సాగు పండుగలా మారిన తెలంగాణ.. అదీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వలస కూలీలకు బతుకు దెరువు చూపుతున్నది. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఉపాధి దొరకని పరిస్థితి ఉండగా, శ్రామికలోకం అక్కడి నుంచి వేలాదిగా తరలివస్తున్నది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర నుంచి వందలాది మంది కూలీలు వచ్చి, ఇక్కడ ఉపాధి పొందుతున్నారు.
ఇప్పటికే వ్యవసాయ పనుల్లో నిమగ్నమై, వరి నాట్లు వేస్తూ బిజీగా ఉన్నారు. చేతినిండా పని.. పనికి తగ్గ కూలి దక్కుతుండడంతో సంబురపడుతున్నారు. రోజుకు 600 దాకా సంపాదిస్తూ భరోసాగా గడుపుతున్నారు. తమ రాష్ర్టాల్లో పని దొరకడం లేదని, కేసీఆర్ సార్ వంటి సీఎం మాకూ ఉంటే బాగుండని, ఇక్కడి ప్రజలు చాలా అదృష్టవంతులని కూలీలు చెబుతున్నారు.
వేములవాడరూరల్/ ఓదెల/ పెగడపల్లి/ సుల్తానాబాద్ రూరల్: బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఉపాధి కరువై.. బతుకు బరువై శ్రామికజనం ఆగమవుతున్నది. తమ పాలనలో ‘అచ్చేదిన్’ అంటూ.. డబుల్ ఇంజిన్ సర్కారుతో బహుళ ప్రయోజనాలు అంటూ.. మన వద్ద ఊకదంపుడు ప్రకటనలు చేస్తున్నప్పటికీ ఆ రాష్ర్టాల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. వ్యవసాయంతోపాటు ఇతర ఎన్నో రంగాలు కుదేలై కూలీలకు పనే లేకుండా పోయింది. తెలంగాణలో మాత్రం రాష్ట్ర సర్కారు కృషితో వ్యవసాయం పండుగలా సాగుతుండడం, అనుబంధ రంగాల్లో చేతి నిండా పని దొరుకుతుండడంతో వేలాది మంది వలస వస్తున్నారు. సీజన్ల వారీగా దుక్కులు దున్ని, నాట్లు వేసే దగ్గరి నుంచి ధాన్యం మోసే పనులు.. పత్తి ఏరడం వరకు అన్ని పనుల్లోనూ వారే కనిపిస్తున్నరు.
రాష్ట్ర సర్కారు చర్యలతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వ్యవసాయం ఊహించని రీతిలో విస్తరించింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, రైతు బంధు కింద పెట్టుబడి సాయం, 24 గంటల కరెంట్ సరఫరా, ఇంకా అనేక ప్రోత్సాహకాలతో వ్యవసాయం పండుగలా మారింది. గతంలో బీళ్లుగా ఉన్న భూములన్నీ సాగులోకి వచ్చాయి. గతంలో కూలీ నాలీ చేసుకున్న జిల్లా వాసులు నీటి వసతి పెరగడంతో వ్యవసాయం చేసుకుంటున్నారు. ఒక పక్క వ్యవసాయం విస్తరించడం, దాని అనుబంధ రంగాలు మళ్లీ ఉనికిలోకిరావడంతో ఉపాధి పుష్కలంగా దొరుకుతున్నది.
బీజేపీ పాలిత రాష్ర్టాల్లో బతుకుదెరువు కరువుకావడంతో కూలీల దృష్టి తెలంగాణపై పడింది. ప్రధానంగా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర సహా బీహార్, పశ్చిమ బెంగాల్ నుంచి వేలాది మంది ఉమ్మడి కరీంనగర్‌కు తరలివస్తూ ఉపాధి పొందుతున్నారు. సీజన్‌కు అనుగుణంగా నాట్లు వేయడం నుంచి కోతలు, మోతల వరకు అన్ని పనులు ఇప్పుడు వలస కూలీలే చేస్తున్నారు. ఆయకట్టు ప్రాంతాల్లోని గ్రామాల్లోనే మకాం వేస్తున్న కూలీలు ప్రతి సీజన్లో రెండు మూడు నెలలు ఇక్కడే ఉంది ఎకరాల చొప్పున గుత్తకు పట్టుకొని నాట్లు వేస్తున్నారు. చేతినిండా పని.. పనికి తగ్గ కూలి ఉండడంతో ఇక్కడే స్థిరపడుతున్నారు. రోజుకు 400 నుంచి 600 దాకా సంపాదిస్తూ సంతోషంగా గడుపుతున్నారు.
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నందగిరికి 20 రోజుల క్రితం మహారాష్ట్రలోని గచ్చిరోలి, చంద్రాపూర్ ప్రాంతాల నుంచి 50 మంది మహిళా, పురుష కూలీలు వచ్చారు. 15 నుంచి 18 మంది చొప్పున మూడు గ్రూపులుగా ఏర్పడి నందగిరి, ఐతుపల్లి, గంగాధర మండలం లక్ష్మీదేవిపల్లి, కోట్ల, బూర్గుపల్లి తదితర గ్రామాల్లో వరి నాట్లు వేస్తూ ఎకరాకు 5వేలు తీసుకుంటున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం లింగంపల్లి గ్రామానికి ఉత్తర ప్రదేశ్‌కు చెందిన 20 మంది కూలీలు తరలివచ్చి, సమీప గ్రామాల్లో నాట్లు వేస్తున్నారు. ఎకరానికి 4800 తీసుకుంటున్నారు.
