వజ్రోత్సవం అంబరాన్నంటుతున్నది. 11వ రోజు గురువారం ఫ్రీడం కప్ పేరిట క్రీడా పోటీలు నిర్వహించగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఫుల్‌జోష్ కనిపించింది. ఆయాచోట్ల ప్రధానంగా క్రికెట్, వాలీబాల్, కబడ్డీ పోటీలు ఏర్పాటు చేయగా క్రీడాకారులతోపాటు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని క్రీడాస్ఫూర్తిని చాటారు. తిమ్మాపూర్ ఎల్ఎండీలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, పెద్దపల్లిలో ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, కలెక్టర్ సంగీత సత్యనారాయణ, గంభీరావుపేటలో నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, కరీంనగర్లో కలెక్టర్ కర్ణన్, సీపీ సత్యనారాయణ, జగిత్యాలలో జడ్పీ చైర్పర్సన్ వసంత, కలెక్టర్ రవి, ఎస్పీ సింధూశర్మ, సిరిసిల్లలో జడ్పీ చైర్పర్సన్ అరుణ, కలెక్టర్ అనురాగ్ జయంతి గేమ్స్‌ను ప్రారంభించారు. అనంతరం విజేతలకు బహమతులు ప్రదానం చేసి, వజ్రోత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.
కొత్తపల్లి, ఆగస్టు 18 : వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా గురువారం ఫ్రీడం కప్ పేరిట క్రీడా పోటీలు నిర్వహించారు. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో వాలీబాల్, బాలికల ఖోఖో పోటీలను నిర్వహించగా, దాదాపు 980 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. సాయంత్రం కలెక్టర్ ఆర్వీ కర్ణన్, సీపీ సత్యనారాయణ విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీలోని రాంలీలా మైదానంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో మానకొండూర్ నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలు హోరాహోరీగా సాగాయి.
టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావుతో కలిసి ఎమ్మెల్యే కబడ్డీ, వాలీబాల్ పోటీలను టాస్ వేసి ప్రారంభించారు. విజేత జట్లకు ట్రోఫీలు అందజేశారు. హుజూరాబాద్ మున్సిపల్ ఆధ్వర్యంలో చైర్పర్సన్ గందె రాధిక ఆధ్వర్యంలో బోర్నపల్లి ఎస్సారెస్పీ కెనాల్ పకన క్రీడా మైదానంలో క్రీడా పోటీలు ఉత్కంఠగా సాగాయి. ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, టగ్ ఆఫ్ వార్ పోటీలు, సాయంత్రం కేసీ క్యాంపులో క్రికెట్ టోర్నీ నిర్వహించారు.
కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన జిల్లా స్థాయి క్రీడల్లో శంకరపట్నం కన్నాపూర్ జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన అరిగె విజయ్ లాంగ్ జంప్‌లో ప్రథమ బహుమతి సాధించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జిల్లా స్థాయిలో క్రీడలు హోరాహోరీగా సాగాయి. ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ పాల్గొని, విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.