చాలీచాలని వేతనాలతో బతుకీడుస్తున్న చిరుద్యోగులపై బీజేపీ సర్కారు పన్నుపోటు పొడుస్తున్నది. పన్నుల మీద పన్నులతో చుక్కలు చూపిస్తున్నది. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) బాదుడుతో జ్వరమొస్తే వేసుకునే మందుల నుంచి మొదలు తాగే పాలు, తినే తిండి, వేసుకునే బట్టలు, చెప్పులు..
ఇలా ఎన్నో ధరలు రెట్టింపై, చిరుద్యోగులు బతకడమే కష్టమైపోతున్నది. ముఖ్యంగా ప్రైవేట్ కంపెనీలు, పాఠశాలలు, దుకాణాల్లో పనిచేసే వేతన జీవులను ధరాఘాతం బాధిస్తోంటే, మరో వైపు వరుస పన్నుపోట్లతో పరిస్థితి మరింత దిగజారుతున్నది.
జగిత్యాల/ కరీంనగర్, జూలై 27 (నమస్తే తెలంగాణ): మధ్యతరగతి కుటుంబీకులు, చిరు ఉద్యోగుల జీవితాలపై జీఎస్టీ దరువేస్తున్నది. చిరు ఉద్యోగాలతో బతుకెళ్లదీస్తున్నవారికి కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న జీఎస్టీ పెను భూతంలా మారుతోంది. ఐదేండ్లుగా నిత్యావసర వస్తువులతో పాటు, ఇతర అనేక వస్తుసేవలపై పన్నుల మోత మోగిస్తూనే ఉంది.
ఒకప్పుడు అతి చౌక ధరలలో లభ్యమయ్యే నిత్యావసర వస్తువులు నేడు భారంగా మారిపోయాయి. కొంత ఖరీదైనప్పటికీ గతంలో అందుబాటులో ఉన్న కొన్ని వస్తువులు నేడు చిరు ఉద్యోగులకు అందని ద్రాక్షలా మారాయి. ప్రైవేట్ కంపెనీల్లో, పాఠశాలల్లో, దుకాణాల్లో పనిచేస్తూ జీవితాన్ని గడుపుతున్న ఈ చిరు ఉద్యోగులకు ఒక వైపు ధరాఘాతం బాధిస్తుంటే, మరో వైపు కేంద్ర ప్రభుత్వం వరుస జీఎస్టీ పన్నులతో ఏ క్షణంలో తాము పనిచేసే సంస్థ మూతపడిపోతుందోన్న బెంగ మరో వైపు అతలాకుతలం చేస్తున్నది.
ప్రాణాంతక వ్యాధులను నివారించే మందుల నుంచి మొదలు కొని కాలి చెప్పుల దాకా అన్ని ఉత్పత్తులపై జీఎస్టీ విధిస్తుండడంతో, ఆయా కంపెనీలు, దుకాణాలు, షోరుమ్ల యజమానులు ఆర్థిక భారం నేపథ్యంలో ఏ క్షణంలో తమను ఉద్యోగం నుంచి తీసేస్తారోనన్న తెలియని అయోమయ స్థితిలో కొట్టుమిట్టుడాతున్నామని చిరు ఉద్యోగులు చెబుతున్నారు.
కేంద్రం నిత్యావసర వస్తువుల ధరలు అడ్డగోలు పెంచుతున్నది. జీఎస్టీ పేరిట పేదల కడుపుకొడుతున్నది. నిత్యావసరాలు, కూరగాయలపైనా పన్నుపోటు వేయడం ఎంత వరకు కరెక్టు? కేంద్ర సర్కారు విధానాలతో పేద, మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నయ్. నెలరోజులు కష్టపడి సంపాదించే డబ్బులన్నీ కేవలం ఇంటి సామనుకే సరిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇట్లయితే పిల్లల చదువలెట్ల? మేం బతుకుడెట్ల?
– అనుముల కోటేశ్వర్, కాంట్రాక్టు ఉద్యోగి (మంథని)
జీఎస్టీ అన్ని వర్గాలకు గుదిబండలా మారిపోయింది. ఏ క్షణంలో ఏ వస్తువులపై పన్నులు విధిస్తున్నారో.. మార్పులు చేస్తున్నారో తెలియడం లేదు. ఏ విభాగంలో చూసినా పన్నులు దరువేస్తున్నాయి. దవాఖానకు వెళ్తే బెడ్స్ నుంచి మొదలు కొని మందుల దాకా అన్నింటిపై జీఎస్టీ విధించారు. కాలికి వేసుకునే చెప్పుల ధరలు సైతం చుక్కలనంటుతున్నాయి.
