కార్పొరేషన్/కరీంనగర్ రూరల్, జూలై 27: రాష్ట్రంలో అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తున్నదని, అనేక సంక్షేమ పథకాలతో అండగా నిలుస్తున్నదని రాష్ట్ర బీసీ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు.
కరీంనగర్ జిల్లాను కలిసికట్టుగా మరింత అభివృద్ధి చేసుకుందామని, రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలుపుకుందామని పిలుపునిచ్చారు. బుధవారం బొమ్మకల్ గ్రామంలోని యజ్ఞవరాహస్వామి దేవాలయం వద్ద నూతనంగా నిర్మిస్తున్న రాందేవ్‌బాబా సేవా సమితి కమ్యూనిటీ భవనాన్ని మేయర్ వై సునీల్‌రావుతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. భవన నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసుకోవాలని సూచించారు. ఇంకా ఏమైనా డబ్బులు అవసరమైతే సర్దుబాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. భవన నిర్మాణానికి గతంలోనే 10 లక్షలు మం జూరు చేశామని, ఇప్పుడు మరో 15 లక్షలు మంజూరు చేస్తున్నామని చెప్పారు.
అనంతరం యజ్ఞవరాహస్వామి వారిని దర్శించుకొని పూజలు చేశారు. ఇక్కడ సర్పంచ్ పురుమల్ల శ్రీనివాస్, కార్పొరేటర్ వంగళ శ్రీదేవి, వాసాల రమేశ్, పవన్, కోల మాలతి, సంపత్‌రావు, ఎంపీటీసీ ర్యాకం లక్ష్మీ మోహన్, ఉప్పుల శ్రీధర్, ప్రేమ్‌కుమార్ ముందడా, కుల పెద్దలు జవర్మల్ రాజ్ పురోహిత్, సత్తర్ సింగ్ రాజ్‌పుత్, నర్సీరామ్దరి, బాగ్దారామ్ ప్రజాపత్, మహేందర్ తదితరులున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు కింద అందిస్తున్న ప్రోత్సాహంతో దళితులు ఆర్థికంగా మరింత అభివృద్ధి సాధించాలని మంత్రి గంగుల కమలాకర్ సూచించారు. దళితబంధు కింద పొందిన వాహనాన్ని బుధవారం మంత్రి క్యాంపు కార్యాలయం వద్ద ప్రారంభించి, మాట్లాడారు. రాష్ట్రంలోని దళితులు ఆర్థికంగా బలోపేతం చేయాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని తీసుకొచ్చారన్నారు.
ఎక్కడా దళారులకు చోటు లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే డబ్బులు వేస్తున్నామని తెలిపారు. ఈ పథకాన్ని దళితులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మేయర్ సునీల్‌రావు, కార్పొరేటర్ గంట కల్యాణి, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.