దశ 11వ యూనిట్‌కు సీ గ్రేడ్ బొగ్గును వాడుతుంటారు. ఈ కర్మాగారంలో విద్యుత్ ప్రారంభం సమయంలో(ఉమ్మడి ఆంధ్రప్రదేశ్) ఒడిశాలోని తాలిచేర్, అలాగే ఇతర దేశాల నుంచి ఓడల ద్వారా కృష్ణపట్నం నుంచి సీ గ్రేడ్ బొగ్గును కొనుగోలు చేసేవారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సింగరేణిలోని ఓపెన్ కాస్ట్‌ల్లో లభించే సీ గ్రేడ్ బొగ్గును టీఎస్ జెన్కో ఒప్పందం చేసుకుని కొనుగోలు చేస్తున్నది. దీంతో అప్పటి నుంచి జెన్కో విద్యుత్ కేంద్రాలకు బొగ్గును సింగరేణి బొగ్గును సరఫరా చేస్తున్నది. మిగిలిన అన్ని విద్యుత్ కేంద్రాలకు సంస్థ నుంచే బొగ్గు జరుగుతున్నది. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో కూడా జెన్కో కేంద్రాలకు నిత్యం బొగ్గు సరఫరాలో అంతరాయం లేకుండా సింగరేణి చర్యలు తీసుకుంటున్నది.
కేటీపీఎస్ 5, 6 దశల్లో 1,000 మెగావాట్ల విద్యుదుత్పత్తికి గానూ ప్రస్తుతం వారం రోజులకు సరిపడా 1.40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయి. వెయ్యి మెగావాట్ల విద్యుదుత్పత్తికి (మూడు యూనిట్లు) 14వేల మెట్రిక్ టన్నుల బొగ్గును వాడుతున్నారు. దీనికి సరిపడా సింగరేణి నుంచి రోజుకు మూడు రేకులు 14 నుంచి 16వేల మెట్రిక్ టన్నుల బొగ్గు సరఫరా చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఉన్న 1.40లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వ ఉంది. అలాగే కేటీపీఎస్ ఏడో దశలో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి గానూ 9 వేల మెట్రిక్ టన్నుల బొగ్గును వాడుతున్నారు. ప్రస్తుతం ఈ కర్మాగారంలో 43 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వ ఉంది. రోజువారీగా సింగరేణి నుంచి రెండు, మూడు రేకుల ద్వారా 9 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు వస్తున్నది. ఈ యూనిట్‌కు కూడా ఉత్పత్తికి ఎలాంటి ఆటంకం లేదు.
రష్యా యుద్ధ ప్రభావంతో సింగరేణి సంస్థకు వచ్చే బ్లాస్టింగ్ మెటీరియల్ అందక బొగ్గు ఉత్పత్తికి కొంతమేర ఆటంకం కలిగింది. లేకపోతే టీఎస్ జెన్కో విద్యుత్ కేంద్రాలకు నెలకు సరిపడా పుష్కలంగా బొగ్గు నిల్వలు పేరుకుపోయేవి. ప్రస్తుతం ఆ పరిస్థితి నుంచి సింగరేణి గట్టెక్కి బ్లాస్టింగ్ మెటీరియల్‌ను విదేశాల నుంచి తెప్పించుకుని బొగ్గు ఉత్పత్తి పెంచుకుంటూపోతున్నది.
సత్తుపల్లి ఓపెన్‌కాస్ట్ నుంచి రైల్వే వ్యాగన్ల ద్వారా రుద్రంపూర్‌కు ఈ నెల 17వ తేదీ నుంచి తొలిసారిగా బొగ్గు సరఫరా జరుగనుంది. ఈ రైల్వేలైన్ క్లియర్ అయితే కేటీపీఎస్ కర్మాగారాలకు నేరుగా బొగ్గు సరఫరా కానుంది.
కేటీపీఎస్ థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ప్రస్తుతం బొగ్గు నిల్వలు బాగానే ఉన్నాయి. ఉత్పత్తికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జెన్కో అధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం 5, 6 దశల్లో 1.40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వ ఉంది. రోజూ వారీగా సింగరేణి నుంచి రైల్వే వ్యాగన్ల ద్వారా వచ్చే బొగ్గునే వాడుకుంటూ ఉన్న నిల్వలు అలాగే ఉంచుతున్నాం. యుద్ధం వల్ల సింగరేణిలో ఉత్పత్తి తగ్గింది. దీనివల్ల కేటీపీఎస్‌లో నెలకు సరిపడా నిల్వలు లేకుండాపోయాయి. అయినా కూడా ఉత్పత్తికి ఢోకా లేదు.
– కేటీపీఎస్ 5,6 దశల సీఈ రవీంద్రకుమార్