శంకరపట్నం, ఆగస్ట్ 10: తమకు ఉద్యోగాలివ్వాలని కోరుతూ 1998 డీఎస్సీ సాధనా సమితి నాయకులు బుధవారం రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ను కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 98 డీఎస్సీ క్వాలిఫైడ్లకు ఏపీలో ఇచ్చినట్లుగా ఎంటీఎస్ విధానంలో ఉద్యోగాలు ఇచ్చేలా కృషి చేయాలని అభ్యర్థించారు. ఉమ్మడి ఏపీ నోటిఫికేషన్లో డీఎస్సీ రాశామని, అప్పటి ఉన్నతాధికారుల అవినీతి, రెండు జీవోలు వెలువరించడం, ఇంటర్వ్యూలో అక్రమాలతో తాము ఉద్యోగాలకు దూరమయ్యామని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశంలో హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించగా తమకు అనుకూలంగా తీర్పులు వచ్చినట్లు గుర్తు చేశారు. సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూడాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా వినోద్‌కుమార్ స్పందిస్తూ గురువారం జరిగే కేబినెట్ సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చేలా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో మాట్లాడి సీఎం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఇక్కడ 98 డీఎస్సీ సాధనా సమితి జిల్లా నాయకులు ఆకుల శ్రీనివాస్, తుమ్మనపల్లి శ్రీనివాస్, నాగేందర్‌రెడ్డి, వీఎస్ శర్మ, కేశవరావు, నార్ల సంపత్‌కుమార్ ఉన్నారు.