ఫర్టిలైజర్‌సిటీ, ఆగస్టు 26 : ఆరోగ్య తెలంగాణే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని, పేదలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యాన్ని అందించాలనే సంకల్పంతో చేసిన ప్రయత్నం ఫలించి కేంద్రం నుంచి అనుమతితో రామగుండం ప్రజలకు సీఎం వైద్య ప్రదాతగా నిలిచారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. గోదావరిఖని ప్రభు త్వ జనరల్ దవాఖానలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. సమైక్య పాలనలో తెలంగాణలోని వైద్య వ్యవస్థను నిర్లక్ష్యం చేశారన్నారు.
కేవలం రెండు మెడికల్ కళాశాలలు ఉండగా.. రాష్ట్రం ఏర్పాటు తర్వాత మరో 8 మంజూరు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు కావాల్సిన మెడికల్ కళాశాలను రామగుండం ప్రజలపై సీఎంకు ఉన్న అభిమానం మేరకు సింగరేణి సహకారంతో ప్రత్యేకంగా మెడికల్ కళాశాలను మంజూరు చేసినట్లు తెలిపారు. ఆరంభం నుంచి పలువురు నాయకులు అడ్డంకులు సృష్టించినప్పటికీ వెనుకడుగు వేయకుండా అంతిమ విజయం సాధించామన్నారు. 150 సీట్లకు అనుమతి లభించగా.. ఈ ఏడాదిలోనే కళాశాలను ప్రారంభిస్తామన్నారు.
అనంతరం కళాశాలకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ నుంచి అనుమతిపై ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేస్తూ కేక్‌కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. సమావేశంలో నగరపాలక మేయర్ డాక్టర్ అనిల్‌కుమార్, డిప్యూటీ మేయర్ అభిషేక్‌రావు, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ హిమబిందు, దవాఖాన డిప్యూటీ సూపరింటెండెంట్ అశోక్, కార్పొరేటర్ బాలరాజ్‌కుమార్, నాయకులు గోలివాడ ప్రసన్నకుమార్, నీలరపు రవి, సట్టు శ్రీనివాస్, కనకం శ్యాంసన్, విజయ్‌కుమార్, సత్తయ్యగౌడ్, వైద్య సిబ్బంది ఉన్నారు.