చెప్పులపై 12 శాతం టాక్స్ వేయడం దారుణం. మారిన ప్రస్తుత పరిస్థితుల్లో బ్యాంకింగ్ వ్యవస్థ, చెక్ బుక్స్ అత్యవసరమయ్యాయి. వీటిపై 18 శాతం టాక్స్ వేయడం దారుణం. చివరికి ఇంట్లోని ఎల్ఈడీ బల్బులపై సైతం టాక్స్ పెంచారు. ఇదే సమయంలో చిరుద్యోగాలు చేసుకొని జీవితాలను వెల్లదీస్తున్న మాలాంటి వారి పరిస్థితి భయానకంగా ఉన్నది.
– పొరండ్ల జోతిర్మయి, ప్రైవేట్ స్కూల్ టీచర్ (జగిత్యాల)
ధరలు బాగా పెరిగినయ్. ఏదీ కొనే పరిస్థితి లేదు. పేద, మధ్య తరగతి ప్రజలలకు బతుకు భారమవుతున్నది. మెడిసిన్పైనా కేంద్రం జీఎస్టీ వేసింది. దీంతో రేట్లు పెరిగినయ్. రెగ్యులర్‌గా మందులు వాడే బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ పేషెంట్లు ఇబ్బంది పడుతున్నరు.
ఒక వేళ వీరు మందులు వాడకపోతే ప్రాణాలకే ప్రమాదం. పేషెంట్లలో ఎక్కువగా పేదలు, మధ్యతరగతి వాళ్లే ఉన్నారు. వీరికి మందులు కొనడం భారంగా మారింది. కేంద్రం అడ్డగోలు ధరలపై ప్రజలు మండిపడుతున్నరు.
– కొండ్ర విజయలక్ష్మి, మెడికల్ షాప్ ఉద్యోగి (జగిత్యాల)
రాష్ట్ర సర్కారు మాకు జీతాలు పెంచి ఆందుకుంటే.. కేంద్ర మాత్రం పన్నుల రూపంలో దండుకుంటున్నది. నిరంతరాయంగా ధరలు పెంచుతూ కడుపుకొడుతున్నది. ఇటీవల పాలు, పెరుగు ఇలా అన్నింటిపైనా మరోసారి జీఎస్టీ విధించింది. సామాన్యలు బతుకకుండా చేస్తున్నది.
ప్రభుత్వోద్యోగులుగా నెలవారీ వచ్చే వేతనాలు పన్నులు చెల్లించేందుకే సరిపోతుండగా, ఇక మేం వెనకేసేది ఏమీ లేదు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఉద్యోగాలు చేస్తున్న మాకు ఏ ఆపద వచ్చినా జేబులో చిల్లి గవ్వ కూడా లేకుండా పోతుంది. సామాన్యులపై పన్నుల భారం తగ్గించాలి.
నేను కలెక్టరేట్లో ఔట్‌సోర్సింగ్‌పై కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న. నెలకు 19,500 వేతనం వస్తుంది. అందులో 1800 పాల కొనుగోలుకు, 1,200 సిలిండర్, ఇంటి నుంచి ఆఫీసుకు వచ్చి వెళ్లేందుకు బండి పెట్రోల్‌కు 1,200, ఇంటి అద్దె 6వేలు, కిరాణా సామగ్రి 6వేలు, ప్రస్తుత సీజన్లో హాస్పిటల్‌కు 4వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇలా చూస్తే అన్నీపోనూ నెలకు మరో 700 అప్పు చేయాల్సి వస్తున్నది.
ధరలు ఇట్లా పెంచుతూ పోతే మధ్యతరగతి కుటుంబాల పరిస్థితి ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం జీతాలు పెంచి ఆదుకుంటుంటే కేంద్రం మాత్రం పన్నుపోటు పొడుస్తున్నది. బీజేపీ సర్కారు అనాలోచిత నిర్ణయం నాలాంటి ఎంతో మందికి జీవన్మరణ సమస్య అవుతున్నది. నిత్యావసర వస్తువులతో పాటు చెక్కులపై కూడా 5శాతం జీఎస్టీ విధించడం కేంద్రం ధనదాహానికి పరాకాష్ట. ఇప్పటికైనా కేంద్రం పునరాలోచించాలి. పెంచిన జీఎస్టీ వెంటనే ఉపసంహరించుకోవాలి.
పెరిగిన ధరలతో చిరుద్యోగులు బతికే పరిస్థితి కనిపించడం లేదు. వచ్చిన జీతమంతా ఇంటిఖర్చులకే సరిపోవడం లేదు. ప్రైవేట్ ఉద్యోగం చేసుకునే నాలాంటి ఎంతోమందికి జీఎస్టీ శాపంగా మారింది. పాలు, పాల ఉత్పత్తులతో పాటు నిత్యావసర వస్తువులు, కూరగాయలపై పన్నులు వేస్తే ఏం కొంటం? ఏం తింటం? కేంద్రం తీరు కరెక్ట్ కాదు. పన్నులను రద్దు చేయాలి.
