జిల్లా కేంద్రంలోని పరేడ్ మైదానంలో స్వాతంత్య్ర వజ్రోత్సవాలను సోమవారం ఘనంగా నిర్వహించారు. తమ వృత్తిలో జిల్లాలోని వివిధ శాఖల్లో విశేష సేవలందించిన ఉద్యోగులు, అధికారులతోపాటు విభిన్న రంగాల్లో సేవలందించిన వారిని రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, కలెక్టర్ ఆర్వీ కర్ణన్ సత్కరించారు. ప్రశంసాపత్రాలు అందజేసి అభినందనలు తెలిపారు.
మువ్వన్నెల జెండా మురిసింది.. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో అధికారులు, అధ్యక్షులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జెండాకు వందనం చేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. పాఠశాలల విద్యార్థులు ప్రభాతభేరీ నిర్వహించారు. పట్టణాలతో పాటు గ్రామాల్లో ప్రధాన వీధుల గుండా తిరుగుతూ స్వాతంత్య్ర నినాదాలు చేశారు. ఆనాటి వీరుల త్యాగాలను స్మరించుకున్నారు.