న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రైవేటీకరణపై వస్తున్న ఊహాగానాల్ని ఆ సంస్థ తోసిపుచ్చింది. ‘భారత అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రో ప్రాధాన్యత తగ్గించటం, భవిష్యత్తులో సంస్థను ప్రైవేటీకరించటం జరుగదని స్పష్టం చేస్తున్నాం’ అని ఇస్రో ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. భారత అంతరిక్ష రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని పెంచాలన్న ప్రభుత్వ ప్రయత్నం, ఇస్రో ప్రాధాన్యతను తగ్గించటం కాదని, సంస్థను ప్రైవేటీకరించటంగా భావించరాదని స్పష్టం చేసింది.
ఈ మార్పు వల్ల ఇస్రో సరికొత్త మిషన్లపై దృష్టి సారిస్తుండగా, పరిశ్రమలు అభివృద్ధి చెందిన వ్యవస్థలను విస్తరించడానికి వీలవుతుందని తెలిపింది. అధునాతన అంతరిక్ష పరిశోధన, సాంకేతిక అభివృద్ధి, వ్యూహాత్మక మిషన్లు, అన్వేషణలో ఇస్రో తన పాత్రను కొనసాగిస్తుందని సంస్థ పేర్కొన్నది. లాంచ్ వెహికల్స్, ఉపగ్రహాలు, ఇతర అంతరిక్ష వ్యవస్థల తయారీలో ప్రైవేట్ కంపెనీల పాత్ర పెంచాలన్న కేంద్రం ప్రణాళికలపై ఇస్రో సైంటిస్టులు, ఇతర ఉద్యోగుల్లో ఆందోళనలు మొదలయ్యాయి.