జగిత్యాల రూరల్, ఆగస్టు 26 : ఉద్యోగాల భర్తీలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలో బీసీ స్టడీ సరిల్‌ను శుక్రవారం పరిశీలించారు. ఉద్యోగార్థులకు స్టడీ మెటీరియల్, రైటింగ్ ప్యాడ్లను మున్సిపల్ చైర్పర్సన్ భోగ శ్రావణితో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇప్పటి వరకు వైద్య శాఖలో 13 వేల ఉద్యోగాలు భర్తీ చేశారని తెలిపారు.
వెయ్యి గురుకులాల ఏర్పాటు ద్వారా ప్రభుత్వ, కాంట్రాక్ట్ పద్ధతిలో దాదాపు 30వేల మందికి ఉద్యోగాలు లభించాయని చెప్పారు. విద్యుత్ శాఖలో 24 వేల మందిని రెగ్యులరైజ్ చేశామన్నారు. 12,600 గ్రామ పంచాయతీల్లో 9 వేల మంది నూతన పంచాయతీ సెక్రటరీలను నియమించినట్లు తెలిపారు. జీపీ కార్యదర్శులకు వేతనాన్ని రూ.15 వేల నుంచి రూ.29 వేలకు పెంచామని, హోమ్ గార్డ్డులకు రూ.18 వేలు చేశామన్నారు. ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ను ఐటీ రంగంలో అగ్రగామిగా మార్చి దాదాపు 12 లక్షల ఉద్యోగాలు కల్పించామని స్పష్టంచేశారు.
ఎస్సీ స్టడీ సరిల్‌ను మంత్రి కొప్పుల ఈశ్వర్ సహకారంతో ఏర్పాటు చేశామన్నారు. బీసీ స్టడీ సరిల్‌ను మంత్రి గంగుల కమలాకర్ సహకారంతో రాష్ట్రంలోనే మొదటగా ఏర్పాటు చేశామని చెప్పారు. విద్యార్థులు దూర ప్రాంతాల నుంచి వస్తారని, వారి కోసం సాయంత్రం స్నాక్స్ కూడా అందించాలని సంబంధిత అధికారులకు సూచించారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, జిల్లా బీసీ సంక్షేమ అధికారి సాయిబాబా, కౌన్సిలర్ ఫోరం జిల్లా అధ్యక్షుడు పాంబాల రామ్ కుమార్, పార్టీ ప్రధాన కార్యదర్శి ఆనంద్ రావు, ఉపాధ్యక్షుడు రాజ్ కుమార్, విద్యార్థి విభాగం నాయకుడు ఆరిఫ్, కౌన్సిలర్లు, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.