– బోడిగె గిరీశ్, ప్రైవేట్ ఉద్యోగి (మంథని)
పన్నుల భారం పేదోళ్లపైనే పడుతున్నది. ఈ రోజు మార్కెట్లో ఏది కొందామన్నా ధరలు భగ్గుమంటున్నయ్. సామాన్య, మధ్య తరగతి కుటుంబాలు ఎలా గడుస్తున్నయ్? పేదోళ్లు బతుకుడెట్ల? చిన్నాచితకా ఉద్యోగాలు చేస్తూ కుటుంబాలను నెట్టుకొచ్చే వారి పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. బీజేపీ సర్కారు పాలన.. పేదోళ్లను అప్పుల ఊబిలోకి నెడుతున్నది. కేంద్రం ఇప్పటికైనా పునరాలోచించాలి.
– మండల మాళవిక, లాలాపేట్ (పెద్దపల్లి)
బీజేపీ సర్కారు సగటు మనిషి రోజువారీ వినియోగించే వస్తువులపై కూడా పన్ను వేసింది. నిత్యావసరాలపై 5శాతం జీఎస్టీ వేసి, భారం మోపింది. చిరుద్యోగుల సంపాదన పన్ను చెల్లించేందుకే సరిపోతున్నది. నెలవారీ ఇంటి బడ్జెట్ తలకిందులైంది.
పెరుగు ధరే 2 నుంచి 3 పెరిగింది. లెదర్ ఉత్పత్తులపైనా పన్నులు వేయడంతో చెప్పులు కూడా కొనలేని స్థితి. రాష్ట్ర ప్రభుత్వం మాకు జీతాలు పెంచితే.. పేదల పక్షపాతి అని చెప్పుకునే బీజేపీ ప్రభుత్వం మాత్రం పన్నులతో మాలాంటోళ్ల నడ్డ్డి విస్తున్నది. చిరుద్యోగులమంతా బికారులుగా మారుతామనే భయం వేస్తున్నది.
– కోట రామస్వామి, 4వ తరగతి ఉద్యోగుల సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు
బీజేపీ సర్కారు పన్నుల రూపంలో పేదల నుంచి దోచి పెద్దలకు పంచుతున్నది. చాలీచాలని జీతాలతో మేం బతుకు బండిని లాగుతుంటే, కేంద్రం జీఎస్టీతో దండుకుంటున్నది. ఏ వస్తువు కొందామన్నా ధరలు ఆకాశాన్నంటుతున్నయ్.
ఇప్పటి దాకా వచ్చిన జీతంతో సర్దుబాటు చేసుకున్న. కానీ, జీఎస్టీ పెంపుతో ఇక అప్పులు చేయాల్సిందే. లేదంటే బతుకుడే చాలా కష్టం. కేంద్రం పేద, మధ్య తరగతి ప్రజల నడ్డి విరిచేలా దుర్మార్గం. ఇప్పటికైనా పునరాలోచించాలి. పెంచిన జీఎస్టీ వెంటనే ఉపసంహరించుకోవాలి.
– రావికంటి మణికంఠ, పెద్దపల్లి
మాది రాయికల్ మండలం రామోజీపేట. జగిత్యాలలోని ఒక బట్టల దుకాణంలో ఉద్యోగం చేస్తున్న. అయితే కొన్నేళ్ల సంది నెలనెలా భారంగా వెల్లదీస్తున్న. ఒక వైపు జీఎస్టీ వల్ల నిత్యావసరాల ధరలు బాగా పెరిగినయ్. ఏం కొనే పరిస్థితి లేదు. 25 కిలోలలోపు బియ్యం బస్తా నుంచి మొదలుకొని పాలు, పెరుగు, గోధుమ పిండి దాకా అన్నింటిపై జీఎస్టీ వేసిన్రు. వాటి ధరలు బాగా పెరిగిపోయినయ్.
గ్యాస్ సిలిండర్, పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగినయ్. చివరకు పిల్లలకు కంపాక్స్ బాక్స్‌లు, అట్లాస్‌లు కొనివాలన్న కొనివ్వలేని పరిస్థితి. వాటిపైనా జీఎస్టీ వేశారు. దుస్తులపైనా బాదారు. గతంలో పోలిస్తే గిరాకీ తగ్గడం, బయట అన్ని ధరలు పెరగడంతో షాపులు నడిపేందుకు యజమానులు భయపడుతున్నరు. షాపుల తొలగిస్తే మాలాంటోళ్లం ఇబ్బంది పడుతం.
– డేగ్యాల వర్షిణి, రామోజీపేట