సీసీసీ నస్పూర్, ఏప్రిల్ 17: కార్మిక కుటుంబాల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం త్వరలో లభించనుంది. శుద్ధజలం నిత్యం సరఫరా కానుంది. ఇందుకు సంబంధించి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 30 ఏండ్ల క్రితం నిర్మించిన గ్రౌండ్ లెవల్ రిజర్వాయర్‌కు కాలం చెల్లింది. ఇది పూర్తిగా శిథిలావస్థకు చేరుకోక ముందే అధికారులు ముందస్తుగా మరో రిజర్వాయర్ నిర్మించారు. కొత్తగా చేపట్టినది అందుబాటులోకి వస్తే సింగరేణి కార్మిక కుటుంబాలకు రానున్న 30 నుంచి 40 ఏండ్ల వరకు గోదావరి నుంచి నీటి సరఫరాకు ఢోకా ఉండదు. శ్రీరాంపూర్ ఏరియాలో గనులు ప్రారంభించిన సమయంలో కార్మిక కుటుంబాలకు గోదావరి నీటిని అందించేందుకు 30 ఏళ్ల క్రితం నస్పూర్‌కాలనీలో సింగరేణి యాజమాన్యం గ్రౌండ్ లెవల్ సర్వీస్ రిజర్వాయర్‌ను నిర్మించింది. గోదావరి గ్రావిటీ నుంచి సీతారాంపల్లి వద్ద ఉన్న ఫిల్టర్‌బెడ్‌కు చేరుకొని అక్కడ ఫిల్టర్ అయిన నీరు నేరుగా నస్పూర్‌కాలనీ రిజర్వాయర్‌కు చేరుకుంటుంది.
ఇక్కడి నుంచి ట్యాంకులకు పంపించి కాలనీలకు తాగునీరు సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సిస్టం సక్రమంగా సాగాలంటే నిరంతరం విద్యుత్ అవసరం. విద్యుత్ సరఫరాలో అంతరాయంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మళ్లీ కరెంట్ వచ్చిన తర్వాత రిజర్వాయర్‌లోకి నీటిని తీసుకు వచ్చి సరఫరా చేసే విధానం ఇంతకాలం కొనసాగింది. ఈ విధానానికి స్వస్తి చెప్పి.. కాలనీలకు నీరు అందించేం దుకు యాజమాన్యం గోదావరి కాలనీ షిర్కేలో 7 లక్షల గ్యాలన్ల నీటి సామర్థ్యం గల గ్రౌండ్ లెవల్ సర్వీస్ రిజర్వాయర్‌ను నిర్మించి శాశ్వత పరిష్కారం చూపింది.
గోదావరి నీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సింగరేణి అధికారులు చర్యలు తీసుకున్నారు. నస్పూర్‌కాలనీ, షిర్కె, సీటైప్ క్వార్టర్లకు నీరు సరఫరా చేయాలంటే రోజుకు 8 లక్షల గ్యాలన్ల నీరు అవసరం. ఇది వరకు నాగార్జునకాలనీ సివిల్ కార్యాలయం వద్ద 2లక్షల గ్యాలన్ల సామర్థ్యం గల ఓవర్‌హెడ్ ట్యాంక్ అందుబాటులో ఉంది. నస్పూర్‌కాలనీలో 60 వేల గ్యాలన్ల సామర్థ్యం గల రెండు ట్యాంకులు అందుబాటులో ఉన్నాయి. వీటికి తోడుగా నీటి సరఫరా శాశ్వత పరిష్కారానికి గోదావరికాలనీ(షిర్కే)లో 7 లక్షల గ్యాలన్ల నీటి సామర్థ్యం గల గ్రౌండ్ లెవల్ సర్వీస్ రిజర్వాయర్‌ను రూ. 3.50కోట్లతో నిర్మించారు. ఈ రిజర్వాయర్‌లోకి నేరుగా ఒకే రోజు నీరు తెచ్చుకొని నిల్వ చేసుకునే అవకాశం ఉంటుంది. విద్యుత్ అంతరాయం ఉన్నా నీటి సరఫరాలో ఇబ్బందులు ఉండవు ప్రస్తుతం నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. ఈ నెలాఖరులో ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇది అందుబాటులోకి వస్తే నస్పూర్కాలనీతో పాటు గోదావరికాలనీ షిర్కే క్వార్టర్స్‌లోని కార్మిక కుటుంబాలకు తాగు నీటి సమస్య శాశ్వతంగా పరిష్కారంకానుంది.