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలానికి ఉత్తరాఖండ్ నుంచి 60 మంది మగ కూలీలు వచ్చారు. వీరు కొ లనూర్, గుండ్లపల్లి, కనగర్తి, పిట్టల ఎల్లయ్యపల్లె, గో పరపల్లి, హరిపురం గ్రామాల్లో నాట్లు వేస్తూ ఎకరా కు 4700 తీసుకుంటున్నారు. సుల్తానాబాద్ మం డలానికి బిహార్, పశ్చిమబెంగాల్ నుంచి 100 మం ది మగ కూలీలు వచ్చారు. 15 మంది ఒక గ్రూపుగా ఏర్పడి కదంబాపూర్, గట్టేపల్లి, తొగర్రాయి పరిధిలోని జెండాపల్లిలో నాట్లు వేస్తూ ఎకరాకు 4600 తీసుకుంటున్నారు.
తెలంగాణ అంటే నాకు ఇష్టం. ఇక్కడ పుష్కలంగా పని దొరుకుతున్నది. ఇక్కడి సేట్లు చానా మంచోళ్లు. రెండు సంవత్సరాలకు ఒకసారి కూలీలు పెంచుతున్నరు. మాకు పని ఉంటేనే పైసలు వస్తయ్. ఇక్కడ దొరికిన పనులు మా రాష్ట్రంలో దొరకయ్. మాది ఉత్తరప్రదేశ్. అక్కడి నుంచి చాలా మంది తెలంగాణకు వచ్చి పనులు చేసుకుంటున్నరు. పైసలు సంపాయించుకుంటున్నరు. కేసీఆర్ వంటి ముఖ్యమంత్రి మాకు కూడా ఉంటే బాగుండు.
– సురజన్, వలస కూలీ (ఉత్తరప్రదేశ్)
నా పేరు జయంతి మండల్, మాది ఉత్తరాఖండ్. మా దగ్గర పనిలేదు. తెలంగాణల పుష్కలంగా నీళ్లు ఉండి వ్యవసాయం మంచిగా సాగుతుందని, చేతినిండా పని దొరుకుతున్నదని తెలుసుకొని ఇక్కడికి వచ్చినం. సీజన్ల మంచి పనిదొరుకుతున్నది. ఇక్కడ ఆడవాళ్లు నాట్లు వేస్తరు కనీ, మా దగ్గర మగవాళ్లే వేస్తరు. ఆడవాళ్లు ఇంట్లో ఉంటరు. ఆ అనుభవంతోనే ఇక్కడ చకచకా పని పూర్తిచేస్తున్నం. మంచి కూలీ దక్కుతుంది. మాకు ఇంత అన్నం పెడుతుంది తెలంగాణనే.
– జయంతి మండల్, వలస కూలీ (ఉత్తరాఖండ్)
మాది మహారాష్ట్రంలోని చంద్రాపూర్. మా ప్రాంతం నుంచి చాలా మంది ఉపాధి కోసం ఇక్కడికి వలస వస్తున్నారు. ఏటా వానకాలం, యాసంగి సీజన్లలో ఇక్కడ కూలీ పనికి వస్తున్నాం. కుటుంబ సభ్యులం అందరం వచ్చి రెండు నెలల పాటు ఇక్కడే ఉండి వరి నాట్లు వేసి వెళతాం. రైతులు బాగా ఆదరిస్తున్నారు. ఇక్కడ వస్తున్న కూలీతోనే ఏడాది పాటు తిండికి ఇబ్బందులు లేకుండా ఉంటుంది. ఇక్కడ నీళ్లు బాగా ఉండడం వల్ల రైతులు రెండు పంటలు పండిస్తున్నరు. మా దగ్గర ఒక్క పంటకే దిక్కులేదు.
– ప్రకాశ్, వలస కూలీ (చంద్రాపూర్)
మహారాష్ట్ర కూలీలతో వరి నాట్లు త్వరగా పూర్తవుతున్నాయి. మన ప్రాంతంలో కేవలం మహిళలు మాత్రమే వరి నాట్లు వేస్తారు. కానీ అక్కడి కూలీల్లో మగ వారు కూడా వేస్తున్నారు. ఉదయం 6 గంటలకే పొలంలోకి దిగి సాయంత్రం 6గంటల దాకా చేస్తున్నారు. వరి నాట్లు తొందర తొందరగా పూర్తవుతున్నాయి. మహారాష్ట్ర కూలీలు నాలుగేండ్లుగా నందగిరిలోనే ఓ ఇల్లు అద్దెకు తీసుకొని రెండు నెలల పాటు ఇక్కడే ఉంటూ, నాట్లు వేసి తిరిగి తమ గ్రామాలకు తిరిగి వెళ్తున్నరు.
– నారెడ్డి రాజిరెడ్డి, రైతు, నంగదిరి (పెగడపల్లి మండలం)
తెలంగాణల మస్తు పని ఉన్నది. సీఎం కేసీఆర్ సార్ దయ వల్ల నీళ్లు బాగున్నయ్. రైతులు సంతోషంగా ఉన్నరు. మంచిగా ఎవుసం చేసుకుంటున్నరు. మా చంద్రాపూర్ల ఇవన్నీ లేవు. చేద్దామంటే పని లేదు. అందుకే మేం మూడేళ్ల సంది పంటల సీజన్ల జగిత్యాలకు వస్తున్నం. వరినాట్లు గుత్త పట్టుకొని వేస్తున్నం. ఈ సారి 50 మందిమి ఆడోళ్లు, మగోళ్లం వచ్చినం. చేతినిండా పని ఉన్నది. వరి నాట్లు వేస్తున్నం. ఇన్ని పైసలు సంపాదించుకొని పోతం.
– పార్వతి, వలస కూలీ (చంద్రాపూర్)